చిమ్మచీకటి కమ్ముకుంది కారుమబ్బులతో. రోడ్లన్నీ జలమయం అయ్యాయి భారీవర్షంతో. చెట్లన్నీ తెగ ఊగిపోతున్నాయి హోరుగాలులతో. రెక్కలు విదిలించుకుని కూతలు కూస్తున్నాయి కోళ్ళు కుతూహలంగా. నక్కి నక్కి నడుస్తూ మురిపెంగా మూలుగుతున్నాయి కుక్కలు చలితో. కానీ, చీకటిని, వర్షాన్ని, గాలులను, చలిని హాయిగా ఆస్వాదిస్తున్నాయి ఆ మూగజీవులు.
ఎందుకో తెలియదు వీటన్నింటినీ స్వీకరించలేడు మనిషి. ఆనందం ఎక్కువైనా, దుఃఖం ఎక్కువైనా భరించలేడు. అందుకే దేన్నీ తృప్తిగా అనుభవించలేని ఏకైక జీవి మనిషి ఒక్కడే ఈ సృష్టిలో. ఎక్కువ వర్షం కురిస్తే భరించలేడు. ఎండ ఎక్కువ కాస్తే సహించలేడు. చలి ఎక్కువైతే చచ్చుబడిపోతాడు. సుఖం ఎక్కువైతే స్పృహ కోల్పోతాడు. దుఃఖం ఎక్కువైతే దొర్లి,దొర్లి ఏడుస్తాడు.
అడవిలో జంతువులను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎండొచ్చినా, వానొచ్చినా అవి ఏ మాత్రం చలించవు. వాటికి ఇళ్ళు ఉండవు, బట్టలు ఉండవు. ఆహారం దొరికితే తింటాయి. లేకపోతే అలాగే ఉండిపోతాయి. ఎంత ఎండొచ్చినా వాటికి వడదెబ్బ తగలదు.
ఎంత వర్షంలో తడిసినా వాటికి జ్వరాలు రావు. దేనినైనా తట్టుకునే శక్తిని, సామర్థ్యాన్ని సంపాదించుకున్నాయి అవి.
జంతువులకు ఆస్తిపాస్తులు లేవు. ఆశానిరాశలు లేవు. గూడు,గుడ్డ లేవు. సుఖదుఃఖాలు లేవు. ఆకలివేస్తే దొరికింది తింటాయి. దాహం వేస్తే ఏ నీరైనా తాగుతాయి. భవిష్యత్తు గురించి బాధలేదు. గతం గురించి ఆలోచించవు. ఇప్పుడు – ఇక్కడ – ఇలా అని సదా వర్తమానంలో ఉంటూ మనుగడ సాగిస్తాయి. అందుకే అవి ఎప్పుడూ హాయిగా ఉంటాయి.
మనిషి ప్రవర్తన అందుకు విరుద్ధం. ఎప్పుడూ గతం గురించో, భవిష్యత్తు గురించో ఆలోచిస్తూ ప్రస్తుత పరిస్థితిని పాడుచేసుకుంటాడు. లక్షలు సంపాదించినా, పంచభక్ష పరమాన్నాలను లభించినా ఇంకా ఎంతో సంపాదించాలని, ఇంకా మంచి ఆహారం కావాలనే అత్యాశ పీడిస్తూనే ఉంటుంది మనిషిని. అందుకే ఎప్పుడూ అసంతృప్తితో జీవనం సాగిస్తూ ఉంటాడు మనిషి.
అన్నీ జీవరాసులలోకి ఉత్తమమైన జీవి మనిషి ఒక్కడే అని చెప్తుంటారు పెద్దలు. ఎందుకో ఈ మాట రుచించదు. ఎందుకంటే మిగతా జీవరాసులన్నీ బతుకు పోరాటంలో స్థిమితత్వాన్ని ప్రదర్శిస్తాయి. కానీ, ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేక తల్లడిల్లిపోతుంటాడు మనిషి. తద్వారా మనశ్శాంతిని కోల్పోయి ఎప్పుడూ ఆందోళన చెందుతుంటాడు.
అడవిలో జంతువులను కౄరమృగాలని అంటుంటాం. నిజానికి కౄరమృగం మనిషే. ఎందుకంటే జంతువులు అడవిలో వాటి పాటికి అవి ప్రశాంతంగా జీవిస్తుంటాయి. మనిషే వాటి జోలికి పోయి, వాటి మనుగడను ఆధారం అయిన ఆవాసాలను ధ్వంసం చేస్తున్నాడు. అడవిలో చెట్లు నరికేయడం, అక్కడ పండ్లు, కూరగాయలు, వనమూలికలు తదితర వనసంపదను దోచుకుంటున్నాడు.అందుకే జంతువులు అప్పుడప్పుడు మనిషి ఆవాసాలలోకి వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
అంతేకాదు తన వికృతచేష్టలతో సహజంగా దోరికే ఆహార పదార్థాలను కల్తీచేయడమే కాకుండా, పర్యావరణానికి హానికలిగించే వ్యర్థ పదార్థాలను పారిశ్రామీకరణ పేరుతో వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాడు. తద్వారా తన ఉనికికే
ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నాడు.
ఈనాడు మనకొచ్చే రకరకాల క్యాన్సర్ లకు కారణం తన వింతపోకడలే అనేది అక్షరసత్యం. పాల నుంచి పప్పుల వరకు అన్నీ కల్తీనే. అందుకే వైద్యులకే అందని వింత రోగాలు మనం చవిచూడాల్సివస్తోంది.
ఇప్పటికైనా మనిషి తన ఆలోచనలను, వైఖరులను, దృక్పథాలను మార్చుకోకపోతే భవిష్యత్తులో మనిషి అనే జీవి ఈ ప్రపంచంలో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
అందుకే…
జంతువులలో సహజంగా ఉండే స్థిమితత్వాన్ని, సంతృప్తిని మనిషి అలవరచుకుని హాయిగా, సుఖమయంగా, స్థిమితంగా జీవించాలి. జంతు స్థాయికి మనిషి ఎదగాలి. జంతువులా జీవించాలి. అప్పుడే పదికాలాలపాటు ఈ అందమైన భూమిలో మనుగడ సాగించగలడు.
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.
Discussion about this post