ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు న్యాయబద్దంగా జరగాల్సిన వేతన సవరణ విషయంలో నాన్చివేత ధోరణి అన్యాయమని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్ టి యు) జిల్లా అధ్యక్షులు కడియాల మురళి అన్నారు
సోమవారం సాయంత్రం పలమనేరు లోని నార్త్ స్కూల్ లో జరిగిన ,ఎస్ టి యు పలమనేరు మండల కౌన్సిల్ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమని, ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. పిఎఫ్ రుణాలు , డి ఎ లు, పదవీ విరమణ తుది మొత్తాలు సకాలంలో అందుకోలేని స్థితిలో ఉద్యోగులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ధోరణి మారకపోతే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు , ఉపాధ్యాయ ఉద్యమ నేత గురురాజారావు మాట్లాడుతూ హక్కుల సాధనకు ఉద్యమాలే శరణ్యమని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు క్షేత్ర స్థాయిలో ఉద్యమాలలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.
ఎస్ టి యు రాష్ట్ర నాయకులు గంటా మోహన్ మాట్లాడుతూ, సీ పీ ఎస్ విధానం రద్దు విషయంలో ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానాన్ని సవరించకుండా, విద్యార్థులకు, పాఠశాలలకు, నిరుద్యోగులకు నష్టం జరిగేలా అధికారులు వ్యవహరించడం సరికాదన్నారు.
అనంతరం ఎస్ టి యు పలమనేరు మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కార్యక్రమంలో ఎస్ టి యు సీనియర్ నాయకులు మునెప్ప మొదలి, చంద్ర శేఖర్, జయరామ్, నగేష్,సుమతి,చెంగల్ రెడ్డి,దేవరాజు,రాజా,నరేంద్ర,యాసిన్, కేశవులు,విజయ్ కుమార్, రెడ్డెప్ప, తదితరులు పాల్గొన్నారు.
.