తిరుపతిలో ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో జనానికి లాక్ డౌన్ భయం పట్టుకుంది. కరోనా తగ్గు ముఖం పడుతున్న తరుణంలో ఈ కొత్త వైరస్ అందరినీ గడగడ లాడిస్తోంది. కరోనా కంటే ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం యూకే లాంటి పరిస్థితి ఇండియాకు వస్తే రోజుకు సగటున 14లక్షల ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని డబ్ల్యు హెచ్ వో అభిప్రాయ పడింది. ఇలాంటి హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటాయోనని జనం ఆందోళన చెందుతున్నారు. కరోనా అనుభవాలను కూడా ఈ సందర్భంగా జనం నెమరు వేసుకుంటున్నారు.
ఆంద్రప్రదేశ్ లో రెండో ఒమిక్రాన్ కేసు తిరుపతిలో బుధవారం నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. కెన్యా నుంచి ఈ నెల 10న ఓ మహిళ (39) తిరుపతికి వచ్చింది. ఆమెకు 12న పరీక్షలు నిర్వహించారు. ఆమెకు ఒమిక్రాన్ వైరస్ సోకినట్లు ఈ నెల 22న నిర్ధారణ అయింది. మిగిలిన కుటుంబ సభ్యులకు మాత్రం నెగిటివ్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఒమిక్రాన్ కేసు బయట పడిన వెంటనే అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతానికి భయపడేంతటి వాతావరణం లేదు. అయినప్పటికీ రాష్ట్రంలో ఒమిక్రాన్ లాక్‌డౌన్ కు తిరుపతి శ్రీకారం చుడుతుందేమోననే అనుమానం పలువురిలో కలుగుతోంది. ఇందుకు కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వైరస్ ఇప్పటికే వణికిస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం మంగళవారం సంభవించింది. టెక్సాస్ లో 50ఏళ్ల వ్యక్తి ఒకరు ఈ వైరస్ కు బలయ్యారు.
ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా కొన్ని దేశాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆ దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా నిషేధించాయి. అయితే మన దేశం మాత్రం ఇంకా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇప్పటి వరకు మన దేశంలో ఢిల్లీలో 57, మహారాష్ట్రలో 54, తెలంగాణలో 38, కర్ణాటకలో 19, ఏపీలో 2 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు వైద్యశాఖ నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇంతవరకు మన దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసులు అన్నీ స్వల్ప లక్షణాలు ఉన్నవేనని వైద్యశాఖ చెబుతోంది. ఏపీలో రెండవ ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో అందరిలో ఆందోళన మొదలైంది.
ఇందుకు కారణం కరోనా అనుభవాలు. కరోనా మొదటి దశలో మరణాల సంఖ్య తక్కువ అయినప్పటికీ.. రెండవ దశ మారణ హోమం సృష్టించింది. రెండవ దశలో రాష్ట్రంలో నిత్యం వేల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతూ వచ్చాయి. ఆక్సిజన్ పడకల కొరత కూడా చాలా వెంటాడింది. రూ.లక్షలు వెచ్చించినా కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ పడకలు దొరకడం అప్పట్లో కష్టంగా మారింది. ఫలితంగా వందలాది మందిని కొవిడ్ బలిగొంది. తిరుపతి నగరంలోని రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి.. కొన్ని క్షణాల వ్యవధిలోనే 20మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన తరువాత చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో వెయ్యి పడకల సామర్థ్యంతో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయాలని.. ప్రతి పడకకూ ఆక్సిజన్ అందుబాటులో ఉండేవిధంగా నిర్మాణం చేయాలని ప్రభుత్వం భావించింది. ఆక్సిజన్ శ్రీకాళహస్తి పైప్స్ కర్మాగారం నుంచి తీసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. జర్మన్ షెడ్ల నిర్మాణానికి స్థల పరిశీలన కూడా చేశారు. ఈ షెడ్ల నిర్మాణం ఎందుకో ఆలస్యమైంది. ఆ తరువాత కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో జర్మన్ షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం స్వస్తి చెప్పింది.
ఈ జర్మన్ షెడ్ల కథ పక్కన పెడితే.. ఒమిక్రాన్ వైరస్ రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా రెండవ దశలో జరిగిన మారణ హోమాన్ని జనం నెమరు వేసుకుంటున్నారు. ఒమిక్రాన్ ఎంత మందిని బలిగొంటుందోననే భయం జనాన్ని వెంటాడుతోంది. ఇందుకు కారణం ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందు జాగ్రత్త చర్యగా చేస్తున్న హెచ్చరికలు. ఈ కొత్త వైరస్ ఇప్పటి వరకు ఎక్కువ భాగం యువత, చిన్నారులకే సోకుతోందనే వైద్యశాఖల నివేదికలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.
ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలో స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని కేంద్రం హెచ్చరించింది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ విధించాయి. మరికొన్ని నిషేధాజ్ఞలు విధించే దిశగా ఆలోచన చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రెండు డోసుల వేక్సినేషన్ అయితే.. తప్ప పబ్లిక్ ప్లేసుల్లోకి, ప్రభుత్వా ఆఫీసుల్లోకి, బస్సుల్లోకి కూడా రానివ్వకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ క్షణాన లాక్‌డౌన్ ప్రకటన వెలువడుతుందోననే భయం ప్రజల్లో ఉంది.
ఇప్పటికే చాలా వరకు విదేశాల్లో ఒమిక్రాన్ లాక్ డౌన్ విధిస్తున్న నేపథ్యంలో.. పరిస్తితులు విషమిస్తే ఇక్కడ కూడా అదే పరిస్థితి తప్నదేమోననే భయం ప్రజలను వెంటాడుతోంది. కరోనా పరిస్థితులు పునరావృతం కాకూడదనుకుంటే.. జనమే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైద్యశాఖ ఇచ్చే సలహాలు, సూచనలు మనం అందరం పాటిస్తే చాలా వరకు ఒమిక్రాన్ బారిన పడకుండా ఉండవచ్చు.
ఆ దిశగా ప్రజలు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక గత కరోనా అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కూడా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించాలి. అందుకు అవసరమైన వనరులను కూడా సమకూర్చుకోవాలి. వైరస్ పట్ల ప్రజలను అప్రమత్తం చేసి… వారికి భరోసా కల్పించాలి. ఏది ఏమైనా ఒమిక్రాన్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
.

Discussion about this post