చెప్పింది జాగ్రత్త.. చెలరేగుతోంది చెత్త!💐

155

ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి రాష్ట్ర ప్రజలకు జాగ్రత్త చెప్పారు. కరోనాతో కలసి జీవించాల్సిందేనని ఆయన అన్నారు. అక్షరాలా ఇది ప్రజలకు ఆయన చేసిన హెచ్చరిక మాత్రమే. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పినట్లుగా, కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనే వరకు ఈ వ్యాధినుంచి ప్రపంచం, మానవ సమాజం సురక్షితంగా ఉందని అనుకోవడం భ్రమ. ఎవరైనా ఆ సంగతిచెప్పినా కూడా వారు ప్రజలను వంచించినట్టే. ఆ మాటకొస్తే.. ఇటీవలి ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రజలను ఉద్దేశించి చెప్పింది కూడా అదే సంగతి. కరోనా సంపూర్ణంగా అంతం కావడం అనేది ఇప్పట్లో సాధ్యం కాదనే సంగతినే ప్రధాని కూడా చెప్పారు. 

అయితే కేవలం పదజాలంలో తేడా ఉంది. మోడీ వేరే పదాల్లో చెప్పారు. జగన్మోహన రెడ్డి వేరే పదాల్లో చెప్పారు. ఈ ఎడ్వాంటేజీని చంద్రబాబు వాడుకున్నారు.

నిజానికి ఇలాంటి ఇలాంటి మాటల అవకాశం ఏడాదిన్నర ముందు దొరికి ఉంటే గనుక.. చంద్రబాబునాయుడు నరేంద్రమోడీని కూడా ఓ ఆటాడుకునే వారే. కానీ.. ఇప్పుడు మోడీ మీద విమర్శలు చేసేంద దమ్ముల్లేవు. ఆయన ప్రాపకం దొరుకుతుందేమోనని, ఆయన పట్ల, విధానాల పట్ల అత్యంత పాజిటివ్ గా స్పందిస్తున్నారు. కానీ.. జగన్మోహన రెడ్డిని వదలదల్చుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులకు, సోషల్ మీడియాలో మెమెలు తయారుచేసే వైరల్ గా మార్చే బృందాలకు అందరికీ స్పష్టమైన సంకేతాలు వెళ్లాయి. జగన్మోహనరెడ్డి సహజీవనం అన్న పదాన్ని దారుణంగా వాడుకోవడానికి ఫిక్సయిపోయారు. 

ఎడాపెడా దాన్ని ప్రచారంలోకి తెస్తున్నారు. ముఖ్యమంత్రి- ప్రజలను హెచ్చరిస్తూ.. ఇదే జాగ్రత్తలతో సుదీర్ఘకాలం పాటూ బతకవలసిందే అని చెప్పిన మాటల్ని వక్రీకరించి తెలుగుదేశం దళాలన్నీ రెచ్చిపోతున్నాయి. 

ఆ మాటకొస్తే.. ఒకప్పుడు చంద్రబాబునాయుడు మాటల్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వాడుకున్నదో అదే ఇప్పుడు రిపీట్ అవుతోంది. చంద్రబాబునాయుడు.. విద్యుత్తు విషయమై మాట్లాడుతూ.. సుదీర్ఘమైన వ్యాఖ్యానాల మధ్యలో ‘‘కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే’’ అనే పదం వాడారు. ఆ ఒక్క పదాన్ని మాత్రం పట్టుకుని, చంద్రబాబు నాయుడును రైతు వ్యతిరేకిగా బద్ నాం చేయడానికి ఇవాళ్టి వరకు కూడా వైకాపా  దళాలు రెచ్చిపోతూ ఉండే మాట వాస్తవం.

ఇప్పుడు అదే తరహాలో తెలుగుదేశానికి ఒక పదం దొరికింది. కానీ తెలుగుదేశం దానిని వాడుకుంటున్న తీరు మరింత ఏహ్యభావం కలిగించేది. ఎందుకంటే చంద్రబాబు- కరెంటు తీగల వ్యవహారం కేవలం రాజకీయ ఉద్దేశాలు తప్ప మరొక ప్రయోజనం కలిగి ఉండేదికాదు. కానీ.. కరోనా సంగతి అలా కాదు. ఇది మహమ్మారి. ఇలాంటి విషయంలో ఏ పార్టీ నాయకులు అయినా సరే.. బాద్యతగా మాట్లాడాలి. తమ ప్రతి మాటకు- కొంతమేర ప్రజలను ప్రభావితం చేయగల శక్తి ఉంటుందని తెలుసుకోవాలి. తెలుగుదేశం నాయకులు దారి తప్పిపోయారు.

భావాన్ని వ్యక్తీకరించడంలో ఉండే బలహీనత వల్ల.. జగన్ అలా మాట్లాడారే అనుకుందాం. కానీ.. ఆ మాటల భావాన్ని తెలుగుదేశం నాయకులు కాదనగల స్థితిలో ఉన్నారా? ఇవాళ జగన్ ను ఇన్ని రకాలుగా ఎద్దేవా చేస్తున్న ఈ బ్యాచ్.. ఇదే సమయంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే గనుక. ఈ పాటికి కరోనాను అంతం చేసేసి ఉండేవాడని.. దేశమంతా కరోనాతో చచ్చిపోతున్నా సరే.. ఆంధ్రప్రదేశ్ లో మాయమైపోయి ఉండేదని.. అలా చంద్రబాబు చేసి ఉండగలడని చెప్పగలరా? రేపో ఎల్లుండో ఏదో ఒకనాటికి మా చంద్రబాబు దీనిని అంతం చేసేస్తాడు అనగలరా? సాధ్యం కాదు- కానీ అదే మాటల్ని మరో రకంగా చెప్పినందుకు ఇవాళ జగన్ మోహన్ రెడ్డి వీళ్ల నిందలు భరించాల్సి వస్తోంది. ఇలాంటి అనుచిత రాజకీయ పోకడలు.. ప్రజలకు మేలు చేయవు. 

Facebook Comments