శత్రువు బలమైన వాడైనప్పుడు.. మనలో ఐక్యత ఆటోమేటిగ్గా పెరుగుతుంది. ఇది సార్వజనీనమైన, సార్వకాలీనమైన సత్యం. కుటుంబ వ్యవహారాలు తీసుకోండి, పార్టీల అంతర్గత రాజకీయాలు తీసుకోండి, పురాణాల్లో గానీ, చరిత్రలో గానీ.. ఎలాంటి దృష్టాంతాలనైనా తీసుకోండి… బలమైన శత్రువును ఎదుర్కోవడానికి ఐక్యరాగం ఆలపించడం అనేది తరచూ కనిపిస్తుంది. ఇప్పుడు ‘కరోనా’ అనే మహమ్మారిని ఎదుర్కోవడానికి దేశం మొత్తంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒక్కతాటి మీదకు వస్తున్నాయి.
మోడీ ఒక నిర్ణయం తీసుకుంటే.. సోనియా, రాహుల్, మమతా బెనర్జీ, వామపక్ష నాయకులు సహా దానికి అండగా నిలవడం అనేది మన దేశంలో ఎన్నడూ చూడలేదు. ఈ పరిస్థితి కేవలం కేంద్రంలో మాత్రమే కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ వైరుధ్యాలు ఈ విషయంలో ఏమాత్రం కనిపించడం లేదు.
తెలంగాణలో విపక్షాలు అన్నీ నోరెత్తకుండా ఉంటున్నాయి. పైగా కనీసం ఎవ్వరూ సలహా అయినా చెప్పవలసినంత అవసరం రాకుండానే.. కేసీఆర్ కరోనా విషయంలో చాలా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. తీసుకుంటున్న నిర్ణయాల్ని చాలా క్రమశిక్షణతో అమలు చేయడం కూడా జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి, ప్రజలకు చంద్రబాబునాయుడు సలహాలు మాత్రమే ఇస్తున్నారు. ఈ విషయంలో రాజకీయాలు తగదంటూ ఆయన ముందే పిలుపు ఇచ్చారు. నాయకుల నుంచి ఒకటి రెండు సినికల్ ప్రకటనలు వచ్చాయి గానీ.. చాలా వరకు పాజిటివ్ పాలిటిక్స్ మాత్రమే నడుస్తున్నాయి. తెలుగుదేశంలో చంద్రబాబునాయుడు నుంచి ఈ స్ఫూర్తిని అందుకోలేకపోయిన కొందరు నాయకులు మాత్రం.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో రంధ్రాన్వేషణ చేయడానికి, రాజకీయ లబ్ధి పొందడానికి కుయత్నాలు చేస్తున్నారు.
ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే.. కేవలం శత్రువు మనకంటె బలమైన వాడు అయినప్పుడు మాత్రమే కాదు.. సంక్షేమం ప్రజలందరినీ ఉద్దేశించినది అయినప్పుడు కూడా.. రాజకీయ కూహకాలు లేకుండా అడుగులు వేస్తే బాగుంటుంది. సాధారణంగా అసెంబ్లీలో.. ఏ ఒక్క సభ్యుడూ కూడా భిన్నాభిప్రాయం వ్యక్తం చేయకుండా అటు పార్లమెంటులో గానీ.. ఇటు అసెంబ్లీల్లో గానీ.. ఓకే అయ్యే బిల్లు అప్పుడప్పుడూ మనకు కనిపిస్తుంటుంది. అది సభ్యుల జీతాలు పెంచే బిల్లు మాత్రమే. చాలా మంచి ప్రజా సంక్షేమ పథకాల విషయంలో కూడా ప్రతిపక్షాలు చాలా సందర్భాల్లో రంధ్రాన్వేషణ చేస్తుంటాయి. ఈ స్ఫూర్తితో అయినా.. ఇలాంటి పాజిటివ్ పాలిటిక్స్ ను పార్టీలు అలవాటుగా చేసుకోవాలని కోరుకుందాం.
.

Discussion about this post