జోగులాంబ తల్లి దీవెనతో మొదలైన “ప్రజా సంగ్రామ యాత్ర-2”కు ప్రజాభీష్టాన్ని ప్రతిబింబించేలా, పాలక టీఆర్ఎస్ గుండెలదిరేలా భారతీయ జనతా పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో కమలదళం చేపట్టిన 31 రోజుల పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాదు శివార్లలోని తుక్కుగూడలో జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో షా నేతృత్వంలో పార్టీ అగ్రనేతలు తమ ప్రసంగాలతో ఉర్రూతలూగించారు.
తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి అసమర్థ, అవినీతి (నికమ్మా, భ్రష్టాచార్) ప్రభుత్వాన్ని చూడలేదని, నయా నిజాం నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఈడ్చి అవతల పారేయాలని అయన పిలుపునిచ్చారు. తెలంగాణలో ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో పూర్తిగాని “నీళ్లు-నిధులు-నియామకాలు” అజెండాను సాకారం చేసి బంగారు తెలంగాణాను నిజం చేసే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని అయన స్పష్టం చేశారు. యాత్ర రథసారథి సంజయ్ మాట్లాడుతూ – దారి పొడవునా తమకు అందిన వేల కొద్దీ విన్నపాలు ప్రభుత్వ వైఫల్యానికి, దుష్పరిపాలనకు అద్దంపడుతున్నాయని చెప్పారు.
యాత్ర నాలుగో వారంలోకి ప్రవేశించిన మొదటిరోజు పార్టీ , పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చేసిన ప్రసంగం తెలంగాణ ప్రజలకు భరోసాను ఇచ్చింది. అది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాకపోయినా, ప్రజా సంగ్రామ యాత్ర దెబ్బకేనా అన్నట్లు కాంగ్రెస్ పార్టీ హన్మకొండలో సభ పెట్టి రాహుల్ గాంధీతో హడావుడి చేయించడం జరిగింది. రూ. 6 వేల కోట్ల భారాన్ని తెలంగాణ ప్రజలపై మోపుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోకపోతే రెఫరెండంకు సిద్ధం కావాలని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంజయ్ బహిరంగ లేఖ రాయడం యాత్ర నాలుగో వారం మెరుపుల్లో ఒకటి.
ప్రజా సంగ్రామ యాత్రలో నాయకులూ, కార్యకర్తలతో కదం తొక్కి, ప్రజల ఆవేదనను, వారిని ఆదుకోవాలని నేతలకున్న ఆర్తిని దగ్గరి నుంచి గమనించని నేను తుక్కుగూడ బహిరంగ సభ రోజున “ది పయనీర్” అనే ఆంగ్ల పత్రికలో ప్రచురించిన విశ్లేషణాత్మక వ్యాసం “The Yatra that busted a fake narrative” చదవండి. తెలంగాణ రాజకీయాలను ఒక మలుపు తిప్పబోతున్న ఈ యాత్రకు సంబంధించిన వివరాలను మూడు వారాల పాటు ధారావాహికంగా అందించాను. చివరిదైన నాలుగో వారం వివరాలు ఇవీ:
22వ రోజు (మే 5, గురువారం)
యాత్ర 22 వ రోజు ప్రజల స్వాగత సత్కారాల మధ్యన ధర్మాపూర్ ఉత్తంటి స్టేజ్ నుంచి ప్రారంభమైంది. పాద యాత్రలో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సాయం బాబురావు, బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, మాజీ మంత్రి చంద్రశేఖర్, పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ నియోజక వర్గంలోని ఓట్కుంట స్టేజీ సమీపంలోని పాదయాత్ర శిబిరంలో న్యాయవాదుల సదస్సు నిర్వహించి, వారి సమస్యలు, వివిధ న్యాయ సంబంధిత అంశాలపై చర్చ జరిపారు. కేంద్రం అమలు జరుపుతున్న సంక్షేమ పథకాలు, తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులను దారి పొడవునా ప్రజలకు వివరిస్తూ యాత్ర సాగింది. బండమీదిపల్లి వద్ద భవానీ మాత, శివాజీ విగ్రహాలకు సంజయ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాలమూరు యూనివర్సిటీ విద్యార్దులు ఆయనను కలుసుకొని తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని అందచేశారు.
పాదయాత్ర జరుగుతుండగానే సరూర్ నగర్ లో దళిత యువకుడు నాగరాజును తన ముస్లిం భార్య కుటుంబీకులు అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన వార్త కలచివేసింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ సంజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. నాగరాజు హంతకులను వెంటనే గుర్తించాలని, వారి వెనుక ఉన్న శక్తులను, సంస్థలను బైటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంత కిరాతకమైన సంఘటనపై సెక్యులర్ పార్టీలు, మేధావులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
మహబూబ్ నగర్ ఎం.వి.ఎస్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో సాయంత్రం ఏర్పాటు చేసిన “జనం గోస – బీజేపీ భరోసా” బహిరంగ సభలో పార్టీ జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా ముఖ్య అతిధిగా ప్రసంగించారు. తెలంగాణకు ప్రధాని నరేంద్రమోదీ ఆశీర్వాదం ఉందని, తెలంగాణలలో బిజెపి అధికారంలోకి రాగానే పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. తెరాస రజాకార్ల సమితని, కాళేశ్వరం ఎత్తిపోతల కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందన్నారు. తెరాస పాలనలో తెలంగాణలో ల్యాండ్ మాఫియా రాజ్యమేలుతుందని, ప్రతి పథకం అవినీతి మయమేనని అన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికలతో ముఖ్యమంత్రి మతి చెడిందని, బండి సంజయ్ పాదయాత్రకు ప్రజల ఆదరణ, ఆశీర్వాదం లభిస్తుందన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రాబోతుందన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతిలో బందీ అయిందన్నారు. టీ.ఆర్.ఎస్ గ్రాఫ్ దిగజారిపోతుంటే కుమారుడు కేటీఆర్ సీఎం కాలేదని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారన్నారు. టీ.ఆర్.ఎస్ లో తెలంగాణ వాదులెవరూ లేరని, ఉన్నవారంతా తెలంగాణ ద్రోహులేనన్నారు. యాత్ర సాగుతున్న సమయంలోనే వరంగల్ సభకు వచ్చిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నిర్వాకం వల్లే తెలంగాణ రాష్ట్రం ఆలస్యంగా ఏర్పడిందని, స్వరాష్ట్రం కోసం అనేక మంది పేద బిడ్డలు బలిదానాలు చేసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటేనని అయన చెప్పారు. బహిరంగ సభలో డాక్టర్ కె. లక్ష్మణ్, పీ మురళీధర్ రావు, డికె అరుణ, జితేందర్ రెడ్డి, రఘునందన్ రావు, వివేక్ వెంకట స్వామి తదితరులు మాట్లాడారు.
23వ రోజు (మే 6, శుక్రవారం)
మహబూబ్ నగర్ లోని తురుపు కమాన్ లో ప్రారంభమైన 23వ రోజు పాదయాత్ర అప్పన్నపల్లి వరకు సాగింది. సాయంత్రం ఎనుకొండలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ పాల్గొన్నారు. మోదీ పంపిస్తేనే తాను ఇక్కడికి వచ్చానని, వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇక్కడి ప్రజలకు కేసీఆర్ అందించడం లేదన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం తప్పకుండా వస్తుందని, వచ్చాక కేంద్రం ఇచ్చే నిధులు నేరుగా ప్రజలకు చేరేలా చేస్తామని హామీ ఇచ్చారు. “కేసీఆర్ అవినీతిని మన ప్రభుత్వం వచ్చాక కక్కిస్తాం,” అని పేర్కొన్నారు.
ఏ మాత్రం అలుపులేకుండా ఉత్సాహంగా యాత్రను కొనసాగిస్తూ ప్రజలను కలుసుకుంటున్న సంజయ్ మాట్లాడుతూ- “కేసీఆర్ షాప్ లు ఏంటో మీకు తెలుసు కదా? కేసీఆర్ షాప్ లు అంటే వైన్ షాప్ లు, బెల్ట్ షాప్ లే. కేసీఆర్ పథకం తాగుడు, ఊగుడే,” అని వ్యగ్యంగా అన్నారు. ఒక్కసారి బీజేపీని ఆశీర్వదించి ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని అయన కోరారు.
ఉదయం పాదయాత్ర ప్రారంభానికి ముందు పాలమూరులోని ప్రసిద్ద అంబ భవాని దేవాలయంలో సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. యాత్రకు మద్దతుగా తనతో కలిసి నడిచిన దివ్యాంగుల సమస్యలు ప్రస్తావిస్తూ, వారి జీవితాలకు భరోసా ఇచ్చే గొప్ప కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. జెజెఆర్ గార్డెన్స్ శిబిరం వద్ద మోతీనగర్ కు చెందిన వడ్డెర కులస్దులతో ముఖాముఖి నిర్వహించారు. గాలివానకు గుడిసెలు కూలిపోయాయని, కనీసం తలదాచుకునేందుకు గూడు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజ్ లతో కూడా ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి పంట నష్ట పరిహారంతో పాటుగా ధాన్యం సత్వరమే కొనుగోలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంజయ్ ఒక లేఖ రాశారు.
24వ రోజు (మే 7, శనివారం)
పాలమూరు జిల్లా తిరుమల హిల్స్ గేట్ నుంచి 24 వ రోజు యాత్ర ప్రారంభమైంది. సాయంత్రం జడ్చర్లలో నిర్వహించిన సభలో ప్రసంగిస్తూ-కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇస్తున్న ఐదు కిలోల బియ్యాన్ని ఎందుకు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ను సంజయ్ నిలదీశారు. పేదల నోటికాడి ముద్దను లాక్కుంటున్న ముర్ఖుడు కేసీఆర్ అని అన్నారు. రెండు రోజుల కిందట హన్మకొండలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం ప్రగతి భవన్ స్క్రిప్ట్ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ –టీ.ఆర్.ఎస్ పొత్తు ఎప్పుడో ఖరారైందన్న విషయాన్ని హన్మకొండ సభ నిరూపించిందన్నారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ, పాలమూరులో బీజేపీకి వస్తున్న విశేష స్పందన, సభలకు వస్తున్న ప్రజలను చూశాక టీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందన్నారు. అందుకే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో పాలమూరు ప్రజలకు ఈ ప్రభుత్వం చేసిందేమిటని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, బీజేపీ ఎక్కడుందని అడిగిన టీఆర్ఎస్ నేతలకు ఇక్కడికొచ్చిన జనమే సమాధానమన్నారు. ఉదండాపూర్ ప్రాజెక్టు పనులేమయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశ్నించారు. ఈడనే కుర్చీ వేసుకుని కూర్చుంటానని చెప్పిన పెద్ద మనిషి, 4780 ఎకరాలను గుంజుకుని పేదలకు ఇల్లు, పొలం లేకుండా చేశాడన్నారు.
బీజేపీ నాయకుడు బద్దం బాల్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా నాయకులు నక్కలబండ తండాలో పుష్పాంజలి ఘటించారు.
25వ రోజు (మే 8, ఆదివారం)
ప్రజా సంగ్రామ యాత్రలో 25వ రోజు ఒక మైలురాయి. ఈ రోజుతో యాత్ర 300 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ఏప్రిల్ 14న జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో మొదలయిన పాదయాత్ర అపూర్వ స్వాగతం మధ్య అలంపూర్, గద్వాల, మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్ నియోజకవర్గాల్లో కొనసాగింది. జడ్చర్ల సమీపంలోని గంగాపూర్ వద్దకు చేరుకునే సరికి 300 కిలోమీటర్లు పూర్తవడంతో బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు సంబరాల్లో భాగంగా సంజయ్‌తో 300 కిలోల కేక్ కోయించారు.
జడ్చర్ల శివారు నుంచి గంగాపూర్, లింగంపేట మీదుగా 25వ రోజు యాత్ర కోడ్గల్‌కు చేరుకుంది. యాత్ర ప్రారంభానికి ముందు వివిధ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై నాయకులు చర్చించారు. గంగాపురంలోని ఎల్లమ్మ ఆలయ ప్రాంతంలో మహిళలు, నాయకుల ఘనస్వాగతం అందుకున్న సంజయ్ గ్రామంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయాన్ని సందర్శించారు.
కోడ్గల్ గ్రామంలో రాత్రి రచ్చబండ నిర్వహించి సంజయ్ మాట్లాడుతూ- ప్రధాని మోదీ పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నారని, దీంతోపాటు గ్రామ పంచాయతీలకు, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇస్తున్నారని చెప్పారు. “మోదీ గారిచ్చే ఆ నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఖాతాలో జమచేసుకుంటున్నాడు. మోదీ నిధులు ఇచ్చినా, పంచేవాడు మనవాడు కాకుంటే లబ్ధిదారులకు అవి ఎలా చేరతాయి? అందుకే, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే అన్ని వర్గాల ప్రజలు బాగుపడతాయి,” అని చెప్పారు. గజ్వేల్ నుంచి ఇక్కడికి వచ్చి, దుందుభి వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
యాత్ర ముగింపు సందర్భంగా వస్తున్న అమిత్ షా ప్రసంగించే తుక్కుగూడ సభకు సంబంధించి సంజయ్ పార్టీ నేతలలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరెంట్ చార్జీల పెంపును నిరసిస్తూ మండలాలు, జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని, కరెంట్ బిల్లులను దహనం చేయాలని పిలుపునిచ్చారు. నాగరాజు హత్యపై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నిరసనలు తెలపాలని సూచించారు.
26వ రోజు (మే 9, సోమవారం)
యాత్ర 26 రోజు జడ్చర్ల నియోజక వర్గంలో కొనసాగింది. యాత్ర సాగిన మక్తపల్లి స్టేజీ, కొండేడు, చిన్న ఆదిరాల స్టేజీ, పెద్ద ఆదిరాల, ఎక్వాయిపల్లి పొడవునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారం కాగలవని చెబుతూ… కేసీఆర్ పాలనను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్దం కావాలని సంజయ్ పిలుపునిచ్చారు.
పాదయాత్ర ప్రారంభానికి ముందు కొడుగల్ లో మీడియాతో మాట్లాడుతూ- ఎవరెన్ని పగటి కలలు కన్నా తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమేనన్నారు. కేంద్రం నిధులపై పదే పదే విమర్శలు చేసే టీఆర్ఎస్ నేతలు… మీ ప్రభుత్వం ఎన్ని నిధులు విడుదల చేస్తుందో ముందు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం ను చంకలో వేసుకుని తిరుగుతున్న పార్టీ టిఆర్ఎస్ అని ధ్వజమెత్తారు. ఎంఐఎం మెప్పు కోసమే గ్రూప్-1 పరీక్ష ను ఉర్దూ భాషలోనూ నిర్వహిస్తున్నారని అన్నారు.
పెద్ద ఆదిరాలలో నిర్వహించిన “జనం గోస – బిజెపి భరోస” సభలో మాట్లాడుతూ- తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేసినందుననే తాము ప్రజల మధ్య తిరుగుతున్నామని సంజయ్ చెప్పారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే విదేశాలకు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో దోచుకున్న సొమ్మును విదేశాల్లో దాచుకున్నాడని ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్దమా? అని కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. అంతకు ముందు రామాయంపేట సభలో కేటీఆర్ చెప్పినవన్నీ అబద్దాలేనన్నారు.
27వ రోజు (మే 10, మంగళవారం)
యాత్ర 27వ రోజు రంగారెడ్డి జిల్లాలో ప్రవేశించింది. ఈ సందర్భంగా ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి పూల వర్షం కురిపిస్తూ డప్పులు, వాయిద్యాలు, గిరిజన నృత్యాలతో అపూర్వ స్వాగతం పలికారు. కొందరు అభిమానులు గజమాలతో సంజయ్ ను సత్కరించారు. వారితో కలిసి తొమ్మిది రేకుల గ్రామం వద్ద తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసిన సంజయ్ పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు అయన సమక్షంలో పార్టీలో చేరారు.
తెలంగాణలోని ఉమ్మడి హైదరాబాద్ ,రంగారెడ్డి, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన దాదాపు 10 వేల మంది బూత్ కమిటీ అధ్యక్షులతో సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవినీతి, నియంత, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బిజెపి కార్యకర్తలు సాగిస్తున్న పోరాటంతోనే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగామన్నారు. రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇవ్వాలనే చర్చ జరుగుతున్నదని, ఈ నేపథ్యంలో మార్పుకు సంకేతంగా నిలిచేలా కనీవినీ ఎరుగని రీతిలో తుక్కుగూడ సభ జరగాలన్నారు.
“పాలమూరు పచ్చగున్నదా? రా… ఇక్కడే ఇంకా నాలుగు రోజులుంటా. పాలమూరు ఎడారిగా మారిందని నేను నిరూపిస్తా. దమ్ముంటే రండి,” అని కేసీఆర్, కేటీఆర్ లకు ఆయన సవాల్ విసిరారు. చంద్రబాబుకు అమ్ముడుపోయి కృష్ణా జలాల్లో తెలంగాణ కు రావాల్సిన 575 టీఎంసీ ల వాటాకు గాను, 299టీఎంసీ లకే సంతకం పెట్టి, కృష్ణా జలాల్లో అన్యాయం చేసిన మూర్ఖుడు కేసీఆర్ అని విమర్శించారు.
ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో సాగు నీటి ప్రాజెక్టుల కోసం 28 వేల కోట్లు ఖర్చు పెట్టామంటూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను అయన దుయ్యబట్టారు. “ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తే లక్ష్మీదేవిపల్లి, పాలమూరు-రంగారెడ్డి, ఆర్డీఎస్ ఆధునీకరణ పనులను ఎందుకు పూర్తి చేయలేదు? ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయల కమీషన్లు దండుకోవడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారు,” అని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 6,000 కోట్ల భారాన్ని తెలంగాణ ప్రజలపై మోపుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలి లేదా రెఫరెండంకు సిద్ధం కావాలని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంజయ్ బహిరంగ లేఖ రాశారు.
28వ రోజు (మే 11, బుధవారం)
యాత్ర 28వ రోజు ఉదయం కొత్తపేటలో ప్రారంభమై సంతాపూర్, కోనాయిపల్లి, శ్రీమురళీనగర్ మీదుగా సాగిపోయింది. అడుగడుగున మహిళలు, యువకులు, కులవృత్తుల వారు సంజయ్ కు ఘనస్వాగతం పలికారు. గ్రామాల్లోని సమస్యలను ఏకరువు పెట్టారు. మంచినీటి సరఫరా సక్రమంగా జరగడంలేదని, పావలావడ్డీ రుణాలు అందడం లేదని, డబుల్ బెడ్ రూమ్ గృహాల జాడే లేదని, పెన్షన్ లు అందడం లేదని, దళితులకు మూడు ఎకరాల భూపంపిణీ జరగడం లేదని కొత్తపేట గ్రామస్ధులు అయన దృష్టికి తెచ్చారు. బీజేపీ అధికారంలోకి రావడమే పరిష్కారమని, పార్టీని అధికారంలోకి తేవాలని ఆయన ప్రజలను కోరారు.
పాదయాత్ర శిబిరం వద్ద మున్నూరుకాపు, పద్మశాలిసహా పలు బీసీ సంఘాల నాయకులు సంజయ్ ను కలిసి సంఘీభావం ప్రకటించారు. వివిధ సామాజికవర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలలో కుల వృత్తులు ధ్వంసమయ్యాయన్నారు. కుల సంఘాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందుతున్నారని అన్నారు. కుల సంఘాల మధ్య ఐకమత్యం లేకపోవడంవల్లే టీఆర్ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
యాత్రలో భాగంగా సాయంత్రం కోనాయిపల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులు అడిగి తెలుసుకున్నారు. గ్రామ సర్పంచ్ గా బిజెపి అభ్యర్ది గెలిచాడని, అందుకే కేసీఆర్ ప్రభుత్వం గ్రామంపై కక్ష కట్టిందని గ్రామస్దులు సంజయ్ దృష్టికి తెచ్చారు. పింఛన్లు రావడం లేదనీ, ఇండ్లు మంజూరు చేయడం లేదనీ, రేషన్ కార్డులు ఇవ్వడం లేదనీ చెప్పారు. వర్షం కారణంగా ఏళ్లనాటి ఇండ్లు కూలిపోతే సర్పంచ్ ఇంట్లో తలదాచుకున్నాము.
29వ రోజు (మే 12, గురువారం)
మహేశ్వరం నియోజకవర్గంలోని చిప్పలపల్లి, ధన్నారం, పులిమామిడి, పోచమ్మగడ్డ తండా, దావుద్ గూడ తండా, ఎన్.డి తండా మీదుగా 29 వ రోజు యాత్ర సాగింది. రాత్రి పొద్దుపోయాక దావూద్ గూడ తండావద్ద గ్రామస్తులతో సంజయ్ ముచ్చటించారు. ముఖ్యమంత్రిని కలవడం దుర్లభమైన విషయమని, ఆయన్ను కలవడానికి వెళితే జైలుకు వెళ్ల వలసిందేనని అన్నారు. ఎన్నికల హామీలను టిఆర్ఎస్ నెరవేర్చలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి పనిచేస్తున్నందున రాష్ట్రంలో కూడా పాలించే అధికారం బీజేపీకి ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్ర రాబడులను పెంచుకోవడం కోసం ముఖ్యమంత్రి త్వరలోనే ప్రతి ఇంటికి 500 నుండి వెయ్యి రూపాయల వరకు పన్ను విధించబోతున్నాడని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పరిస్ధితి మరీ దారుణంగా ఉందన్నారు. పసిపిల్లలను అమ్ముకుంటున్నారని, బాల్య వివాహాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన తండాలను అభివృద్ది చేస్తామని, అన్ని గ్రామాల్లో సేవాలాల్ మహారాజ్ ఆలయాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ పేదలకు ఇళ్లు ఇవ్వడుగాని, బంజారాహిల్స్ లో 150 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కారుచౌకగా పార్టీ కార్యాలయానికి కట్టబెట్టాడని ధ్వజమెత్తారు. ఈ డబ్బుతో పేదలకు ఇళ్లు నిర్మించి, పెన్షన్లు కూడా ఇవ్వవచ్చన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సక్రమంగా జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తుందన్నారు. ఉపాధి కూలీలకు వారానికి ఒక సారి జీతం రాకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై క్రిమినల్ కేసులు పెట్టాలని సూచించారు.
30వ రోజు (మే 13, శుక్రవారం)
మహేశ్వరం నియోజకవర్గంలోని ఎన్.డి తండా నుంచి ప్రారంభమై మహేశ్వరం, సిరిగిరిపురం గేట్, మహేశ్వరం గేట్, ఇమామ్ గూడ మీదుగా శ్రీనగర్ వరకు 30వ రోజు యాత్ర సాగింది. యాత్ర శిబిరం వద్ద “తపస్” రాష్ట్ర అధ్యక్షులు హన్మంత్ రావు, నవాత్ సురేష్ సహా పలువురు రాష్ట్ర నాయకులు కలిశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జూనియర్ లెక్చరర్లు, డైట్ లెక్చరర్లు, ఎంఈఓలు, డిప్యూటీ ఈవోలు, జీహెచ్ఎం, పీఎస్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 317 జీవోతో అనేక మంది ఉపాధ్యాయులు నష్టపోయారని, స్పౌజ్ కేటగిరి కింద చేసుకున్నదరఖాస్తులకు మోక్షం లేదని, పరస్పర బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఇచ్చిన జీవో అమలు కావడం లేదని పేర్కొన్నారు.
తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం హైదరాబాద్ జిల్లా ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు సైతం సంజయ్ ను కలిసి సీపీఎస్ రద్దు కోసం పోరాడాలని కోరుతూ వినతి పత్రం అందించారు. వారి సమస్యలను సావధానంగా విన్న ఆయన సీపీఎస్ రద్దు విషయంపై ఉద్యోగుల పక్షాన పోరాడతామని, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకొస్తే 317 జీవోను సవరించడంతోపాటు తక్షణమే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను చేపడతామని హామీ ఇచ్చారు.
మహేశ్వరంలో జరిగిన బహిరంగ సభలో సంజయ్ మాట్లాడుతూ ఈ నియోజకవర్గం అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మహేశ్వరం నియోజకవర్గానికి ఇచ్చిన నిధులపై చర్చకు సిద్దమన్నారు.
31వ రోజు (మే 14, శనివారం)
ప్రజా సంగ్రామ యాత్ర చివరి రోజు న యాత్ర మహేశ్వరంలో సాగింది. సంజయ్ వెంట అధిక సంఖ్యలో పాదయాత్ర చేస్తున్న నిరుద్యోగ యువత తమ ఇబ్బందులను విన్నవించారు. వారిని ఊరడిస్తూ-వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం తుక్కుగూడ ప్రాంతంలో జరిగిన భారీ బహిరంగ సభతో రెండో విడత పాదయాత్ర-2 ముగిసింది. “బండి సంజయ్ పాదయాత్రను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. ఇవాళ్టి సభలో ఆయన ప్రసంగం విన్న తర్వాత అనిపించింది ఏంటంటే.. తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించడానికి నేను రానవసరమే లేదు.. సంజయ్ సింగిల్ హ్యాండుతో టీఆర్ఎస్ ను కూల్చేస్తాడని స్పష్టమైపోయింది. సంజయ్ పాదయాత్ర ఒక పార్టీకి వ్యతిరేకంగానో, ఒకరిని గద్దెదించాలనో ఉద్దేశించింది కాదు.. కుటుంబ పాలనను అంతం చేయడానికి, రాష్ట్రంలో దళిత, గిరిజనుల కలలు సాకారం కావడానికి ఉద్దేశించింది. ఆ పనిలో భాగంగానే కల్వకుంట్ల కుటుంబాన్ని, కేసీఆర్ ను పీకి అవతలపారేయబోతున్నాం,” అని అమిత్ షా ప్రకటించారు.
ఈ అద్భుతమైన వేదిక ను పంచుకున్న నాకు కనుచూపు మేరలో ఉత్సాహవంతులైన కార్యకర్తలే కనిపించారు. అదొక జన సంద్రం, కాషాయ వనం. కమలాలు వికసించిన పెద్ద సరోవరం అనిపించింది. తెలంగాణను నక్కల పాలు చేయకూడదన్న తపన, పోరాటాల త్యాగాలు నిష్ఫలం కాకూడదన్న స్పృహ వారిలో కనిపించాయి. నేతల స్ఫూర్తిదాయక ప్రసంగాలు, కార్యకర్తల నూతనోత్తేజం చూస్తే ముచ్చటేసింది. నాలుగు వారాలుగా ప్రజా సంగ్రామ యాత్రను సమీక్షించి మీ ముందు ఉంచిన నేను చివరిగా చెప్పదలచుకున్నది ఒకటే- తెలంగాణలో కాషాయ జెండా ఎగురబోతున్నది. అమరవీరుల ఆత్మలు శాంతించబోతున్నాయి.
..కిషోర్ పోరెడ్డి
అధికార ప్రతినిధి, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ
Discussion about this post