తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్ఠాభిషేకం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఆషాఢ మాసంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్ఠాభిషేకం
నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి కైంకర్యాలు నిర్వహించారు. శతకలశస్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు. ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం స్వామివారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాఢ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
ఈకార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ప్రధానార్చకులు
శ్రీనివాస దీక్షితులు, ఏఇవో రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు నారాయణ, మోహన్ రావు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు రాధాకృష్ణ, ధనంజయులు పాల్గొన్నారు.
Discussion about this post