పవన్ కల్యాణ్ స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు. సినిమాలలో చిరంజీవి తమ్ముడిగా మాత్రమే కాకుండా తనకంటూ ఒక ఇమేజ్, గుర్తింపు తెచ్చుకున్నారు.
చిరంజీవి పెద్ద హీరోగా స్థిరపడిన నేపథ్యంలో, యువతను ఆకట్టుకునే రీతిలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. స్టెయిలిష్ యువతకు హీరో అయ్యారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో కూడా తన కంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నం చేశారు. చిరంజీవి సీరియస్ రాజకీయాలు చేస్తుంటే తాను మాత్రం వేరేగా యువకులతో కలిసి కార్యక్రమాలు చేపట్టారు. సభలలో కూడా యువకులతో చేరి వెనకాల వరసలో ఉండి యువకులతో కలిసి అల్లరి, విజిల్స్ చేయడం కనిపించేది. ప్రజారాజ్యం ఫెయిల్యూర్, తదుపరి చివరగా కాంగ్రెసు పార్టీలో విలీనం, పవన్ కళ్యాణ్ ను ఎక్కువగానే బాధించింది.
చిన్న పిల్లలు ఫెయిల్యూర్ ను తట్టుకోలేరు.
పవన్ కల్యాణ్ ప్రజారాజ్యం ఫెయిల్యూర్ ను తట్టుకోలేక చాలెంజ్ గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. అయితే అప్పటికి ఇంకా ఆయనకు సినిమా యువ హీరో ఇమేజ్, లవర్ బాయ్ క్రేజ్ ఉండడం, అతనికి ప్రజా నాయకుడిగా గుర్తింపు లేకపోవడంతో కొంత కాలం వేచి ఉన్నారు. కొన్ని సినిమాలు ఆయనను ప్రజా సమస్యలు తీర్చే నాయకుడిగా, ప్రజా హితం కోరే నాయకుడిగా చూపించే విధంగా రూపొందించారు. ఆ తరువాత మార్చి 14 తేదీన, 2014 సంవత్సరంలో హైదరాబాద్ లో జనసేన పార్టీని స్థాపించి పెద్ద అట్టహాసంగా ప్రారంభించారు. అయితే అప్పటికి ఇంకా పార్టీ విధివిధానాలు కూడా రూపొందించలేదు. తరువాత కూడా పార్టీ నిర్మాణం గానీ, క్రింది స్థాయి కమిటీలు గానీ ఏర్పాటు చేయలేదు. కనుక 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేయకుండా తెలుగుదేశం, బిజెపి కూటమికి మద్దతు ఇచ్చింది. పవన్ కల్యాణ్ కూటమి సభలలో తనదైన ఆవేశంతో ఉపన్యాసాలు ఇచ్చారు.
2014 లో బిజెపి, జనసేన సపోర్టుతో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా ప్యాకేజీ పేరుతో రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రభుత్వం మీద కూడా “ప్రశ్నించడం” పేరుతో దుయ్యబట్టారు. 2019 ఎన్నికలలో జనసేన ఒంటరిగా పోటీ చేసింది. ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. అయితే పోటీ చేసిన అన్ని సీట్లలో ఓట్లు చీల్చి వైయస్సార్ కాంగ్రెసు గెలుపుకు సాయ పడింది.
2014 లో, 2019 లో జనసేన పార్టీకి గానీ, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు గానీ ప్రత్యేక విధానాలు, సిద్ధాంతాలు గానీ లేవు. ఇంకో రకంగా చెప్పాలంటే జనసేన పార్టీకి, దాని అధినేత పవన్ కల్యాణ్ కు ఏదో చెయ్యాలి, ఏదో మార్పు తీసుకురావాలి, అందర్నీ ఆకట్టుకుని అధికారం లోకి రావాలి, ప్రజల బతుకులు బాగు చెయ్యాలి, లాంటి ఆశయాలు ఉన్నా, ఆచరణాత్మకంగా ఏలా చెయ్యాలనేది తెలియని పరిస్థితి.
పవన్ కల్యాణ్ అంటే ప్రజలలో క్రేజ్, ఆశక్తి, ఆకర్షణ, కనిపిస్తున్నాయి. కానీ ఆ క్రేజ్, ఆశక్తి, ఆకర్షణలను ఓట్ల రూపంలో ఎలా మార్చుకోవాలో తెలియదు. కొంత అనుభవజ్ఞులైన నాదెండ్ల మనోహర్ సపోర్ట్ ఉన్నా, అది అధికారం దాకా తీసుకు వెళ్ళలేదు. కొంతకాలం కామ్రేడ్లను చెరొక పక్కన పెట్టుకుని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ అది ప్రతి పక్షంగా ప్రభుత్వం మీద విమర్శలు చేయడం వరకే పనిచేస్తుంది అని త్వరతిగతినే అర్థం చేసుకున్నారు. అధికార పీఠం ఎక్కాలంటే కామ్రేడ్లతో సయోధ్య సరిపోదు, అని అవగతమైంది త్వరలోనే. ఇక అడపాదడపా ఏవో కార్యక్రమాలు, వైయస్సార్ కాంగ్రెసు ప్రభుత్వం మీద విమర్శలు, ప్రతివిమర్శలతో కాలం గడిపినా అధికారం వైపు అడుగులు పడే అవకాశం కనిపించడం లేదు.
ఆ దశలో చంద్రబాబు అరెస్టు పవన్ కళ్యాణ్ కు బాగా కలిసొచ్చే అంశంగా అనిపించింది. పిలవని పేరంటంలా ఉన్నా అవకాశం అందిపుచ్చుకోడానికి ముందడుగు వేశారు. తమ నాయకుడు అరెస్టు అయి, నాయకత్వ లోపంతో, లోకేష్ శక్తి ఒక్కటే సరిపోదని అనుకుంటున్న తరుణంలో, భువనేశ్వరి, బ్రాహ్మణి, కలసి చేసిన స్త్రీ శక్తిని ప్రేరేపించే ప్రయత్నం అంతగా వేడెక్కించని సమయంలో, పవన్ కళ్యాణ్ ప్రవేశం బాగా కలిసొచ్చే అంశంగా అనిపించింది. దానికి మరింత ప్రాచుర్యం, ప్రచారం, పవన్ కల్యాణ్ ను రాజమండ్రి జైలు సందర్శన చేయకుండా వైయస్సార్ ప్రభుత్వ పోలీసులు చేసిన అడ్డగింపు కార్యక్రమం వలన లభించింది.
స్క్రిప్ట్ ఇస్తే చాలు దూసుకెళ్ళే హీరో లాగా పవన్ కల్యాణ్ దూసుకుని వెళ్లి చంద్రబాబును జైలులో కలవడం, జైలు బయట కూటమి ఏర్పాటుకు ప్రకటన, తదుపరి పరిణామాలు, ఎన్నికలలో కూటమి విజయానికి నాంది అయింది.
2024 ఎన్నికలలో కూటమి విజయంతో పాటు, జనసేన పార్టీ వంద శాతం సీట్లను కైవసం చేసుకోవడం, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవడానికి కారణం అయింది. డిప్యూటీ ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్ తన ప్రాముఖ్యతను, తన మార్కు పరిపాలనను ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో చూపించలేక పోయారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు తన మార్కు పరిపాలనను అందిస్తూ, కాబినేట్ సమావేశాలు, వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, పాలన గాడిలో పెట్టుకుంటూ, తమ విధానాలను, పధకాలను, హామీలను, పోలసీలను, ప్రచారం చేసుకుంటూ, హఠాత్తుగా వచ్చిన వరదలకు బాధితులకు తనదైన రీతిలో సాయం, సహకారం అందించి, పొగడ్తలు, ప్రతిపక్షం నుండి విమర్శలు ఈ వంద రోజులలో మూట కట్టుకున్నారు.
ఈ వంద రోజులలో తన ప్రాముఖ్యతను చూపెట్టడంలో విఫలం చెంది, చంద్రబాబుతో పోలిస్తే కొంత వెనుక పడిన పవన్ కళ్యాణ్ కు, తిరుమల లడ్డూ కల్తీ వివాదం కలిసొచ్చిన అవకాశంగా కనిపించింది. ముందు చెప్పినట్లుగా స్క్రిప్ట్ దొరికితే పూర్తి నటన చూపించే హీరో లెక్కన, పవన్ కళ్యాణ్ తన నటనా కౌశలం చూపిస్తూ తనకు దొరికిన అవకాశం దొరికిపుచ్చుకున్నారు. ఆ కల్తీ లడ్డు సమస్య విషయంలో ఎంత వరకు పోరాడడానికి అవకాశం ఉందో పూర్తిగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆ విధంగా తన ఇమేజ్ నిలబెట్టుకోవడం, తన పోరాట పటిమ చూపించడం, పనిలో పనిగా మెజారిటీ మతం అభిమానం, కేంద్రం లోని బిజెపి పెద్దల ఆశీస్సులు పొందారు. ఇలా ఉండగా పవన్ కల్యాణ్ చేసిన గంభీర పోరాటం, కార్యక్రమాల వెనుక ఉన్న ఉద్దేశ్యం, కారణం అర్థం చేసుకోలేని ప్రతిపక్షాలు, అభ్యుదయ వాదులు, హేతువాదులు, రకరకాల విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం తను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలం కావడం వలన, ప్రజల దృష్టిని మళ్ళించడానికి “లడ్డూ వివాదం” తెరపైకి తీసుకువచ్చారు అని ప్రధాన ఆరోపణ.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి ఇంకా ప్రజలు ఆలోచన చేయడం లేదు. ప్రజలు ఇంకా వేచి చూడాలి అనే ఆలోచన లోనే ఉన్నారు. వారు గత ఎన్నికలలో పెద్ద మెజారిటీతో 162 సీట్లతో గెలిపించిన కూటమి ప్రభుత్వం మీద ఇంకా నమ్మకంతోనే ఉన్నారు. పైగా ఇటీవల కాలంలో విజయవాడలో వరదల గురించి ప్రజలు ఆందోళన పడుతున్నారు. ప్రజలు కనుక కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి ఆందోళన పడుతున్నట్లయితే, ప్రతిపక్షాలు ఆందోళనలకు సహకరించి ఎంతో కొంత కూటమి నాయకులను, ఎమ్మెల్యేలను నిలదీసి ఉండేవారు. నిజానికి ప్రతిపక్షాలు “ముందే కూసిన కోయిల” లాగా, ముందు ముందు చేయాల్సిన ఆరోపణలను, ఆందోళనలను ఇప్పుడే ఆరంభం చేసి, తరువాత చేయవలసిన పోరాటాలకు అవకాశం పోగొట్టుకున్నారు. కనుక ఇప్పుడే “డైవర్షన్ రాజకీయాలు” చేయవలసిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు.
ప్రతిపక్షాలు, వామపక్షాలు మరో వాదన చేస్తున్నారు. బిజెపి తన మత విశ్వాసాలను ప్రచారం చేసుకోవడానికి పవన్ కల్యాణ్ ను, కల్తీ లడ్డూ వివాదాన్ని ఉపయోగించారని, ఆ పేరుతో సనాతన ధర్మం ప్రచారం చేయించారని ఆరోపణలు చేసారు. ఈ ఆరోపణ కూడా అంత నమ్మదగినదిగా లేదు. ఎందుకంటే పవన్ కల్యాణ్ ను ముందు పెట్టి సనాతన ధర్మ ప్రచారం చేసుకోవడానికి బిజెపీకి అంత అవసరమూ లేదు, పవన్ కల్యాణ్ కు అంత ప్రచారం కలిగించడం వారికి ఇష్టమూ ఉండదు. బిజెపీకి సనాతన ధర్మం, హైందవ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రచారం చేసుకోవడానికి పెద్ద నెట్ వర్క్ ఉంది. బిజెపి తన పేటెంట్ హక్కుగా భావించే సనాతనధర్మం, హిందూ మత విశ్వాసాలను మరొకరు ప్రచారం చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. చివరికి చెప్పేదేమిటంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పోరాటాం ఒక గాలి తెర వంటిదే.
ఆ సినిమా రిలీజ్ అయిపోయింది.
మరొక స్క్రిప్ట్ దొరికి మరో పోరాటానికి అవకాశం వచ్చే వరకు పవన్ కళ్యాణ్ గారు తన పనేదో తాను చేసుకుంటారు.
అందువలన పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన కల్తీ లడ్డు వివాదం, సనాతన ధర్మ ప్రచారం, రెండూ ముగిసిన అధ్యాయాలే.
కనుక ఎవరూ ఇక ఆ విషయాల గురించి ఆందోళన చెందనక్కరలేదు, గొంతు చించుకోనక్కరలేదు.
కథ ముగిసింది.
శుభం కార్డుతో సినిమా తెర పడింది.
— పి. పి. శాస్త్రి,
న్యాయవాది, ఏలూరు
న్యాయవాది, ఏలూరు
Discussion about this post