తెలంగాణముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలను ఆదుకోవడం కోసం.. ఎంతో అట్టహాసంగా, ఆప్తహస్తం అందించే మాదిరిగా రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సాయం అందించే పథకం ఇది. ఇది ఎంత గొప్ప పథకంగా గుర్తింపు తెచ్చుకున్నదంటే.. అనేక ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్రంలోని మోడీ సర్కారు కూడా దీనిని కాపీ కొట్టాయి.
అయితే ఈ కేసీఆర్ రైతు బంధు పథకం మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. పేద ధనిక తేడా లేకుండా.. బాగా సంపన్న వర్గాలకు చెందిన, వందల ఎకరాల భూములున్న వారికి కూడా ఎకరాల లెక్కన ప్రభుత్వ సాయం అందించడం మంచి పద్ధతి కాదనే వారున్నారు. సరిగ్గా ఇదే విషయాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పట్టించుకుంది. ఈ లోపం గురించి వారు ప్రభుత్వానికి ఒక వినతిపత్రం ఇచ్చారు.
వారు ఏం చెబుతున్నారు…
ఇంతకూ రైతు బంధు విషయంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏం చెబుతోంది? రైతుబంధు పథకం కింద చేసే ఆర్థిక సహాయాన్ని కేవలం 5 ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయాలని ఈ ఫోరం సూచిస్తోంది. ఇలా చేయడం వల్ల చిన్న మరియు సన్నకారు రైతులకే లాభం కలుగుతుంది. నిజం చెప్పాలంటే.. ఇరవై ముప్పయి ఎకరాల భూములు ఉన్న రైతులు కూడా చాలా మంది.. కుటుంబ సభ్యుల్లో వేర్వేరు వ్యక్తుల పేర్లతో ఆ ఆస్తులు కలిగి ఉంటారు. అలాంటి వారికి కూడా అంటే, ఇలాంటి సూచన వల్ల రైతు బంధు సాయం అందే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుతం అమలవుతున్న తీరులో.. వందల ఎకరాలు కలిగిఉన్న భూస్వాములకు కూడా.. రైతు బంధు సాయం అందిస్తున్నారు. రాష్ట్రంలో ఈ పథకం ప్రారంభించిన తొలి సందర్భంలోనే.. గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి సంపన్నులు.. తమ పొలాలకు రైతుబంధు ద్వారా అందిన సాయాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేశారు. నిజంగానే ప్రభుత్వ సాయం పొందే పేదవాడిని తాను కాదనే ఉద్దేశంతో తిరిగి ఇచ్చారో లేదా, అలాంటి పని ద్వారా రాజకీయ మైలేజీ సాధ్యమని అనుకున్నారో గానీ.. మొత్తానికి గుత్తా తిరిగి ఇచ్చారు. వేళ్ల మీద లెక్క పెట్టగలిగినన్ని సంపన్న రైతులు మాత్రమే అలా తిరిగి ఇచ్చారు.
కానీ వాస్తవంలో ఐదెకరాలు మించి కలిగి ఉన్న రైతులకు కూడా రైతు బంధు వర్తించడం వల్ల ప్రభుత్వానికి పడుతున్న భారం ఎంతో కూడా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లెక్కకట్టి చెప్పింది. వారి గణాంకాల ప్రకారం ఈ భారం పది వేల కోట్లకు పై మాటే! సాయాన్ని పేదలకు, మధ్యతరగతి రైతులకు మాత్రం పరిమితం చేసి.. సంపన్న రైతుల్ని మినహాయించడం వల్ల ప్రభుత్వానికి ఏటా పది వేల కోట్ల రూపాయలు మిగులుతాయని లెక్క తేల్చారు.
ఫోరం వారి సూచన మాత్రం అత్యద్భుతంగా ఉంది. అయితే.. దీనిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం ఎంత మేరకు చెవిన వేసుకుంటుందో వేచిచూడాలి.