వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే ఆర్భాటాన్ని ప్రదర్శించినట్టుగా ఆదర్శిని ఆయన యాత్రకు సిద్ధపడినప్పుడే పేర్కొంది. తన చుట్టూ విధించే నిబంధనల బంధనాలను ధిక్కరించి.. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు- అన్నట్టుగా పోలీసులకు, ప్రభుత్వానికి నిరూపించి చూపించాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ ఆర్భాటోత్సాహం ఇప్పుడు బెడిసికొట్టింది. ఒక వ్యక్తి మరణానికి కారణమైన కేసులో ఆయన స్వయంగా ఏ2 నిందితుడిగా మారిపోయారు. ఈ కేసు నుంచి తనను రక్షించాల్సిందిగా ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోవాల్సి వచ్చింది.
జగన్ ప్రజాదరణ ఉన్న నాయకుడు అనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని పాలక పార్టీలు ఒప్పుకోకపోరు.. అదంతా మసకబారిపోయిందని అంటారు. వారి మాటలు కూడా కరక్టే అనుకుందాం. కానీ ప్రతి నియోజకవర్గంలోనూ జగన్ మీద ఆశలు పెట్టుకుని, తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆశపడుతున్న నాయకులు ఇంకా ఉన్నారు. ఆయన కార్యక్రమం ప్లాన్ చేస్తే ఆయన కళ్లలో ఆనందం చూడడానికి వారు డబ్బు ఖర్చు పెట్టి జనాన్ని తోలించగలరు. స్వబుద్ధితో వచ్చేవారికి ఇలా తోలించే జనాలు అదనం అవుతారు.
జగన్ వెళ్లదలచుకున్న పరామర్శ విషయంలో పోలీసులు అనుమతి ఇవ్వడంలోనే తేడాగా వ్యవహరించారు. మాజీ ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు వస్తోంటే కాన్వాయ్ మినహా మూడు వాహనాలు రారాదని అనడం ఒక ఎత్తు. దానికి మించి.. కార్యక్రమంలో వంద మందికి మించి పాల్గొనరాదని ఆంక్ష విధించడం పరాకాష్ట. వీటితో ఆగ్రహించిన జగన్.. తన ధిక్కారాన్ని చాలా ఘనంగా ప్రకటించాలనుకుని అత్యుత్సాహం చూపించారు.
జగన్ తన కాన్వాయ్ వెంట యాభై వాహనాలు తీసుకువెళ్లి ఉన్నా, రెంటపాళ్లలో అనుకున్నట్టుగా 30 వేల మందితో కార్యక్రమం చేసిఉన్నా.. అక్కడితో పరిమితమై ఉంటే చాలా బాగుండేది. కానీ ఆయన తన అత్యుత్సాహాన్ని దారిపొడవునా చూపించాలనుకున్నారు. అదే ఇప్పుడు కొంప ముంచింది.
జరిగింది ప్రమాదమే కావొచ్చు. దారి పొడవునా జగన్ కారులోంచి పైకి నిల్చుని ఎగబడుతున్న అభిమానులకు కరచాలనాలకు చేయి అందించడం చాలా పెద్ద తప్పు. ఒకవైపు నాకు భద్రత లేదు అంటారు. తెలుగుదేశం గూండాలు హత్యాయత్నం చేసే అవకాశం ఉందనీ అంటారు. ఇన్ని ఆరోపణలు చేస్తూ.. అంత విచ్చలవిడిగా అందరికీ కరచాలనాలకు చేయి అందిస్తే. సహజంగానే అభిమానులు కాని వారు కూడా.. తమ చేతిని జగన్ చేతికి తాకించడానికి ఎగబడతారు. అలా జగన్ తన వాహనం మీదికి గుంపులుగా ఎగబడే పరిస్థితికి నిస్సందేహంగా జగనే కారణం.
ఆ తోపులాటల్లో ప్రమాదవశాత్తూ సింగయ్య కారు కింద పడిపోయి ఉండొచ్చు. కానీ.. అంత నిదానంగా వాహనం వెళుతున్నప్పుడు.. ముందు చక్రానికి ఏదైనా అడ్డం పడితే.. డ్రైవరు గుర్తించకలేకపోవడం జాగ్రత్త పడకపోవడం ఘోరం. విడుదలైన వీడియోలో సింగయ్యను తొక్కించుకుంటూ చక్రం దాటి వెళ్లినట్టు లేదు. కానీ.. వార్తలను బట్టి.. సింగయ్యను ఆ గుంపులోని జనం తీసి, రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. ఆయనను ఆస్పత్రికి తరలించాలని తమ పార్టీ వారు పూనుకోగా, అంబులెన్సు వచ్చేదాకా ఆగాలని పోలీసులు చెప్పినట్టుగా వైసీపీ నేతలు సమర్థించుకుంటున్నారు. అక్కడికేదో వారు ప్రతిపనినీ పోలీసుల ఆదేశాల మేరకు చేస్తున్నట్టుగా కలర్ ఇస్తున్నారు. పోలీసు ఆంక్షలను అన్ని రకాలుగా ధిక్కరించిన వారు.. మరో ధిక్కరణకు పాల్పడలేరా? గాయపడిన తమ సొంత కార్యకర్తను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి వారికి పోలీసు ఆంక్షలే అడ్డు వచ్చినట్టుగా మాట్లాడడం నవ్వు తెప్పిస్తోంది. వైసీపీ నాయకులు బాధ్యతారహితమైన ప్రకటనలకు పరాకాష్ట ఏమిటంటే.. తాము ఆస్పత్రికి తీసుకెళ్తామన్నప్పుడు ఒప్పుకోకుండా పోలీసులు అంబులెన్సులో తీసుకెళ్లాకే మరణించినట్టు తెలిసిందని, ఇది అనుమానాలు కలిగిస్తోందని అనడం. అంటే.. దార్లో అంబులెన్సులో పోలీసులో, మరొకరో సింగయ్యను చంపేసి.. వైసీపీ మీదికి నేరం నెట్టాలని కుట్ర చేస్తున్నారనే అనుమానం ఉన్నట్లుగా వారు ధ్వనింపజేస్తున్నారు. ఇది పరాకాష్ట.
ఏతావతా జగన్ ఇప్పుడు క్వాష్ పిటిషన్ వేసి.. తనను కేసు నుంచి తప్పించాలని హైకోర్టును వేడుకోవాల్సి వస్తోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట తరువాత అల్లు అర్జున్ కూడా క్వాష్ పిటిషన్ వేశారు. దానివల్ల బెయిలు దొరికిందే తప్ప మరో ప్రయోజనం ఒనగూరలేదు. ఆయన పోలీసు స్టేషను చుట్టూ తిరగాల్సి వచ్చింది. పైగా ఆ తొక్కిసలాటకు అల్లు అర్జున్ తీసుకోవాల్సిన బాధ్యతకు, సింగయ్య మరణంలో జగన్ బాధ్యతకు చాలా తేడా ఉంది. క్వాష్ పిటిషన్ వలన మహా అయితే జగన్ కు కూడా బెయిలు వస్తుందే తప్ప.. సింగయ్య హత్యాపాపం అంత సులువుగా వదిలిపోదు.
పోలీసులు కేసు పెట్టిన వారందరూ క్వాష్ పిటిషన్ వేయడం తమాషా. జగన్ సహా అందరు నాయకులు, చివరికి కారు డ్రైవర్ సహా క్వాష్ వేశారు. ఎవ్వరికీ సంబంధం లేకపోతే మరి సింగయ్య ఎలా చనిపోయినట్టు? ఈ విషయం దర్యాప్తు అధికారులు, న్యాయస్థానాలు తేలుస్తాయి. జగన్ మాత్రం పోలీసులను ధిక్కరించడంలో తన అత్యుత్సాహాన్ని కొంత తగ్గించుకోకుంటే.. ముందు ముందు కూడా మరో రకమైన చిక్కులు తప్పకపోవచ్చు.
Discussion about this post