వర్షాకాలంలో అకస్మాత్తుగా కుంభ వర్షం కురిస్తే వెంటనే దగ్గరలోనున్న చెట్టుకిందకో, ఏ ఇంటి వసారా కిందకో వెళ్ళి తలదాచుకుంటాం. వరుణిపై కోపం చూపించం.
వేసవికాలంలో భగభగలాడే విపరీతమైన ఎండకాస్తే వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి చల్లని పానీయాలను సేవిస్తాం. సూర్యునిపై ద్వేషాన్ని ప్రదర్శించం.
శీతాకాలంలో ఎముకలు కొరికే చలిగాలి వీస్తే వెచ్చనైన స్వెటర్లను ధరిస్తాం. లేకపోతే దట్టమైన దుప్పట్లను కప్పుకుంటాం. మంచుపై విరక్తితో విరుచుకుపడం.
అదేవిధంగా అకస్మాత్తుగా మనకు కాలిలో ముళ్ళు గుచ్చుకున్నా, పొరబాటుగా మన మోచేయిని మనమే దెబ్బ తగిలించుకున్నా, ఏమరపాటుగా నిప్పు కణికలు తొక్కేసినా ఏవరిమీదా, దేనిమీదా కోపాన్నిగాని, ద్వేషాన్నిగాని ప్రదర్శించం. మనకు మనమే సముదాయించుకుని మౌనంగా ఆ బాధను అనుభవిస్తాం.
అలాకాకుండా మనల్ని ఎవరైనా తిట్టినా, కొట్టినా, గిల్లినా, గిచ్చినా వెంటనే అవతలి వ్యక్తులపై కోపాన్ని, ద్వేషాన్ని ప్రదర్శించేస్తాం. ఒక్కొక్కసారి తిరగబడి కొట్టేస్తాం కూడా. అప్పుడు సమస్యలు మరింత జటిలం అయిపోతాయి.
ఇలాంటి సందర్భాలలో సమస్యలు జటిలంగా కాకుండా ఉండాలంటే మొదట చెప్పిన సందర్భాలలో ఎవరిమీదా, దేనిమీదా కోపాన్నిగాని, ద్వేషాన్నిగాని ప్రదర్శించకుండా మనల్ని మనమే సముదాయించుకుని మౌనంగా ఉండిపోయామో అలా ఉండిపోవాలి. అప్పుడు ఎలాంటీ సమస్యలు ఉత్పన్నం కావు.
మరి ఇలా ఉండడం సాధ్యమేనా అంటే సాధ్యమే. ఏదైనా ప్రయత్నించి చూస్తేగాని తెలియదుకదా. మనం ఎప్పుడూ ఆ దిశగా ఆలోచించంకూడా. “సాధనమున పనులు సమకూరు ధరలోన” అన్నారు కదా పెద్దలు.
ప్రయత్నించి చూద్దాం. మొదట్లో కష్టంగానే ఉంటుంది. ఆ తర్వాత మెల్లిగా అలవాటు అవుతుంది. కొన్నిరోజులకు అలా ఉండడం పూర్తిగా సాధ్యమవుతుంది. అప్పుడు మనల్ని అనవసరంగా ఎవరు ద్వేషించినా, దూషించినా మన మనసుకు ఎలాంటీ బాధ అంటదు. అప్పుడు మనం హాయిగా ఉండొచ్చు.
కొసమెరుపు:
ఇవాళ ఉదయం దేవుని పటాల దగ్గర ధూప,దీప, నైవేద్యాలు సమర్పించాక, ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని దేవుని దగ్గర పెట్టే సామ్రాణి దూప్ స్టిక్ ని హాల్లో ఉన్న టీపాయ్ పక్కన నేలపై వెలిగించి పెట్టాను. టిఫిన్ చేసిన కొంతసేపటి తర్వాత టీ పాయ్ దగ్గర దూప్ స్టిక్ పెట్టిన విషయం మర్చిపోయాను. ఆ కారణంచేత ఏమరుపాటుగా నా ఎడమకాలు ఆ ధూప్ స్టిక్ పై పడింది. అంతే అరికాలు భగ్గుమంది. పర్యవసానం అరికాలు మధ్యలో బొబ్బ వెలుగుచూసింది. అరికాలిలో మంటకు కారణమైన నిప్పుపై కోపాన్ని చూపించలేక నేనే బాధను అనుభవిస్తూ, కొబ్బరినూనే రాసుకుని మౌనంగా ఉండిపోయాను.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అసంకల్పితంగా మనకు మనమే ప్రమాదానికి గురయినప్పుడు ఎలా మౌనంగా ఉండిపోతామో, అకారణంగాని, ఉద్దేశపూర్వకంగాగాని ఎవరైనా మనపై కోపాన్ని, ద్వేషాన్ని ప్రదర్శించినప్పుడు మనం మౌనంగా ఉండిపోతే అసలు సమస్యలేరావు.
అంకితం:
ఈ వ్యాసం రాయడానికి కారణమైన ధూప్ స్టిక్ కు ఈ వ్యాసం అంకితం
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159
Discussion about this post