రేణిగుంటలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో పేద విద్యార్థుల సీట్లను అమ్ముకుంటున్నారని టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. తొలి జాబితాలో ఎంపికైన వారిలో అమాయకులకు కుంటి సాకులు చెప్పి అడ్మిషన్ ఇవ్వడం లేదని తెలిపారు.
ఈ సీట్లను వెయిటింగ్ జాబితాలో వున్న తమకు అనుకూల మైన వారికి లక్ష రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారని చెప్పారు. ఈ ఏడాది తిరుపతికి చెందిన ఎం ఎస్ రెడ్డి కుమార్తె దీక్షితకు విద్యాహక్కు కింద ఒకటవ తరగతిలో సీటు వచ్చిందని తెలిపారు. అయితే వారి నివాస స్థలం దూరంగా ఉందన్న నెపంతో అడ్మిషన్ తిరస్కరించారని చెప్పారు. సాధారణంగా విద్యార్థుల నివాసం ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉండాలన్న నిబంధన ఉందని తెలిపారు.
అయితే వారి నివాసం గూగుల్లో తొమ్మిది కిలో మీటర్ల దూరం చూపుతున్నందున అడ్మిషన్ ఇవ్వలేమని చెపుతున్నారని చెప్పారు. తాము అద్దె ఇంటిలో ఉన్నామని, నెల లోపల దగ్గరగా ఉన్న ఇంటిలోకి మారిపోతామని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అలాగే విద్యా హక్కు కింద సీట్లు వచ్చిన మరో ఐదు మంది అడ్మిషన్లు తిరస్కరించారని తెలిసిందన్నారు.
విద్యార్థుల తల్లి తండ్రుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ, అమర్యాదకరంగా సమాధానాలు చెపుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. దీనిపై దూరం పరిగణనలోకి తీసుకుని అడ్మిషన్లు తిరస్కరించడం కుదరదని ఢిల్లీ, అలహబాద్, మద్రాసు హైకోర్టులు తీర్పులు ఇచ్చిన విషయం చెప్పనా ఖాతరు చేయలేదని చెప్పారు. అలాగే విద్యార్థులకు కొత్త పుస్తకాలు కొని ఇవ్వడంలోను అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు.
కొత్త పుస్తకాలు కొనడం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించి నప్పటికీ విద్యార్థుల చేత పాత పుస్తకాలు సేకరించి పంపిణీ చేస్తుంటారని చెప్పారు. విద్యాహక్కు కింద అడ్మిషన్ పొందిన 25 శాతం మందికి పూర్తిగా అన్ని సదుపాయాలు విద్యాలయం వారే సమకూర్చ వలసి ఉందని చెప్పారు.అయితే ఇందులో చాలా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.
దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే హైకోర్టులో రిట్ ఫిటిషన్ వేస్తామని సుధాకర్ రెడ్డి చెప్పారు.
.