జగన్ ధైర్యం చెప్పడం బాగుంది కానీ..

261

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలందరిలోనూ ధైర్యం పాదుగొల్పడానికి జగన్మోహన రెడ్డి ప్రయత్నించారు. అయితే.. కరోనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ.. భరోసా కల్పించే ప్రయత్నం కాస్త గాడి తప్పినట్లుగా అనిపించింది. ఎందుకంటే.. కరోనా ఒక జ్వరం, ఫ్లూ లాంటిది మాత్రమేనని అది పూర్తిగా నయం అవుతుందని జగన్ చెప్పిన మాటలు.. ఈ వైరస్ కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వెల్లడవుతున్న వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయి.

తబ్లిగి జమాత్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దాదాపు 90 వరకు ఈ సంఖ్య చేరుకుంది. వెయ్యికిపైగా రాష్ట్రంనుంచి తబ్లిగి జమాత్ కు వెళ్లివచ్చారని గుర్తించిన నేపథ్యంలో ఇంకా 21 మందిని ట్రేస్ చేయడం కూడా  జరగలేదు. ఆ విషయంలో ప్రజలందరిలోనూ ఆందోళనలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో.. జగన్మోహన రెడ్డి ప్రజలకు ధైర్యం చెప్పారు. పైగా కరోనా సోకిన వారిని భయం భయంగా చూసే పరిస్థితి కూడా ఏర్పడుతున్న నేపథ్యంలో ఆయన పలు రకాలుగా ధైర్యం చెప్పారు.

పొలంపనులు, ఆక్వారంగం పనులు, ఇతరత్రా అన్ని పనులు కూడా ప్రజలు యధావిధిగా చేసుకోవచ్చునని.. కాకపోతే.. ప్రతి ఇద్దరి మధ్య కనీసం మీటరు దూరం ఉండేలా జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని జగన్ తెలియజెప్పడం విశేషం. సోకిన వారిని ఐసొలేటెడ్ గా 14 రోజుల పాటు ఉంచితే సరిపోతుంది.. అని ఆయన చెప్పారు.

ప్రభుత్వంలో సంశయం : లిక్కర్ కు లాకులు ఎత్తాలా వద్దా?

అయితే ఈ క్రమంలో ఆయన మాటలు కొద్దిగా గాడి తప్పాయి. కరోనా మామూలు జ్వరం, ఫ్లూ లాంటిదే. ఇది పూర్తిగా నివారణ చేయడం సాధ్యం- దీనిగురించి ఎలాంటి చింత అక్కర్లేదు. జ్వరానికి వైద్యం చేసినట్టే క్రమం తప్పకుండా వైద్యం అందిస్తే దీనినుంచి బయటపడడం సాధ్యం అవుతుంది అని ఆయన చాలా తేలిగ్గా చెప్పేశారు. కరోనా సోకిన తర్వాత ప్రాణాలతో బయటపడడం జరగవచ్చునేమో గానీ.. జగన్ చెప్పినంత తేలిక మాత్రం కాదు. కరోనాకు మందు కనుగొనడం మీద ప్రపంచంలోని అన్ని దేశాలూ వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రయోగాలు చేయడానికి ఇంకా కుస్తీలు పడుతున్నాయి. అలాంటి నేపథ్యంలో చాలా సింపుల్ గా కరోనా తగ్గిపోతుందంటూ.. జగన్ చెప్పడం మాత్రం అతిశయోక్తిగా ఉంది. ఇది ప్రజల్ని తప్పుదారి పట్టించేది కూడా ఉంది. నాయకుడిగా ప్రజలకు ధైర్యం చెప్పడం అవసరమే. ఆ క్రమంలో ఎన్ని జాగ్రత్తలు చెప్పినప్పటికీ, తప్పుదారి పట్టించేలా కొన్ని మాటలు దొర్లడం మాత్రం అవాంఛనీయం.

Facebook Comments