“లోగుట్టు పెరుమాళ్ళకెరుక” అనే నానుడి అనాదిగా వింటున్న మాట. సృష్టిలో రకరకాల జీవులున్నట్లే రకరకాల మనుషులు ఉంటారు. ఆ మనుషులకు విభిన్న మనస్తత్వాలు ఉంటాయి. దీనిలో ప్రత్యేకత ఏమీలేదు. అయితే ఆ మనుషులందరూ పైకి కనిపించే స్వరూప స్వభావాలన్నీ లోపల కూడా కలిగిఉంటారా? అంటే ఉండరు అనేది అక్షర సత్యం.
మరి మనుషుల నిజస్వరూపాలను కనుగొనాలంటే ఎలా? అని ఒక మిత్రుడిని అడిగాను. ఏముంది నీవు ఎవరి నిజస్వరూపాలు కనుక్కోవాలని అనుకుంటున్నావో వాళ్ళతో కొన్నాళ్ళు సావాసం చేస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసిపోతుంది కదా అన్నాడు. కానీ ఆ మాటను నా మనసు అంగీకరించలేదు.
ఎందుకంటే
నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకూ ఎంతోమందితో ప్రయాణం చేశాను. అందులో తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, భార్యాబిడ్డలు, తెలినవాళ్ళు, తెలియనివాళ్ళు ఉన్నారు. అయితే నాకు అనుభవమైన విషయం ఏటంటే ఎవరూ ఎవరి మనస్తత్వాన్నీ కనుక్కోలేరని సుస్పష్టం అయింది.
అందుకు చాలా కారణాలు ఉంటాయి. ఇప్పటి సామాజిక పరిస్థితులు, సాంకేతికత, జీవన విధానం తదితర అంశాలు. ముఖ్యంగా individuality, privacy అనే రెండు దరిద్రాలు మనుషులను అథఃపాతాళంలోకి నెట్టేస్తున్నాయి. కానీ ఇప్పటి మనుషులు ఈ రెండింటినే పట్టుకుని వ్రేలాడుతూ అదే అసలైన స్వేచ్ఛని అనుకుంటున్నారు.
Individuality ఉండొచ్చు అయితే అది ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. Privacy పాటించవచ్చు అయితే అది ప్రమాదకరం కాకూడదు. దృరదృష్టవశాత్తూ ఈ రెండింటి వల్లనే నేటి కుటుంబాలలో కలహాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
మామూలుగానే మనుషుల మనస్తత్వాలను కనుక్కోవడం కష్టం. మరి ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఈ రెండు ( individuality, privacy ) అడ్డుగోడలు మనుషుల మనసుల మధ్య దూరాన్ని మరింత పెంచాయనేది కఠోర వాస్తవం.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ (22-10-2023) ఈనాడు టెలివిజన్లో మాయాబజార్ సినిమా వస్తోంది. అందులో అభిమన్యుడు కానుకగా పంపించిన ‘ప్రియదర్శిని’ అనే పెట్టెను శ్రీకృష్ణుడు శశిరేఖకు అందిస్తాడు. ఆ పెట్టెను ఎవరు తెరుస్తారో అందులో వాళ్ళకు ఇష్టమైన వస్తువులుగాని, లేకపోతే ఇష్టమైన వ్యక్తులుగాని కనిపిస్తారు. అది ఆ పెట్టె ప్రత్యేకత. ఈ విషయం సినిమా చూసిన అందరికీ విదితమే.
మొదట ఆ పెట్టెను శశిరేఖ తెరుస్తుంది. శశిరేఖకు ఎంతో ఇష్టమైన అభిమన్యుడు కనిపిస్తాడు. తరువాత బలరాముని భార్య రేవతి తెరచినప్పుడు వజ్రవైరూఢ్యాలు కనిపిస్తాయి. ఆ తర్వాత బలరాముడు పెట్టె తెరవగానే తన ప్రియ శిష్యుడు దుర్యోధనుడు కనిపిస్తాడు. చివరగా శ్రీకృష్ణుడుకి శకుని కనిపిస్తాడు.
శశిరేఖ మినహాయించి మిగతా వాళ్ళ విషయంలో వాళ్ళకు ఇష్టమైనదిగాని, ఇష్టమైనవాళ్ళుగాని ఎవరనేది ఎవరూ ఊహించలేదు. ఆ ప్రియదర్శిని పెట్టె ద్వారా వాళ్ళ నిజస్వరూపం తెలిసింది.
అప్పుడు స్ఫురించింది నాలో ఒక ఆలోచన. ఇలాంటి పెట్టె ఇప్పటి సమాజానికి అవసరమేమోనని. ఎందుకంటే privacy పేరుతో కొంతమంది తమ ఫోన్లలో రహస్యంగా మాట్లాడుకోవడం, తమ ఫోన్లు ఎవరూ చూడకూడదని దానికి లాక్ పెట్టుకోవడం జరుగుతోంది. ఆ privacy దరిద్రం వలనే నేటి సమాజంలో అక్రమ సంబంధాలు ఎక్కువైనాయి.
మానవుడు తన మేధస్సుతో ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. ఒకవేళ ఇలాంటి పెట్టె తయారుచేసేశాడనుకో. అప్పుడు privacy పేరుతో మోసాలకు పాల్పడే వాళ్ళకి తిక్క కుదురుతుంది. అప్పుడు చచ్చినట్టు బుద్ధిగా నడుచుకుంటారు. ఎందుకంటే తన నిజస్వరూపం ఎక్కడ బయటపడిపోతుందేమోననే భయంతో.
“వాస్తవంగాని ఊహ ఊహించబడదు” అన్నారు మా గురువుగారు. ఏమో భవిష్యత్తు కాలంలో ఇలాంటి పెట్టె ఆవిష్కరింపబడుతుందేమో.
అనతికాలంలోనే ‘ప్రియదర్శిని’ పెట్టె ఆవిష్కరింపబడాలని, తద్వారా సమాజంలోని మనుషుల మధ్య కలహాలకి కారణమవుతున్న కర్కశ భావజాలాలన్నీ తొలగిపోయి అందరూ సుఖశాంతులతో వర్థిలాలని ఆశిస్తూ…
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159
Discussion about this post