ఇండియా కూటమి నాయకులందరూ కలిసి కాంగ్రెస్ సారథి మల్లికార్జున ఖర్గే పేరును తమ కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించారు. ఇలా చేయడం వెనుక కూటమి పార్టీల ఆంతర్యం ఆంతర్యం ఏమైనా అయి ఉండవచ్చు గాక.. కానీ మల్లికార్జున ఖర్గే మాత్రం తన రాజకీయ పరిణతిని, లౌక్యాన్ని చాటుకున్నారు. ఆయన కాంగ్రెస్ అధిష్టానం, నెహ్రూ కుటుంబం పట్ల తన విధేయతను ప్రదర్శిస్తూ.. ప్రధాని అభ్యర్థిగా తన పేరు గురించి అప్పుడే ప్రకటన చేయడం వద్దు అని సహచర నాయకులను వారించారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం మరోసారి ఏర్పడకుండా ఎట్టి పరిస్థితులలో అడ్డుకోవాలని.. దేశవ్యాప్తంగా ఉన్న భాజపాయేతర పక్షాలన్నీ కలిసికట్టుగా పోరాడుతున్నాయి. ఇండియా కుటుంబ పేరుతో.. మోడీ వ్యతిరేక ఓటు ఏ కాస్త కూడా చీలకుండా ఉండేందుకు దేశంలోని పార్టీలన్నీ కూడా ఒక్కతాటి మీదకు వచ్చాయి. ఈ పార్టీల మధ్య కూడా చిన్న చిన్న లుకలుకలు ఉన్నప్పటికీ మోడీని ఓడించాలని ఉద్దేశంతో సర్దుకుపోతున్నారు.
తాజాగా ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో ప్రధానిగా మల్లికార్జున ఖర్గే పేరు ప్రస్తావనకు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. మమతా బెనర్జీ సహా పలువురు నాయకులు ఆయన పేరును ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఇదివరలో ప్రధానిగా రాహుల్ గాంధీ పేరును ప్రకటించి ఇండియా కూటమి ముందుకు వెళ్లాలని వామ పక్షాలు సహా పలువురు నాయకులు చెబుతూ వచ్చారు. అయితే ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెసుకు ఎదురైన ఫలితాల నేపథ్యంలో పరిస్థితి మారుతున్నట్లుగా కనిపిస్తోంది. ఖర్గేను తెరమీదికి తీసుకొస్తున్నారు.
అయితే ఖర్గే మాత్రం వీరి ప్రతిపాదించడం ఒప్పుకోకుండా ప్రధాని గురించిన ప్రకటన ఇప్పుడు వద్దని, ఎన్నికల ఫలితాల తర్వాత చూసుకోవచ్చని చెబుతున్నారు. తద్వారా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పట్ల తన విధేయతను ఆయన ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కితే గనుక, అప్పుడు పార్టీ తరఫున రాహుల్ గాంధీని తెరమీదకు తెచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెసు తన స్థానం పదిలంగా ఉంచుకోవడానికి ఇది ఖర్గే యొక్క వ్యూహాత్మక విధేయుత అని పలువురు భావిస్తున్నారు.
Discussion about this post