ఒక్కొక్కసారి మనసు మగతగా మారిపోతూంటుంది, ఈ మనుషుల మనస్తత్వాలను చూసి. ఎవరికివారు యమునాతీరే అన్నట్లు ప్రవర్తిస్తుంటారు ఈ మనుషులు. ఎవరికీ ఎవరిమీదా ప్రేమాభిమానాలులేవు, ఆప్యాయతానుబంధాలులేవు. మమతానురాగాలులేవు. ఉన్నదంతా కోపావేశాలు, అసూయాద్వేషాలు, పంతాలు -పట్టింపులు.
నేటి కుటుంబాలలో…
భార్యభర్తల మధ్య ఆప్యాయతానురాగాలులేవు.
తల్లిదండ్రులంటే పిల్లలకు గౌరవంలేదు.
అత్తాకోడళ్ల మధ్య సఖ్యతలేదు.
నేటి సమాజంలో…
ఆడవాళ్లకు రక్షణలేదు.
నీతినియమాలులేవు.
మనుషుల మధ్య సాయంలేదు, సహకారంలేదు.
నేటి పాఠశాలల్లో…
గురువులంటే భయంలేదు, భక్తిలేదు.
పిల్లలకు చదువులేదు, సంస్కారంలేదు.
తల్లిదండ్రులకు పిల్లల చదువుపట్ల ఆసక్తిలేదు, అభిరుచిలేదు.
అందుకే…
ఇవన్నీ చూడలేక, వినలేక ఒక్కొక్కసారి మనసు మగతగా మారిపోతూంటుంది, ఈ మనుషుల మనస్తత్వాలను చూసి. ఈ కారణంచేతనేమో భగవంతుడు మనిషికి గాఢనిద్రను కల్పించాడు. ఆ గాఢనిద్రలో ఏమీ కనిపించవు, వినిపించవు, అనిపించవు. అందుకే అప్పుడు హాయిగా ఉంటుంది. ఆ గాఢనిద్రలో ఏమీ తెలియదు. అందుకేనేమో గాఢనిద్రను మరణంతో పోల్చారు ఋషులు. మరణించినవాడికి ఈ ప్రపంచం ఉండదు. గాఢనిద్రలో ఉన్నవాడికి కూడా ప్రపంచం ఉండదు.
కాబట్టి…
ఈ ప్రపంచంలో ఏమి కనిపించినా కనిపించనట్లు, ఏమి వినిపించినా వినిపించనట్లు, ఏమి అనిపించినా అనిపించనట్లు నిర్జీవంగా మరణంలో ( గాఢనిద్రలో) ఉండిపోతే జీవితం మధురంగా గడచిపోతుంది.
అలా ఉండడం ఏ మనిషికీ సాధ్యంకాకపోయినా ఏంచేస్తాం ఇక ఏ మార్గమూ కనిపించడంలేదు. అందుకే చచ్చినట్లు చావాల్సిందే. అదేనండి మరణించినట్లు (గాఢనిద్రించినట్లు) మరణించాలి.
అందుకే…
ఇప్పుడు మనుషులకు మరణమే (గాఢనిద్రే) మధురం.
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159

.