ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా చిత్రమైన నిర్ణయాన్ని అమలుచేస్తున్నారు. ఆయనకు తన పాలన పట్ల ప్రజల్లో అపరిమితమైన గౌరవమూ అభిమానమూ ఉన్నాయనే నమ్మకం ఉంది. తన బొమ్మ చూసి, తన పథకాలను చూసి ప్రజలు ఇబ్బడి ముబ్బడిగా ఓట్లు వేస్తారనే నమ్మకం కూడా ఉంది. ప్రజలకోసం ఇంత చేస్తున్నాం.. తన పార్టీని మరోసారి నెత్తిన పెట్టుకుని గెలిపిస్తారని ఆయన విశ్వాసం.
అంత నమ్మకం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను మాత్రం ఎందుకిలా ఎడా పెడా మారుస్తున్నారు. మంత్రులను కూడా ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేస్తున్నారు ఎందుకు? అనే సందేహం రావడం సహజం.
పార్టీ మీద,. జగన్ మీద ప్రజల్లో అపరిమితమైన అభిమానం ఉన్నది గానీ.. స్థానికంగా ఎమ్మెల్యే మీద అపరిమితమైన వ్యతిరేకత పేరుకుపోయి ఉన్నదనే సంకేతాలు ఆయనకు అందినట్లుగా మనం భావించాలి. ఇలాంటి సంకేతాలను ఎవరు ఇస్తారు? సందేశాలను ఆయన దాకా ఎవరు మోసుకెళ్తారు? ఇంతకూ ఆయన అసలు ఎవరిని విశ్వసిస్తారు? ఇవన్నీ కూడా పరిగణించాల్సిన విషయాలు!
జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా తాను చేయించుకుంటున్న సర్వే నివేదికల మీద ఆధారపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని బహుధా ప్రచారంలో ఉంది. ఐప్యాక్ వారి సేవల మీద గత ఎన్నికల నుంచి కూడా జగన్ బాగా ఆధారపడుతున్నారు. ఇప్పుడు కూడా ఈ సలహాలు సూచనల మేరకే ఈ బదిలీలు కొన్ని చోటు చేసుకుంటూ ఉండవచ్చు. అయితే ఈ మార్పులను సూచిస్తున్న వారు నిజాయితీగానే తమ సూచనలు ఆయనదాకా తీసుకెళ్తున్నారా? అనే సందేహం కూడా కలుగుతుంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న మాట నిజమైతే కేవలం ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చినంత మాత్రాన ఆ వ్యతిరేకత మొత్తం తుడిచిపెట్టుకుపోతుందా? మరేమీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా? సిటింగులపై వేటు వేయడం లేదా మార్చడం ఒక్కటే వ్యతిరేకతను ఉపశమింపజేసే మందు అని జగన్ సలహాదారులు ఆయనను తప్పుదారి పట్టిస్తున్నారా? ఆయన వారి మాయలో ఉన్నారా? ప్రభువు మనసెరిగి ప్రవర్తించే అలవాటు ఉన్న అలాంటి సలహాదారులు.. అంతిమంగా పార్టీకి చేటు చేసే విధంగా మారుతున్నారా? అనే అనేక రకాల సందేహాలు కలుగుతున్నాయి.
స్థానికంగా వ్యతిరేకత మూట గట్టుకున్న వారిపట్ల జగన్ ఎందుకు ఇలాంటి మెతక వైఖరి అవలంబిస్తున్నారో అర్థం కాని సంగతి. పార్టీ ఆయన సొంతం. ఆయన ఆ పార్టీకి మోనార్క్. ఎవరి మెహర్బానీకోసమూ ఆయన నిర్ణయాలు తీసుకునే అవసరం లేదు. అలాంటప్పుడు.. మంత్రి పదవులు ఇచ్చినా సరే.. తన సొంత నియోజకవర్గంలో ప్రజాభిమానం కూడగట్టుకోలేకపోయిన అసమర్థుల్ని జగన్ ఎందుకు ఉపేక్షించాలి? అలాంటి వారిని నియోజకవర్గాలు మార్చి మరో చోట నుంచి పోటీకి దించాల్సినంతటి అగత్యం ఆయనకేమిటి? ఆయన భావిస్తున్న సుపరిపాలనను అయిదేళ్ల పాటు అందిస్తుండగా.. ప్రజల్లో తమకంటూ మంచి పేరు తెచ్చుకోలేకపోయిన అసమర్థ నాయకులు అసలెందుకు పనికి వస్తారు? అలాంటి వారిని పూర్తిగా పక్కన పెట్టేసి.. నిర్మొహమాటంగా కొత్తవారికి అవకాశం కల్పిస్తూ జగన్ ఎందుకు నిక్కచ్చిగా వ్యవహరించలేకపోతున్నారు? అనేవన్నీ కూడా ప్రజల మదిలో ప్రశ్నలే.
కేవలం నియోజకవర్గాలు మార్చడం ఒక్కటే పార్టీకి రక్షాకవచంగా నిలవలేకపోవచ్చు. ప్రజలలో వ్యతిరేకత ఉన్నదనే ఎలాంటి భయమైతే.. ఈ బదిలీలకు అధినేత జగన్ ను పురిగొల్పినదో.. అదే వ్యతిరేకతను ఉపశమింపజేయడానికి ఆయన ఇంకా చాలా చర్యలు తీసుకోవాలి. సర్వేలు చేసే ప్రతినిధుల ద్వారా గానీ.. సలహాదారుల ద్వారా గానీ ఆయన అలాంటి కసరత్తు చేయాలి.
..కె.ఎ. మునిసురేష్ పిళ్లె
సంపాదకుడు, ఆదర్శిని
Discussion about this post