శకుంతలాదేవి :
తనను ‘మానవ కంప్యూటర్’ అంటే ఆమెకు నచ్చలేదు!
భారతదేశం గర్వించదగిన, ప్రపంచం యావత్తూ మనవైపు అసూయతో జ్వలించిపోతూ చూడదగిన ప్రతిభావంతులు ఎందరో ఉన్నారు. ప్రత్యేకించి గణితశాస్త్రంలో అయితే.. ప్రపంచానికి- భారతదేశపు ప్రతిభకు వ్యత్యాసం నక్కకు నాగలోకానికి ఉన్నంతగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యావత్తు గణిత ప్రపంచానికే ఒక ‘0’ సున్నను కానుకగా అందించిన ఆర్యభట్ట దగ్గరినుంచి, త్రికోణమితి సూత్రాలు రూపుదిద్దుకునే విధంగా కృషిచేసిన గణితశాస్త్రవేత్త వరాహమిహిరుడు, ప్రపంచ గణిత మేథావులు అందరినీ అబ్బురపరచిన శ్రీనివాస రామానుజన్, జన్మతః అంధుడు అయినప్పటికీ.. గణితంలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేప్రతిభను ప్రదర్శించిన లక్కోజు సంజీవరాయశర్మ లాంటి అనేకమంది ప్రముఖుల సరసన నిలిచే ప్రతిభావంతురాలు.. మానవ కంప్యూటర్‌గా ప్రపంచం కీర్తించిన శకుంతలాదేవి. ఆమె జయంతి నవంబరు 4. ఆ సందర్భంగా పాఠకులకోసం ఆదర్శిని డాట్ కామ్ అందిస్తున్న ప్రత్యేక కథనం.
శకుంతలా దేవి నవంబర్ 4న 1929 లో బెంగళూరులో ఒక హిందూ కుటుంబంలో జన్మించారు. తనకి కేవలం మూడేళ్ల వయసు ఉన్నప్పుడే వాళ్ల నాన్న తనకి అంకెలు గుర్తుపెట్టుకోవడంలో అద్భుతమైన ప్రతిభ ఉందని గమనించాడు. దీనితో, సర్కస్‌లో పని చేస్తున్న వాళ్ల నాన్న సీ.వీ.సుందరరాజా రావు అక్కడి ఉద్యోగాన్ని వదిలేసి, తన కూతురి ప్రతిభను రోడ్లపై ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. తనకి కేవలం ఆరేళ్ల వయసు ఉన్నప్పుడే, శకుంతల తన ప్రతిభను మైసూర్ యూనివర్సిటీలో చాటుకుంది. ఎనిమిదేళ్ల వయసులో అదే ప్రతిభను అన్నామలై యూనివర్సిటీ లో నిరూపించింది. తర్వాత, 1944లో తండ్రితో కలిసి లండన్ వెళ్లిపోయారు.
మానవ సామర్థ్యాన్ని విస్తరించాలనే ఆమె తపన ఆమెను ‘మైండ్ డైనమిక్స్’ అనే ఒక ఒక కొత్త కాన్సెప్ట్ కనిపెట్టేటట్టు చేసింది. 1982లో ఆమె ప్రతిభకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ఆమె కాలంలో ఉన్న కంప్యూటర్ల కన్నా త్వరగా ఆమె లెక్కలు వేయగలిగేదట. 1980 జూన్ 18న ఆమె రెండు 13 అంకెలు ఉన్న సంఖ్యలని (7,686,369,774,870 ఇంక 2,465,099,745,779) గుణించి 28 సెకండ్లలో జవాబు చెప్పగలిగింది. ఈ సాహసమే తనని గిన్నిస్ బుక్‌కు ఎక్కించింది. ఈ సంఘటన 1995 గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో 26వ పేజీ లో ఉంది.
ఆమెకి స్వలింగ సంపర్కులు (హోమోసెక్సువల్స్) అంటే సానుభూతి ఉండేది. దాని గురించి ఆమె చాలా మందిలాగా చెడ్డగా తీసుకోకుండా, మంచిగా తీసుకుని, దాని గురించి ‘ది వరల్డ్ ఆఫ్ హోమోసెక్సువల్స్’ అని ఒక పుస్తకం కూడా రాసింది. భారత దేశంలో స్వలింగ సంపర్కం గురించి రాసిన మొదటి పుస్తకం అదే. ఆమె దీని గురించి వాదించింది ఏంటంటే, ప్రతి ఒక్కరు వేరు వేరు సమయాల్లో పరిస్థితిని బట్టి వేరు వేరు లైంగిక ధోరణులను, ప్రవర్తనలను ప్రదర్శిస్తారు. అంత మాత్రాన స్వలింగ సంపర్కం- భిన్న లింగ సంపర్కం (హోమోసెక్సువాలిటీ- హెటెరోసెక్సువాలిటీ) అనేది ఏమీ ఉండదు.
ఆమె 1960లో పరితోష్ బెనర్జీ (కలకత్తా ఐ.ఏ.ఎస్ ఆఫీసర్)ను పెళ్లి చేసుకుంది. కేవలం హోమోసెక్సువాలిటీ గురించే కాదు… ఆమె జ్యోతిష్యశాస్త్రం, గణితం ఇంక వంట గురించి కూడా పుస్తకాలు రాసింది.
ఆమె ప్రతిభను గుర్తిస్తూ బీ.బీ.సీ ఛానెల్ వాళ్లు ఆమెకు ‘హ్యూమన్ కంప్యూటర్’ అనే పేరు కూడా ఇచ్చి, ఆమె ప్రతిభను వారి ఛానెల్‌లో 1950 అక్టోబర్ 5న చూపించారు. కానీ, శకుంతల కు ఈ పేరు ఎప్పుడూ నచ్చలేదు. దీని గురించి ఆమె అభిప్రాయం ఏంటంటే, మానవ మెదడుకు కంప్యూటర్ కన్నా చాలా ఎక్కువ సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి మనిషి మెదడును కంప్యూటర్‌తో పోల్చడం సరైనది కాదు.
డల్లాస్‌లో ఆమె ఒక కంప్యూటర్‌తో 188138517 క్యూబ్ ఎవరు ముందు కనిపెడతారు అని పోటీ పడింది. ఆమే గెలిచింది. మరోసారి, యూ.ఎస్.ఏ లో ఆమెను 91674867692003915809866092758538016248310668014430862240712651642793465 70408670965932792057674808067900227830163549248523803357453169351119035 9657754734007568818688305620821016129132845564895780158806771
సంఖ్య యొక్క 23వ ‘రూట్’ కనుక్కోమని అడిగారు. 50 సెకండ్లలో జవాబు 546372891 అని చెప్పింది. ఆమె చెప్పిన జవాబు సరైనది అని చెప్పడానికి.. ఒక యూనివర్సల్ ఆటోమెటిక్ 1108 కంప్యూటర్‌కు 13,000 సూచనలు ఇచ్చిన తరువాత, 1 నిమిషం పట్టింది (శకుంతల దేవి తీసుకున్న సమయం కంటె అది 10 సెకండ్లు ఎక్కువ.)
శకుంతలా దేవి జీవితం ఆధారంగా ఒక చిత్రం కూడా నిర్మించారు. విద్యాబాలన్ ఇందులో ఆమె పాత్రను పోషించారు. భారత దేశంలో మొదటి గణిత శాస్త్రజ్ఞి అయిన శకుంతలా దేవి, గుండెసంబంధిత, శ్వాసకు సంబంధించిన సమస్యల వల్ల బెంగళూరులో 21 ఏప్రిల్ 2013 లో చనిపోయింది. చనిపోయినప్పుడు ఆమె వయసు 83 ఏళ్లు.
అంకెలకు కూడా జీవం ఉంటుంది. అవి కేవలం కాగితం మీద సంకేతాలు మాత్రమే కాదు.
..శకుంతలా దేవి
అంకెలనే జీవమున్నట్టుగా గుర్తించి.. వాటి స్వభావాన్ని అర్థం చేసుకున్నది గనుకనే.. శకుంతలా దేవి మానవ స్వభావాలను కూడా వారి వారి దృక్కోణాల్లోంచి అధ్యయనంచేసి, కేవలం గణితమేథావిగానే కాకుండా, గొప్ప మానవతా వాదిగా మన హృదయాల్లో నిలిచిపోయింది.
.. ఆదర్శిని శ్రీ
ఇదీ చదవండి పర్యాటకులకు స్వర్గధామం లాంటి చిన్నదీవి ఏంటో తెలుసా? నిర్లక్ష్యం పనికి రాదు ఏటీఎంలోకి పోకుండా నోట్ల కట్టలు హాంఫట్ చిత్తూరు జిల్లాలో కరోనా దెయ్యానికి టీచర్లే ఎర అన్ని పనులూ వారికి చెప్తారు.. వారి గోడు మాత్రం వినరు!
.

Discussion about this post