డొమినికా అనేది కరీబియన్ సముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీప దేశం. అది దాదాపు 750 చదరపు కిలోమీటర్ల వైశాల్యం లో ఉంటుంది. అంటే, మన దేశంలో అతి చిన్న యూనియన్ టెరిటరీ అయిన లక్షద్వీప్ ను దాదాపు 24 సార్లు గుణిస్తే, అంత దేశం వస్తుంది. ఇది గువాడెలోప్ ఇంక మార్టీనీక్ కు దగ్గరగా ఉంటుంది. దీనిని ‘నేచర్ ఐలాండ్ ఆఫ్ కరీబియన్’ అని కూడా పిలుస్తారు.
మీరు గనుక ప్రకృతిని బాగా ప్రేమించేవారు అయితే, ఈ ప్రదేశం మీకు చాలా బాగా నచ్చే అవకాశం ఉంది. ఇక్కడ, తూర్పు కరీబియన్‌లోనే అతి పెద్ద కొండలు ఉంటాయి. బాగా చెట్లు, అడవులు… అన్నీ ఉంటాయి. సముద్రం ఇంక కొండలు… రెండూ కలిపిన ప్రదేశాలంటే నాకు చాలా ఇష్టం. కానీ కేవలం రెండు చిన్న ఎయిర్ పోర్ట్స్ మాత్రమే ఉండడం వల్ల పర్యాటక కంపెనీలు దీనికి పెద్దగా గుర్తింపు ఇవ్వడంలేదు. ఏదైతేనేం, ఈ అందమైన దేశాన్ని, ఇటలీకి చెందిన క్రిస్టొఫర్ కొలంబస్ అనే గొప్ప అన్వేషకుడు నవంబర్ 3న కనిపెట్టాడు. కొలంబస్ కి థాంక్స్ చెప్తూ, డొమినికా అనే ఈ చిన్న ఐలాండ్ లో ఉన్న అత్యంత ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
మోర్న్ ట్రోయిస్ పిటన్స్ నేషనల్ పార్క్
ఇది డొమినికా కి తలమానికమైనదని అని అనుకోవచ్చు. నేషనల్ పార్క్ అంటేనే బోలెడంత అందమైన ప్రకృతిని ఆస్వాదించచ్చు. దీనికి ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా గుర్తింపు ఉంది! ఇందులో మళ్లీ బాయిలింగ్ లేక్, విక్టోరియా ఫాల్స్, ఎమరల్డ్ పూల్, ట్రఫాల్గర్ ఫాల్స్ లాంటి మైమరపించే పేరులతో ఇంకా ఎక్కువగా మైమరపించే ప్రదేశాలు ఉంటాయి. నాకు వాటర్ ఫాల్స్ అంటే కూడా చాలా ఇష్టం. నేను పర్యటించిన ప్రాంతాల్లో కర్ణాటక లోని జోగ్ ఇంక అబ్బే ఫాల్స్ నాకు చాలా చాలా ఇష్టం. కొడైకెనాల్‌లో కూడా సంతూర్ ఫాల్స్ లాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లాంటివి బోలెడు.. ఉల్లాసం కలిగిస్తుంటాయి.

కాబ్రిట్స్ నేషనల్ పార్క్
ఒక్క చాలా చిన్న దేశంలో రెండు నేషనల్ పార్క్స్ ఉన్నాయంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇందులో మళ్లీ బోలెడన్ని వేరే ప్రదేశాలు ఉంటాయి. ఫోర్ట్ షర్లీ ని కూడా మనం చూడగలం. ఫోర్ట్ షర్లీ 18వ శతాబ్దం లో బ్రిటష్ వాళ్లు కట్టిన ఒక గారిసన్. ఇక్కడ నుంచి మనం ప్రిన్స్ రూపర్ట్ బే ని కూడా చూడగలం. ఎన్ని ప్రదేశాలున్నా కూడా, చారిత్రక ప్రదేశాలకు వెళ్లినప్పుడ వచ్చే ‘ఫీల్’ వేరు అని అనిపిస్తుంది నాకు.
రూసో
దేశంలో ఉన్న ప్రదేశాలు అన్నీ చూసి, దేశం రాజధానినే వదిలేస్తే ఏం బావుంటుంది? రూసో అనే ప్రదేశంలో మనం వెస్ట్ ఇండియన్ కుటీరాలు, పెద్ద-పెద్ద భవనాలు, ఇంక చిన్న చిన్న అంగళ్లను… అన్నింటినీ మిక్సీ వేస్తే మనకి వచ్చే జ్యూసే రూసో. ఇక్కడ ఉండే ఓల్డ్ మార్కెట్ లో మనకు తాజా పండ్లు, కూరగాయలు, వంటివి దొరుకుతాయి. 19వ శతాబ్దం లో కట్టిన సెంట్ పాట్రిక్స్ కాతెడ్రల్ కూడా ఇక్కడ చాలా ఫేమస్. రూసో లో మరికొన్ని ముఖ్య స్థానాలలో డొమినికా బొటానిక్ గార్డెన్స్, డొమినికా మ్యూజియం, మోర్న్ బ్రూస్ కూడా ఉన్నాయి.
కరోనా పూర్తిగా వెళ్లిపోయాక, పర్యాటక ఆసక్తి ఉన్నవారు డొమినికాకు కూడా వెళ్లవచ్చు. అందరూ ఇష్టపడే వాటర్ ఫాల్స్, కొండలు, సముద్రం, చారిత్రిక ప్రదేశాలు… అన్నీ కేవలం ఒక్క చిన్న దేశంలో ఉన్నాయి.
.. ఆదర్శిని శ్రీ
.

Discussion about this post