• About Us
  • Contact Us
  • Our Team
Monday, October 19, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

భూక్యా గోపి నాయక్ కథ : ఖాకీ ఆకు

admin by admin
October 18, 2026
0
భూక్యా గోపి నాయక్ కథ : ఖాకీ ఆకు

1

పగిలిన అద్దం ముక్కలో తన ముఖం తనకే కొత్తగా, ఎవరో పరాయి మనిషిలా కనిపించింది బిక్కుకి.

ఆ అద్దం వెనుక ఉన్న పాదరసం అక్కడక్కడా రాలిపోయి, మనిషి మొహం మీద నల్లటి మచ్చలు పడినట్టుగా మసకగా ఉంది. అయినా సరే, ఈ పొద్దు ఆ అద్దంలో కనిపిస్తున్న దృశ్యం వేరు. వెంపల్లి తండా పుట్టినప్పటి సంచీ ఏ ఇంటి మట్టి గోడకూ తగలని ఒక కొత్త రంగు ఈరోజు వాళ్ల గుడిసెలో మెరుస్తోంది. అది ఖాకీ రంగు. గంజి పెట్టి ఇస్త్రీ చేసిన మందపాటి ఖాకీ చొక్కా, భుజాల మీద మెరిసే ‘ఫారెస్ట్ గార్డ్’ ఇత్తడి అక్షరాలు, నడుముకు బిగించిన వెడల్పాటి తోలు బెల్టు.

బిక్కు తన చేతి వేళ్లతో చొక్కా గుండీలను తడుముకున్నాడు. అవి చల్లగా, గట్టిగా తగిలాయి. ఇరవై ఆరేళ్ల తన బతుకులో ఒంటి మీద ఇంత బరువైన గుడ్డ పడటం ఇదే మొదటిసారి. అంతవరకూ వాడి ఒంటికి తెలిసిన బరువు వానకు తడిసిన గొంగడి మాత్రమే. వాడి భుజాలకు తెలిసిన రాపిడి అడవి నుంచి మోసుకొచ్చే ఎండు కట్టెల మోపు మాత్రమే. చొక్కా కాలర్ మెడకు బిగుతుగా తగులుతుంటే, ఎవరో తన గొంతు చుట్టూ ఉచ్చు బిగించినట్టుగా ఉక్కపోతగా అనిపించింది.

భూక్యా గోపినాయక్,
99891 59196

తడిక తలుపు సందులోంచి బయటకు చూశాడు బిక్కు. నల్లమల అడవి ఆకుపచ్చని కొంగు అంచున ఎవరో దోసెడు గులకరాళ్లు విసిరేసినట్టుగా ఉన్న ఇరవై గుడిసెల వెంపల్లి తండా అప్పుడే నిద్ర లేస్తోంది. గుడిసెల ముందు గాటాలకు కట్టేసిన లేగదూడలు తల్లుల పొదుగుల కోసం మెడలు సాచి అరుస్తున్నాయి. ఎర్రమట్టి గోడల మీద సున్నంతో వేసిన జింకల, నెమళ్ల బొమ్మలు ఉదయం పూట లేత ఎండలో మెరుస్తున్నాయి. తండా నడుమ ఉన్న పెద్ద వేపచెట్టు కింద సేవాలాల్ మహరాజ్ తెల్ల జెండా సన్నని గాలికి రెపరెపలాడుతోంది. పచ్చి వేపపుల్ల నములుతున్న మగవాళ్ల గొంతులు, కుండల్లో మరుగుతున్న జొన్న గట్కా బుడగల చప్పుడు, నిన్నటి వానకు తడిసిన ఆవు పేడ కమ్మటి వాసన…అన్నీ కలిసి గాలిలో తేలుతున్నాయి.

“అరె… మార్ బేటా దొరయిపోయినాడురో!”

వెనుక నుంచి యాడి గొంతు వినబడింది. ఆ గొంతులో గర్వం కంటే ఎక్కువగా ఏళ్ల తరబడి గుండెల్లో దాచుకున్న ఒక దిగులు కరిగిపోతున్న తడి ఉంది. సక్రిబాయి చేతిలో ఇత్తడి పళ్లెం, అందులో పసుపు కలిపిన అక్షతలు, వెలుగుతున్న ఆముదం దీపం ఉన్నాయి. ఆమె కట్టుకున్న పాత లంబాడీ ఫేటియా, రవిక (కాంచళి) అంచులకి ఉన్న చిన్న చిన్న అద్దాలు దీపం వెలుగులో మిణుగురు పురుగుల్లా మెరిశాయి. కణతల దగ్గర జుట్టుకు వేలాడుతున్న వెండి ‘ఘూగ్రీ’లు ఆమె నడుస్తుంటే సన్నగా కదిలాయి. తల మీద నుంచి భుజాల మీదుగా కప్పుకున్న ఎర్రటి మందపాటి ‘ఛాంటియా’ (మేలిముసుగు) కొంగుతో ఆమె తన కళ్ల చివర చేరిన నీటి బొట్టును తుడుచుకుంది.

చిన్నప్పటి నుంచి బిక్కుకి యాడి కప్పుకునే ఆ ‘ఛాంటియా’ చెంగే లోకం. అడవిలో వానొచ్చినా, ఎండ కొట్టినా యాడి ఆ ‘ఛాంటియా’ కొంగు కిందే వాడిని దాచుకునేది. మోచేతుల దాకా తెల్లటి కొమ్ము గాజులు (బలియా) వేసుకున్న ఆమె ముడతలు పడిన చేతులు కొడుకు ముఖం దగ్గరకు వచ్చినప్పుడు సన్నగా వణికాయి.

బిక్కు వంగి యాడి పాదాలకు మొక్కాడు. మట్టిలో నడిచి నడిచి పగుళ్లు బారిన ఆ పాదాల నుంచి ఇప్పపూల వాసన, పచ్చి పేడ వాసన, అడవి మట్టి వాసన ఒక్కసారిగా వాడి ముక్కుపుటాలకు తాకాయి.

“సల్లగుండు చోరా… సేవాలాల్ మహరాజ్ నిన్ను సల్లగా సూడాల. మేరమ్మ తల్లి నీకు తోడుండాల. మీ బాపు బతికుంటే ఈ పొద్దు తండా అంతా విప్పసారా పోయించేటోడు. ఆ అడవే మనల్ని కన్నది, ఆ అడవే ఈ పొద్దు నా కొడుక్కి సర్కారు కొలువు ఇచ్చింది” అంది యాడి. ఆమె కొడుకు నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి, కుడి చేతి చూపుడు వేలితో దీపపు కుంది అడుగున ఉన్న నల్లటి మసిని తీసుకుని బిక్కు గడ్డం కింద దిష్టి చుక్క పెట్టింది. ‘ఖాకీ బట్ట కట్టిన నా కొడుక్కి ఊరి కన్ను, అడవి కన్ను తగలకూడదు’ అని మనసులోనే మేరమ్మకు మొక్కుకుంది.

తండ్రి మాట రాగానే బిక్కు కళ్లు ఇంటి చూరు వైపు వెళ్లాయి. అక్కడ పొగచూరిన వెదురు దూలాలకు తగిలించి ఉన్న తండ్రి పాత గొడ్డలి కనిపించింది. ఆ గొడ్డలి కర్ర పిడి మీద తండ్రి అరచేతి చెమట మరకలు ఇంకా నల్లగా అలాగే ఉన్నాయి. బిక్కుకి పదేళ్ల వయసున్నప్పుడు, అడవిలో తేనె తీయడానికి వెళ్లిన తండ్రిని ఎలుగుబంటి చంపేసింది. అయినా సరే, సక్రిబాయి గానీ, తండా గానీ ఏ రోజూ అడవిని శత్రువుగా చూడలేదు. “అడవి తల్లి తన బిడ్డను తన ఒడిలోకి తీసుకుంది” అనే అనుకున్నారు. ఆ గొడ్డలి పక్కనే యాడి అడవికి తీసుకెళ్లే వెదురు గంప వేలాడుతోంది. వాటికి సరిగ్గా కింద, మట్టి గచ్చు మీద తళతళలాడుతున్న తన కొత్త నల్ల బూట్లు, చేతిలో పట్టుకున్న ప్రభుత్వ లాఠీ ఉన్నాయి. ఆ చూరుకు, ఈ గచ్చుకు మధ్య ఏదో కంటికి కనిపించని అగాధం అప్పుడే మొదలైనట్టు బిక్కుకి అనిపించింది.

తండాలో పదో తరగతి దాటి, మండల కేంద్రంలోని హాస్టల్లో ఉండి డిగ్రీ పూర్తి చేసిన మొదటి పిల్లాడు బిక్కునే. ఫారెస్ట్ గార్డ్ (బీట్ ఆఫీసర్) ఉద్యోగానికి పరుగు పందెం పెట్టినప్పుడు, తారు రోడ్డు మీద బూట్లు వేసుకుని పరిగెత్తిన పట్నం కుర్రాళ్లందరూ వెనుకబడిపోయారు. ముళ్ల పొదల్లో, రాళ్ల గుట్టల్లో, వాగుల్లో కుందేలు పిల్లలా పరిగెత్తిన బిక్కు కాళ్లకు ఆ పరుగు ఒక లెక్క కాలేదు.

ఇంటి బయటకు రాగానే తండా అంతా వాడి కోసమే నిలబడి ఉంది. మగవాళ్లు చుట్టలు నోట్లో పెట్టుకుని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ముసలివాళ్లు కళ్లకి చేతులు అడ్డం పెట్టుకుని వాడి భుజం మీద ఉన్న ఇత్తడి బిళ్లను చూస్తున్నారు. చిన్నపిల్లలు వాడి బూట్ల చప్పుడికి భయపడి తల్లుల ఫేటియాల వెనుక దాక్కుంటున్నారు.

తండా పెద్ద నాయక్ ముందుకు వచ్చి బిక్కు భుజం తట్టాడు. “బిక్కూ… మన పెద్దలు ఒక మాట చెప్తరు…‘అడవి తల్లి కడుపులో పుట్టిన పురుగు, అడవి ఆకు తింటేనే బతుకుతది’ అని. మన తండా పుట్టినప్పటి సంచీ ఖాకీ బట్ట మన గడప తొక్కేది మనిషిని పట్టుకపోనీకే. పుల్ల విరిచినమని ఒకసారి, పోడు కొట్టినమని ఇంకోసారి. ఇయ్యాల మన తండా బిడ్డే ఆ ఖాకీ బట్ట కట్టిండు. ఇక మనకు అడవిలో భయం లేదు. మన గొడ్లు, మన మనుషులు నిమ్మళంగా బతుకుతారు” అన్నాడు నాయక్.

అక్కడే వేపచెట్టు కింద నిలబడి ఉన్న ధర్మా ముందుకు వచ్చి బిక్కుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ధర్మా భుజం మీద చొక్కా లేకపోవడంతో, వాడి ఎడమ భుజం మీద ఉన్న లోతైన పాత గాయం మచ్చ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రోజు బిక్కు తండ్రి మీద ఎలుగుబంటి పడినప్పుడు, పదేళ్ల బిక్కుని చెట్టు ఎక్కించబోయి ధర్మా తన భుజాన్ని ఎలుగుబంటి గోళ్లకు అడ్డం పెట్టాడు. ఆ రక్తపు బంధం వాళ్లది.

“అరె గార్డు దొరా… బూట్లు గట్టిగా ఉన్నాయా? అడవిలో నడిస్తే కరుస్తాయేమో సూసుకో. మన కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటేనే నడక వస్తది కానీ, ఈ డబ్బాలల్ల కాళ్లు పెడితే నడవొస్తదా?” అంటూ పకపకా నవ్వాడు ధర్మా.

బిక్కు నవ్వడానికి ప్రయత్నించాడు. కానీ కొత్త బూట్లలో ఇరుక్కున్న వాడి కాలి వేళ్లు అప్పుడే ఊపిరాడనట్టుగా నొప్పి పుడుతున్నాయి.

తండా దాటి అడవి దారి పట్టినప్పుడు ఉదయం ఎండ చెట్ల ఆకుల సందుల్లోంచి బంగారు కడ్డీల్లా నేల మీద పడుతోంది. ఈ దారి బిక్కుకి కళ్లు మూసుకున్నా తెలుసు. ఏ మలుపు దగ్గర మద్దిచెట్టు వేరు పైకి తేలి ఉంటుందో, ఏ పొద వెనుక నెమళ్లు గుడ్లు పెడతాయో, ఏ గుట్ట కింద ఊటనీరు వేసవిలో కూడా తియ్యగా ఊరుతుందో వాడి రక్తంలోనే రాసిపెట్టి ఉంది.

అంతవరకూ ఆ అడవిలో నడిచినప్పుడు వాడి పాదాలకు మట్టి మెత్తదనం, పచ్చి గడ్డి చల్లదనం నేరుగా తగిలేవి. ఈరోజు వాడి పాదాలకు, అడవి తల్లి గుండెకు మధ్య ఒక అంగుళం మందం ఉన్న నల్లటి రబ్బరు బూటు అడ్డుగా నిలబడింది. నడుస్తుంటే రాలిన ఎండుటాకులు ఆ బూట్ల కింద నలిగిపోయి ‘కరకర’మని వింతగా, ఏదో చిన్న చిన్న జీవుల ఎముకలు విరిగినట్టుగా శబ్దం చేస్తున్నాయి.

ఆ శబ్దానికి చెట్ల మీద ఉన్న పక్షులు భయపడి ఎగిరిపోయాయి. అంతవరకూ తన అడుగుల చప్పుడు విని దగ్గరకు వచ్చే అడవి పిచ్చుకలు, ఈరోజు తన ఒంటి మీద ఉన్న ఖాకీ రంగును చూసి దూరంగా పారిపోతున్నట్టు బిక్కుకి అనిపించింది. వాడు ఆగి, ఒక విప్ప చెట్టు కాండాన్ని చేత్తో తాకాడు. చెట్టు బెరడు గరుకుగా తగిలింది. కానీ నడుముకు వేలాడుతున్న లాఠీ విప్ప చెట్టు కాండానికి తగిలి ‘టక్’ మని చప్పుడు చేసింది. ఆ దెబ్బకు చెట్టు కొమ్మల మీద ఉన్న మంచు బొట్లు నాలుగు జారి బిక్కు ఖాకీ భుజాల మీద కన్నీళ్లలా పడ్డాయి.

2

అడవి మొదట్లో ఉండే ఫారెస్ట్ చెక్‌పోస్ట్ దగ్గర ఆకుపచ్చ రంగు వేసిన ఇనుప గేటు ఉంది. ఆ గేటుకు ఇవతల తారు రోడ్డు, అవతల ఎర్రమట్టి బాట.

రేంజర్ ప్రతాప్ జీపు బానెట్ మీద మ్యాపు పరిచి చూస్తున్నాడు. నలభై ఐదేళ్ల వయసు, కళ్లకి నల్ల కళ్లద్దాలు. ఆయన ఎప్పుడూ గట్టిగా అరవడు. చాలా నెమ్మదిగా, అక్షరాలు లెక్కపెట్టినట్టు మాట్లాడతాడు. కానీ ఆ నెమ్మదితనం వెనుక ఒక కఠినమైన మరమనిషి తత్వం ఉంటుంది.

బిక్కు సెల్యూట్ చేసి నిలబడ్డాడు.

ప్రతాప్ తలెత్తి కళ్లద్దాలు తీస్తూ బిక్కుని చూశాడు. “బిక్కు నాయక్… వెంపల్లి తండా కదా? ఈ వెస్ట్ బీట్ మొత్తం ఇవాళ్టి నుంచి నీ ఆధీనంలో ఉంటుంది.”

“అవును సార్.”

ప్రతాప్ చిన్నగా నవ్వి బిక్కు భుజం మీద చెయ్యి వేశాడు. “చూడు బిక్కూ… నేను కూడా నీలాగే ఒక చిన్న పల్లెటూరి నుంచి వచ్చినవాడినే. నాకూ ఊరుంది, నాకూ అమ్మ ఉంది. కానీ మనం సర్కారు ఉప్పు తింటున్నాం. అడవి అంటే మన కంటికి చెట్లు, పుట్టలు. కానీ ప్రభుత్వానికి ఇది లెక్కలతో కూడిన ఆస్తి. దయ, జాలి గుండెల్లో ఉండాలి కానీ ఫైళ్లలో కనిపించకూడదు. ఈ గేటు దాటి లోపలికి వచ్చావంటే నీకు తండా లేదు, చుట్టాలు లేరు.”

ప్రతాప్ తన టేబుల్ మీద ఉన్న ఒక చిన్న నల్లటి ఎలక్ట్రానిక్ పెట్టెను (GPS పరికరం) తీసి బిక్కు చేతిలో పెట్టాడు.

“ఇది జీపీఎస్ ట్రాకర్. డ్యూటీలో ఉన్నంతసేపూ ఇది నీ బెల్టుకు ఉండాలి. పైనుంచి శాటిలైట్ కెమెరాలతో అడవిని చూస్తున్నారు. నువ్వు అడవిలో ఏ చెట్టు కింద ఆగినా, ఏ రాయి మీద కూర్చున్నా, ఎన్ని కిలోమీటర్లు నడిచినా నా ఆఫీసులోని కంప్యూటర్ తెర మీద ఎర్ర చుక్కలా కనిపిస్తుంది. ఒక్క చెట్టు తగ్గినా, ఒక్క మనిషి లోపలికి వచ్చినా కంప్యూటర్లో రెడ్ మార్క్ పడుతుంది. అప్పుడు నా ఉద్యోగం పోతుంది, నీ ఉద్యోగం పోతుంది. గుర్తుపెట్టుకో బిక్కూ… అడవిని నువ్వు కాపలా కాస్తున్నావ్, నిన్ను ఈ మిషన్ కాపలా కాస్తోంది. అర్థమైందా?”

ఆయన గొంతులో కోపం లేదు, కానీ ఆ మాటలు బిక్కు గుండెల్లో మంచు గడ్డల్లా దిగాయి. బెల్టుకు తగిలించుకున్న ఆ నల్లటి మిషన్లో మెరుస్తున్న చిన్న ఎర్రటి లైటు, తన గుండె చప్పుడును కూడా లెక్కపెడుతున్న నిఘా కన్నులా అనిపించింది. “అర్థమైంది సార్” అన్నాడు బిక్కు.

మరుసటి రోజు ఉదయాన్నే అడవి అంచుకు మూడు పసుపు రంగు జేసీబీ మిషన్లు వచ్చాయి. అడవి చుట్టూ ఉన్న పది కిలోమీటర్ల పరిధిని ప్రభుత్వం ‘ఎకో-టూరిజం’ ,’కోర్ రిజర్వ్ జోన్’గా ప్రకటించింది. అడవిలోకి పశువులు గానీ, మనుషులు గానీ రాకుండా అడవి చుట్టూ ఆరు అడుగుల లోతు, ఆరు అడుగుల వెడల్పుతో కందకం తవ్వాలి. ఆ కందకం గట్టు మీద నిలువెత్తు ఇనుప ముళ్ల కంచె వేయాలి. ఆ పనికి ఫారెస్ట్ గార్డుగా బిక్కునే కాపలా పెట్టాడు రేంజర్.

జేసీబీ ఇంజిన్లు పెద్దగా రొద పెడుతూ స్టార్ట్ అయ్యాయి. మొదటి ఇనుప చేయి భూమిలోకి దిగింది. తండా ఏర్పడినప్పటి నుంచి మనుషులు, పశువులు నడిచి నడిచి నున్నగా మారిన కాలిబాట అది. ఆ దారి గుండెల్లోకి ఇనుప పళ్లు దిగి, ఎర్రటి మట్టిని పెళ్లగించి పక్కన పోశాయి. మట్టి లోపల ఉన్న పెద్ద పెద్ద చెట్ల వేళ్లు ‘ఫెళఫెళ’మని విరిగిపోతున్నాయి. వందేళ్ల నాటి మర్రిచెట్టు వేరు ఒకటి జేసీబీ పంటికి చిక్కి తెగిపోయినప్పుడు, ఆ వేరులోంచి కారుతున్న పచ్చి రసం మనిషి నరం తెగి రక్తం కారుతున్నట్టే ఉంది.

మధ్యాహ్నం అయ్యేసరికి తండా జనం గుంపుగా అక్కడికి వచ్చారు. వాళ్ల కంటే ముందు, రోజూ అడవిలోకి మేతకు వెళ్లే తండా ఆవుల మంద అక్కడికి వచ్చింది.

రోజూ వెళ్లే దారిలో హఠాత్తుగా ఆరడుగుల లోతైన గొయ్యి కనిపించేసరికి ఆ మూగ జీవాలు బిత్తరపోయి ఆగిపోయాయి. కందకం అవతల అడవిలో పచ్చని గడ్డి గాలికి ఊగుతోంది. ఇవతల ఎండలో నిలబడిన ఆవులు, లేగదూడలు ఆ గొయ్యి దాటలేక, అవతలి పచ్చగడ్డిని చూస్తూ మెడలు సాచి ‘అంబా…’ అని దీనంగా అరవడం మొదలుపెట్టాయి.

మందలో ముందున్న బిక్కు వాళ్ల ఇంటి ముసలి ఆవు ‘లక్ష్మి’, కందకం అవతల ఖాకీ బట్టల్లో నిలబడి ఉన్న బిక్కుని గుర్తుపట్టింది. రోజూ తన మెడ కింద గజ్జెలు నిమిరే బిక్కు, ఇవాళ తనను అడవిలోకి రానివ్వకుండా అడ్డంగా ఎందుకు నిలబడ్డాడో ఆ మూగజీవానికి అర్థం కాలేదు. అది గొయ్యి అంచున నిలబడి బిక్కు వైపు చూస్తూ, ముక్కుపుటాలు ఎగరేస్తూ ‘అంబా…’ అని పిలిచి ముందుకు అడుగు వేయబోయింది. మట్టి జారి కందకంలో పడబోతున్న ఆ ఆవు కొమ్ములను ధర్మా పరిగెత్తుకుంటూ వచ్చి వెనక్కి లాగాడు. బిక్కు ఆ ఆవు కళ్లలోకి చూడలేక ముఖం తిప్పుకున్నాడు.

నాయక్ ముందుకు వచ్చి, “అరె బిక్కూ… ఇదేందిరా? మన గొడ్లు పోయే దారికి అడ్డంగా ఇంత పెద్ద బొంద తవ్వుతున్నారు? ఈ మూగ జీవాలు ఏం తిని బతకాల? మన ఆడోళ్లు కట్టె పుల్లలకు ఎట్లా దాటాల?” అని అడిగాడు.

బిక్కు కళ్లు దించుకున్నాడు. “ఇది సర్కారు అడవి మామా… ఇకపై అడవిలోకి గొడ్లు పోవడానికి వీల్లేదు. మనుషులు కూడా పోకూడదు. చుట్టూ ఇనుప కంచె వేస్తున్నారు.”

ధర్మా కందకం మట్టి కుప్ప మీద నిలబడి బిక్కు కళ్లలోకి సూటిగా చూశాడు. “సర్కారు అడవా? ఈ చెట్లను సర్కారోడు నాటిండా రా బిక్కూ? తాతల కాలం సంచీ అడవికి అగ్గి అంటుకుంటే పచ్చి కొమ్మలు కొట్టి మంటలు ఆర్పింది మన తండా. ఇయ్యాల పట్నం నుంచీ నాలుగు మిషన్లు తెచ్చి బొంద తవ్వితే అడవి వాళ్లదైపోతదా? అయినా ఈ బొంద మమ్మల్ని ఆపనీకి తవ్వడం లేదు… నిన్ను మా నుంచీ వేరు చేయనీకి తవ్వుతున్నారు!” అని ధర్మా తన గొడ్లను మళ్లించుకుని వెళ్లిపోయాడు.

వారం రోజుల్లో కందకం తవ్వడం పూర్తయింది. దాని మీద ఏడు వరుసల ఇనుప ముళ్ల కంచె బిగించారు. చెక్‌పోస్ట్ దగ్గర ఆకుపచ్చ రంగులో అందమైన జింక బొమ్మ గీసి, పెద్ద పెద్ద ఇంగ్లీషు అక్షరాలతో “LOVE NATURE – SAVE FOREST” అని రాసిన బోర్డు పాతారు.

ఆ ఆదివారం మధ్యాహ్నం ఒక పెద్ద నల్ల కారు చెక్‌పోస్ట్ దగ్గర ఆగింది. అందులోంచి పట్నం మనుషులు దిగి సఫారీ టికెట్లు తీసుకున్నారు. రేంజర్ ప్రతాప్ చిరునవ్వుతో సెల్యూట్ చేసి, బిక్కుని గేటు తీయమని సైగ చేశాడు. బిక్కు గేటు తెరిచాడు. కారు లోపలికి వెళ్తుండగా, వెనుక సీట్లో కూర్చున్న ఒక పిల్లాడు తాగి పారేసిన ఖాళీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను కిటికీలోంచి బయటకు విసిరాడు. అది గాలిలో గిరగిరా తిరిగి సరిగ్గా ‘LOVE NATURE’ అని రాసిన బోర్డు కింద పడింది.

సరిగ్గా అదే సమయంలో, కొంచెం దూరంలో ఇనుప కంచె అవతల నిలబడి ఉన్న తండా ముసలామె రూప్లీబాయి, గాలికి కంచె కింద నుంచి ఇవతలికి కొట్టుకొచ్చిన ఒకే ఒక్క ఎండు పుల్లను తీసుకోవడానికి ముళ్ల తీగల సందులోంచి చెయ్యి చాచింది.

రేంజర్ ప్రతాప్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. “బిక్కూ… చూస్తూ నిలబడ్డావేం? విజిల్ ఊదు!” అన్నాడు.

బిక్కు జేబులోంచి విజిల్ తీసి నోట్లో పెట్టుకున్నాడు. వాడి ఊపిరి ఆ విజిల్‌లోంచి ‘పీ…’ మని కర్కశమైన శబ్దంగా బయటకు వచ్చింది. ఆ శబ్దానికి రూప్లీబాయి ఉలిక్కిపడి, చేతికి ముళ్ల తీగ గీరుకుపోగా ఆ ఎండు పుల్లను అక్కడే వదిలేసి భయంతో వెనక్కి తగ్గింది.

ఆ రాత్రి బిక్కుకి అడవి లోపల ఉన్న ఎత్తైన కర్ర మంచె(వాచ్ టవర్ ) మీద డ్యూటీ పడింది.

చుట్టూ చిమ్మచీకటి. అడవి నిండా కీచురాళ్ల రొద. మంచె మీద ఒంటరిగా కూర్చున్న బిక్కుకి దూరంగా తండా వైపు నుంచి కుక్కలు మొరుగుతున్న శబ్దం, ఏదో గుడిసెలో ఆడవాళ్లు తిరగలి విసురుతున్న చప్పుడు వినిపిస్తోంది. ఆ చప్పుడుతో పాటే, చల్లటి అడవి గాలిలో తేలుతూ ముళ్ల కంచెను దాటుకుని, పుట్టింటిని విడిచిపెడుతున్న ఆడబిడ్డ ఏడుస్తూ పాడుకునే ‘ఢావ్లో’ (ఏడుపు పాట) లాంటి విషాద గీతం వాడి చెవులను తాకింది..

‘ఘుమర్ ఘుమర్ ఘంటీ బాజే యాడీ… మారో వనరో మోర్ కణ్ ఖోవాగో యాడీ… ఝాడేరీ ఛాయా రడీ రీ ఛ యాడీ…’

(తిరగలి గుర్రున తిరుగుతూ ఏడుస్తోంది తల్లీ… నా అడవి నెమలి ఎక్కడ తప్పిపోయిందో… చెట్టు నీడ ఒంటరిగా విలపిస్తోంది తల్లీ…)

ఆ ఢావ్లో రాగంలోని ఒక్కో మాట బిక్కు గుండెల్లో సూదిలా గుచ్చుకుంది. అవును, తాను అడవిలో తప్పిపోయిన నెమలే. చెట్టు నీడను వదిలేసి, చెట్టుకే కావలి కాస్తున్న పరాయి పక్షి. ఆ పాట వింటుంటే వాడికి తన చిన్నతనం కళ్లముందు కదిలింది. తండ్రి భుజం మీద కూర్చుని ఇదే అడవిలో తిరిగిన రోజులు, జొన్నలు విసురుతున్న యాడి ఒడిలో తల పెట్టుకుని ఆ పాట వింటూ నిద్రపోయిన రాత్రులు గుర్తొచ్చాయి.

చలి వేస్తుంటే బిక్కు తన మోకాళ్లలో తల దూర్చుకున్నాడు. వాడి ముక్కుకు తన ఒంటి మీద ఉన్న ఖాకీ చొక్కా వాసన తగిలింది. అందులో గంజి వాసన, ఇనుప పెట్టె ఇస్త్రీ వాసన తప్ప…యాడి ఢావ్లో కొంగులో ఉండే ఇప్పపూల వాసన గానీ, తండా మట్టి వాసన గానీ లేవు. బెల్టుకు ఉన్న జీపీఎస్ మిషన్లో ఎర్రటి లైటు చీకట్లో మిణుకు మిణుకుమంటోంది. ఆ చీకట్లో, ఆ అడవి నడుమ, తనకిష్టమైన చెట్ల మధ్యే ఉంటూ కూడా తాను పూర్తిగా పరాయివాడైపోయానని బిక్కుకి అర్థమైంది. గొంతులో ఏదో గడ్డకట్టుకుపోయినట్టు ఊపిరాడలేదు. వాడు తన ఖాకీ చొక్కా మొదటి గుండీని బలంగా లాగి విప్పేశాడు. అయినా గుండెల్లో ఉక్కపోత తగ్గలేదు. కళ్లలోంచి ఉబికి వచ్చిన వేడి నీటి బొట్లు వాడి మీసాలను తడుపుతూ, చేతిలో ఉన్న చల్లటి లాఠీ కర్ర మీద రాలాయి.

3

ఎండాకాలం వచ్చింది. ఎండకు నల్లమల చెట్ల బెరళ్లు చిట్లిపోయి, అడవి నిండా ఆవిర్లు పొగలు కక్కుతున్నాయి. తండాలో కూలి పనులు ఆగిపోయాయి. అంతకుముందు వేసవి వస్తే తండా మనుషులకు భయం ఉండేది కాదు. తెల్లవారుజామునే బుట్టలు పట్టుకుని అడవిలోకి వెళ్తే ఇప్పపూలు, తునికాకు, మద్ది చెట్ల జిగురు, మొర్రి పండ్లు దొరికేవి. వాటిని సంతలో అమ్ముకుంటే వర్షాకాలం వచ్చేవరకు గంజికి లోటు ఉండేది కాదు.

ఇప్పుడు కంచె అవతల చేతికి అందే దూరంలో విప్ప చెట్ల కింద పసుపు పచ్చని ఇప్పపూలు తివాచీ పరిచినట్టు రాలి పడి ఉన్నాయి. ఎండకు అవి ఎండిపోయి, వాటి తియ్యటి వాసన గాలికి తండా దాకా వస్తోంది.

ఒకరోజు ఉదయం తండాలోని ఇద్దరు ముసలాడవాళ్లు కంచె దగ్గర నిలబడి, లోపల మట్టిలో కలిసిపోతున్న ఆ పూలను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

“అయ్యో… బంగారం లాంటి పువ్వు ఎండకు మాడి మట్టిలో కలిసిపోతందే. మమ్మల్ని రానియ్యకపోతే పోయిర్రు, కనీసం అడవిలో ఎలుగుబంట్లన్నా వచ్చి ఆ పూలు తింటున్నాయో లేదో… అడవి తల్లి రొమ్ముల్లో పాలు గడ్డకట్టుకుపోయినట్టు అయిందే” అని వాళ్లు మాట్లాడుకుంటుంటే, కంచె లోపల గస్తీ తిరుగుతున్న బిక్కు తల దించుకుని పక్కకు వెళ్లిపోయాడు.

ఆ మరుసటి రోజే చెక్‌పోస్ట్ దగ్గర రేంజర్ ప్రతాప్ ఫైలు ముందేసుకుని కూర్చున్నాడు.

“బిక్కూ… పైనుంచి ఆడిట్ జరుగుతోంది. పక్క బీట్ గార్డు ఈ నెలలో ఎనిమిది కేసులు రాశాడు. నీ బీట్‌లో ఒక్క కేసు కూడా లేదు. నీ జీపీఎస్ ట్రాక్ చూస్తే రోజూ తండా వైపు కంచె దగ్గరే ఎక్కువసేపు ఆగుతున్నట్టు చూపిస్తోంది. తండా వాళ్లని చూసీ చూడనట్టు వదిలేస్తున్నావని డి.ఎఫ్.ఓ గారికి అనుమానం వచ్చింది. ఈ వారం లోపు నీ బీట్‌లో కనీసం రెండు కేసులు నమోదు కాకపోతే నిన్ను సస్పెండ్ చేస్తూ ఆర్డర్ టైప్ చేయాల్సి వస్తుంది. నీ వెనుక ముసలి తల్లి ఉంది, ఆలోచించుకో” అన్నాడు ప్రతాప్ తన అలవాటైన చల్లని గొంతుతో.

ఆ మధ్యాహ్నం అడవి లోపల నడుస్తున్న బిక్కుకి దూరంగా ‘టంగు… టంగు…’ మని గొడ్డలి చప్పుడు వినిపించింది.

ఆ చప్పుడు వినగానే బిక్కు గుండె దడదడలాడింది. వాడు అడుగులో అడుగు వేసుకుంటూ శబ్దం వస్తున్న వైపు నడిచాడు. అక్కడ ఒక ఎండిపోయిన నల్లమద్ది చెట్టు కింద ధర్మా ఉన్నాడు. వచ్చే నెలలో ధర్మా చెల్లెలు సాలి పెళ్లి ఉంది. వంట చెరకు కోసం ఎండిపోయిన చెట్టు కొమ్మలను నరుకుతున్నాడు.

బిక్కు చెట్టు చాటు నుంచి బయటకు వచ్చాడు. “ధర్మా!” అని పిలిచాడు.

ధర్మా ఉలిక్కిపడి వెనుదిరిగి చూశాడు. ఎదురుగా ఉన్నది బిక్కే అని తెలియగానే వాడి మొహంలో చిన్న నవ్వు వచ్చింది.

“అరె బిక్కూ… నువ్వా! ఒక నిమిషంలో నా గుండె ఆగినంత పనైందిరా. ఆ పెద్ద సారు గానీ వచ్చిండేమో అనుకున్నా. రా రా… ఈ ఎండు మొద్దు ఒక్కటి పట్టు, ఇద్దరం కలిసి మోసుకపోదాం. సాలి పెళ్లికి వంట కట్టెలు లేక యాడి ఏడుస్తోంది” అన్నాడు ధర్మా గొడ్డలిని కింద పెడుతూ.

బిక్కు కదలలేదు. “గొడ్డలి అక్కడ పెట్టు ధర్మా. కంచె దాటి లోపలికి రావొద్దని సర్కారోళ్లు గట్టిగా చెప్పిర్రు కదరా… చెట్టు కొడితే బొక్కలో వేస్తరు. ఆ పెద్ద సారు కళ్లల్లో కారం కొట్టుకుని సూస్తున్నడు. నిన్ను వదిలేస్తే నా ఒంటి మీద ఈ గుడ్డ ఊడదీస్తరు రా… నా మాట విను, ఆ గొడ్డలి నాకిచ్చేయ్, ఎవరో గుర్తుతెలియని మనిషి పారేసి పారిపోయిండని కేసు రాసుకుంటా” అన్నాడు బిక్కు వణుకుతున్న గొంతుతో.

ధర్మా మొహంలో నవ్వు మాయమైంది. వాడు బిక్కుని పైనుంచి కిందికి చూశాడు.

“ఇది మా తాత చేతి గొడ్డలి రా బిక్కూ. మా ఇంట్లో బువ్వ పెట్టే గొడ్డలి. దీన్ని దొంగ సొత్తు లెక్క నీ సారు కాళ్ల దగ్గర పెడతావా?” అన్నాడు ధర్మా.

బిక్కు ఏదో చెప్పబోతూ ముందుకు అడుగు వేశాడు. వాడి చేతిలో ఉన్న లాఠీ ముందుకు కదిలింది.

ధర్మా అడుగు వెనక్కి వేసి, తన ఎడమ భుజం మీద ఉన్న పాత గాయం మచ్చ మీద చెయ్యి వేసుకున్నాడు.

“ఎలుగుబంటి మీ బాపును పట్టుకున్నప్పుడు, నిన్ను చెట్టు ఎక్కించబోయి నా భుజం చీరుకుపోయింది సూడు… ఆ రక్తం ఇంకా ఎండిపోలేదురా బిక్కూ. అప్పుడే నన్ను ఆ ఎలుగుబంటికి వదిలేయాల్సింది, ఇయ్యాల నీ చేతిలో దొంగనయ్యే బాధ తప్పేది” అన్నాడు ధర్మా. వాడి గొంతు బొంగురుపోయింది.

“ధర్మా… అట్లా అనకురా…”

“మరి ఎట్లా అనాలె రా? కుక్కకు తోలు బెల్టు కడితే సింహం అయిపోతదా రా బిక్కూ? తోడేలు వచ్చి మందను పట్టుకపోతుంటే, మన కుక్కే మన గొర్రెలను కరుస్తదా? పచ్చని చెట్టుకు ఉన్న ఆకు రాలి ఎండిపోతే దాన్ని తొక్కేస్తారు. కానీ నువ్వు చెట్టుకు ఉంటూనే రంగు మార్చుకున్న ‘ఖాకీ ఆకు’వి రా! అడవికి కాకుండా పోయినావ్, మనుషులకు కాకుండా పోయినావ్!”

ధర్మా తన చేతిలో ఉన్న గొడ్డలిని బిక్కు కాళ్ల ముందే విసిరికొట్టాడు. “తీసుకపో! కానీ ఇయ్యాలటి నుంచీ నువ్వు నాకు చచ్చిపోయినావ్ రా!” అని ధర్మా కంచె వైపు నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

ఆ సాయంత్రం చెక్‌పోస్ట్ స్టోర్ రూమ్‌లో ఆ గొడ్డలికి ఒక తెల్లటి కాగితం చీటీ కడుతున్నప్పుడు బిక్కు చేతులు వణికాయి. స్టోర్ రూమ్ ఇనుప బీరువాలో ఆ గొడ్డలిని పెడుతున్నప్పుడు, అక్కడ అంతకుముందే సీజ్ చేసి పడేసిన పదుల కొద్దీ పాత గొడ్డళ్లు, కొడవళ్లు తుప్పు పట్టి కనిపించాయి. అవి పనిముట్లు కావు.. తండా మనుషుల తెగిపడిన చేతులు! ధర్మా గొడ్డలి కర్ర పిడి మీద వాడి తండ్రి చెక్కిన చిన్న నెమలి కన్ను గుర్తు, ఆ చీకటి గదిలో నుంచి బిక్కుని గుచ్చి గుచ్చి చూస్తున్నట్టు అనిపించింది. బిక్కు గబగబా తలుపు వేసి తాళం బిగించాడు.

ఆ రాత్రి బిక్కు తండాలోకి అడుగుపెట్టినప్పుడు తండా మొత్తం చీకట్లో నోరు కుట్టుకున్నట్టుగా ముడుచుకుపోయింది. వాడు గల్లీలో నడుస్తుంటే అరుగుల మీద కూర్చున్న వాళ్లు లేచి లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఇంట్లో యాడి పొయ్యి దగ్గర కూర్చుని ఉంది. పొయ్యిలో మంట లేదు, చల్లారిన బూడిద మాత్రమే ఉంది.

“యాడీ… బువ్వ పెట్టవా?” అని అడిగాడు బిక్కు.

సక్రిబాయి కొడుకు వైపు తిరిగి చూడలేదు. “పొయ్యిలో పెట్టనీకి పుల్ల లేదు బిక్కూ. అడవికి తాళం వేసినావ్ కదా… ఆ తాళం చెవి ఉడకబెట్టి తిను పో” అంది నిర్జీవమైన గొంతుతో.

వచ్చే వారం బిక్కుకి మొదటి నెల జీతం బ్యాంకులో పడింది. మండల కేంద్రానికి వెళ్లి ఏటీఎం నుంచి కరకరలాడే కొత్త నోట్లు డ్రా చేసుకున్నాడు. ఆ డబ్బుతో తండా పడిన బాధను తుడిచేయాలనుకున్నాడు. సంతకు వెళ్లి యాడి కోసం అద్దాలు కుట్టిన కొత్త ఎర్రటి ‘ఛాంటియా’, తండా పిల్లల కోసం రెండు కిలోల బెల్లం కొనుక్కొని సాయంత్రం తండాకు వచ్చాడు.

వేపచెట్టు కింద ఆడుకుంటున్న పిల్లల్ని పిలిచి బెల్లం ముక్కలు ఇవ్వబోయాడు. పిల్లలు ఆశగా దగ్గరికి రాబోతుంటే, ఇళ్లలోంచి తల్లులు బయటకు వచ్చి..”ఏయ్! ఆడి చేతి గోళ్ (బెల్లం) ముట్టుకోకండి, రండి లోపలికి!” అని పిల్లల్ని లాక్కెళ్లి తలుపులు వేసుకున్నారు.

వేపచెట్టు కింద బిక్కు ఒక్కడే నిలబడిపోయాడు. వాడి చేతిలోని బెల్లం పొట్లం చెమటకు తడిసి మెత్తబడింది. వాడు ఆ బెల్లం పొట్లాన్ని అక్కడే ఉన్న సేవాలాల్ జెండా గద్దె మీద పెట్టి ఇంటికి నడిచాడు. కాసేపటికి అక్కడికి వచ్చిన తండా కుక్కలు కూడా ఆ బెల్లాన్ని వాసన చూసి వదిలేశాయేమో అన్నంత నిశ్శబ్దం తండాను కమ్మేసింది.

ఇంటికి వెళ్లి యాడి ముందు ఆ కొత్త ‘ఛాంటియా’ పెట్టాడు. “యాడీ… నీ పాత గుడ్డ చిరిగిపోయింది కదా, నీ కోసమే తెచ్చినా” అన్నాడు.

సక్రిబాయి ఆ కొత్త గుడ్డను కనీసం చేత్తో కూడా తాకలేదు. “ధర్మా ఇంటి గొడ్డలిని సర్కారుకి పట్టించి తెచ్చిన పైసలివి. ఆ పైసలతో తెచ్చిన బట్ట నా ఒంటికి ముల్లు లెక్క గుచ్చుకుంటది. నాకు నా పాత పేలికలే సాలు” అని లేచి బయటకు వెళ్లిపోయింది. బిక్కు ఆ కొత్త బట్టను పట్టుకుని చీకటి గదిలో ఒంటరిగా మిగిలిపోయాడు.

4

ఆషాఢ మాసం వచ్చింది. నల్లమల కొండల మీద ఆకాశం చిల్లులు పడినట్టుగా మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు పట్టుకుంది. ఎండకు పగిలిన నల్లరేగడి నేలంతా నానిపోయి, అడుగు తీసి అడుగు వేస్తే మోకాలి దాకా దిగబడే జిగురు బురదగా మారింది. అడవిలోని వాగులన్నీ ఎర్రటి మట్టి నీళ్లతో నురగలు కక్కుతూ, రాళ్లను దొర్లించుకుంటూ తండా వైపు ఉరకలు వేస్తున్నాయి.

ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకే అడవి అంతా చీకటి పడిపోయింది. తండాకు, మండల కేంద్రానికి మధ్య ఉన్న పెద్ద వాగు పొంగి ప్రవహిస్తోంది. కల్వర్టు మీద నుంచి ఆరడుగుల ఎత్తున బురద నీరు ప్రవహిస్తుండటంతో తండాకు బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయింది.

సరిగ్గా అప్పుడే ధర్మా ఇంట్లో నుంచి ఏడుపులు వినబడ్డాయి.

ధర్మా అక్క కూతురు, ఏడాది వయసున్న పసిబిడ్డకు ఉదయం నుంచి తీవ్రమైన జ్వరం. సాయంత్రం అయ్యేసరికి అది ‘పాతాళ జ్వరం’గా మారి పసిదానికి సొమ్మసిల్లడం (ఫిట్స్) మొదలైంది. బిడ్డ కళ్లు తేలేస్తోంది, పసి శరీరం విల్లులా వంగిపోతోంది. వాగు దాటి ఆసుపత్రికి తీసుకెళ్లే దారి లేదు.

తండా పెద్దలందరూ ధర్మా ఇంటి ముందు గొడుగులు, గంపలు పట్టుకుని గుమిగూడారు. సక్రిబాయి కూడా అక్కడికి వెళ్లింది. సక్రిబాయి పసిబిడ్డ కనురెప్పలు విప్పి చూసింది. బిడ్డ అరికాళ్లు, అరచేతులు మంచుగడ్డల్లా చల్లబడిపోయి ఉన్నాయి, కానీ మాడు మాత్రం కుంపటిలా కాలిపోతోంది. ఆమె వేళ్ల కొనలకు అడవి నాడి తెలుసు. ఏ చెట్టు బెరడు గీకితే కత్తి గాయం మానుతుందో, ఏ ఆకు పసరు పిండితే కట్లపాము విషం విరుగుతుందో ఆమెకు కంఠతా. పసిదాని నాడి చూస్తూనే సక్రిబాయి ముఖం పాలిపోయింది.

“ఇది పాతాళ జ్వరం… తెల్లారేదాకా ఆగితే పిల్ల దక్కదు. ఇప్పుడే దేవర లోయలోకి పోయి ‘పాతాళగరిడి వేరు’ తవ్వి తెచ్చి, ఆ గడ్డ నూరి రెండు చుక్కల పసరు నాలుక మీద రాయాలె. అప్పుడే బిడ్డ ఊపిరి నిలుస్తది” అంది.

అక్కడున్న వాళ్లందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆ అడవి గరిడి గడ్డ అడవి లోపల మూడు మైళ్ల దూరంలో ఉన్న ‘దేవర లోయ’లోని నల్లరాతి బండల కింద మాత్రమే దొరుకుతుంది. పైగా ఈరోజు జిల్లా అటవీ అధికారి (డి.ఎఫ్.ఓ) తనిఖీ కోసం వచ్చి చెక్‌పోస్ట్ గెస్ట్‌హౌస్‌లో బస చేశాడని తండా అందరికీ తెలుసు.

ధర్మా తన చేతుల్లో విలవిలలాడుతున్న పసిబిడ్డను చూసి భోరున ఏడ్చాడు. “బిడ్డ చచ్చిపోతది నాయకా… నేను పోయి ఆ వేరు తెస్తా!” అని లేవబోయాడు.

“ఆగు ధర్మా!” అంది సక్రిబాయి. “నువ్వు పోతే నా కొడుకు నిన్ను మళ్లీ పట్టుకుంటాడు. మీ ఇద్దరి మధ్య రక్తం కారుతది. ఆ పాపం నా కడుపున పడ్డందుకే నాకు తగిలింది. ఆ పాతాళగరిడి వేరు ఏ బండ కింద ఉంటదో నాకు మాత్రమే తెలుసు. నేను పోతా. నా కొడుకు కట్టిన కంచె నన్నెట్లా ఆపుతదో నేనూ సూస్తా!”

సక్రిబాయి ఇంటికి వెళ్లి చిన్న ఇనుప గిడ్డె (దుంపలు తవ్వే కర్ర), వెదురు గంప తీసుకుని, తల మీద పాత ‘ఛాంటియా’ గట్టిగా చుట్టుకుని కురుస్తున్న వర్షంలోనే అడవి వైపు నడిచింది.

అదే సమయంలో బిక్కు చెక్‌పోస్ట్ దగ్గర ఉన్నాడు. డి.ఎఫ్.ఓ గారు గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. రేంజర్ ప్రతాప్ బిక్కుని పిలిచి..”బిక్కూ, వర్షం పెద్దగా ఉంది. సార్ రేపు ఉదయం అడవిలోకి రౌండ్స్‌కి వస్తారు. ఈ రాత్రికి నువ్వు కంచె వెంబడి గస్తీ తిరుగు. నీ జీపీఎస్ ఆన్‌లో ఉంచు” అని చెప్పి గొడుగు తీసుకుని తన క్వార్టర్‌కు వెళ్లిపోయాడు.

రాత్రి ఎనిమిది గంటలు దాటింది. కుండపోత వర్షం. ఉరుములు అడవి గుండె పగిలేలా శబ్దం చేస్తున్నాయి. బిక్కు తడిసిన ఖాకీ యూనిఫామ్ మీద, చేతిలో లాఠీ, ఐదు సెల్ల టార్చిలైట్ పట్టుకుని, నడుముకు జీపీఎస్ మిషన్‌తో కందకం లోపలి గట్టు మీద బురదలో నడుస్తున్నాడు.

కందకం నిండా బురద నీరు ప్రవహిస్తోంది. బిక్కు టార్చిలైట్ వెలుగును ముళ్ల కంచె మీద వేస్తూ నడుస్తుండగా, దేవర లోయకు వెళ్లే మలుపు దగ్గర వాడి అడుగులు ఆగిపోయాయి.

అక్కడ కందకం గట్టు మట్టి జారిపోయి ఉంది. కంచె కింది ముళ్ల తీగకు ఒక చిన్న ఎర్రటి గుడ్డ ముక్క చిక్కుకుని, గాలికి వర్షంలో రెపరెపలాడుతోంది. ఆ గుడ్డ ముక్క అంచున ఒక చిన్న పగిలిన అద్దం మెరిసింది!

బిక్కు ఆ గుడ్డ ముక్కను చేతిలోకి తీసుకున్నాడు. ఆ ఎర్రటి నూలు దారం, ఆ అద్దం కుట్టు… అది తన యాడి ‘ఛాంటియా’ చెంగు!

బిక్కు టార్చిలైట్ వెలుగును కింద ఉన్న బురద మీద వేశాడు. అక్కడ జారిపోయిన మట్టిలో ఐదు వేళ్ల కాలి గుర్తు కనిపించింది. ఆ కాలి బొటనవేలు కొంచెం ఎడంగా, వంకరగా ఉన్న గుర్తు… చిన్నప్పుడు అడవిలో రాయి పడి చితికిపోయిన తన యాడి ఎడమ కాలి బొటనవేలు గుర్తు అది!

అడవిలో జంతువుల అడుగుజాడలను గుర్తుపట్టే శిక్షణ తీసుకున్న బిక్కుకి, బురదలో తన కన్నతల్లి పాదముద్రను చూడగానే గుండె ఒక్క క్షణం గొంతులోకి వచ్చి అడ్డం పడ్డట్టయింది.

“యాడీ…” అని బిక్కు గొంతులోంచి ఆర్తనాదం బయటకు వచ్చింది. ఈ అర్ధరాత్రి, ఈ కుండపోత వర్షంలో ముసలి తల్లి కందకం ఈదుకుని అడవిలోకి ఎందుకు వచ్చిందో వాడికి అర్థమైంది. తండాలో ఎవరికో ప్రాణం మీదకు వచ్చింది! వాడు వెనుతిరిగి చెక్‌పోస్ట్ వైపు చూడలేదు. ముళ్ల పొదలు ఒంటిని గీరుతున్నా చూసుకోకుండా, దారి తప్పిన లేగదూడలా దేవర లోయ వైపు ఉరికాడు.

5

దేవర లోయలో చీకటి గడ్డకట్టుకుపోయి ఉంది. ఆకుల మీద పడుతున్న వాన చినుకుల హోరు తప్ప మరో శబ్దం లేదు.

బిక్కు టార్చిలైట్ వెలుగు వర్షపు ధారలను చీల్చుకుంటూ నల్లరాతి బండల మీద పడింది. అక్కడ ఒక బండ రాయి కింద సక్రిబాయి మోకాళ్ల మీద కూర్చుని ఉంది. ఆమె ఒంటి మీద ఉన్న బట్టలు పూర్తిగా తడిసిపోయి, వృద్ధాప్యంతో వంగిపోయిన ఆమె శరీరానికి అతుక్కుపోయాయి. తెల్లబడిన జుట్టు ముఖం మీద పడింది. చేతిలో ఉన్న ఇనుప గిడ్డెతో రాళ్ల మధ్య ఉన్న బంకమట్టిని తవ్వుతోంది. రాళ్ల దెబ్బకు ఆమె మణికట్టుకు ఉన్న తెల్లటి ‘బలియా’ (గాజు) ఒకటి పగిలిపోయి బురదలో పడి ఉంది. రాళ్ల రాపిడికి ఆమె ముడతలు పడిన వేళ్ల నుంచి రక్తం కారి వర్షపు నీటిలో కలిసిపోతోంది.

“యాడీ!” అంటూ బిక్కు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమె పక్కన మోకాళ్ల మీద కూలబడ్డాడు.

టార్చిలైట్ వెలుగుకు సక్రిబాయి తల తిప్పి చూసింది. ఎదురుగా ఖాకీ డ్రెస్సులో ఉన్న కొడుకు.

ఆ అడవిలో, ఆ చీకట్లో వాళ్లిద్దరే ఉన్నారు. పక్కన రేంజర్ ప్రతాప్ లేడు, చట్టం పుస్తకాలు లేవు. కేవలం ఒక తల్లి, ఒక కొడుకు.

సక్రిబాయి కళ్లలో భయం లేదు. ఆమె తన చేతిలోని గిడ్డెను ఆపకుండా మట్టిని తవ్వుతూనే ఉంది.

“ధర్మా ఇంటి పసిదానికి పాతాళ జ్వరం వచ్చింది బిక్కూ. ఊపిరి పోతోంది. ఈ పాతాళగరిడి వేరు నూరి పోయకపోతే తెల్లారేసరికి పిల్ల బతకదు” అంది సక్రిబాయి రొప్పుతూ.

మట్టి లోపల బండరాయి అడ్డు తగలడంతో ఆమె చేతులు వణుకుతున్నాయి. ఎంత తవ్వినా వేరు బయటకు రావడం లేదు. ఆమె వేళ్ల నుంచి రక్తం మరింతగా కారుతోంది.

సక్రిబాయి కొడుకు వైపు చూసింది. “నువ్వు సర్కారు గార్డువు కదా… నన్ను పట్టుకుంటావా? పట్టుకో. నీ సారు దగ్గరికి తీసుకపోయి బొక్కలో వేయించు. కానీ ముందు ఈ వేరు తవ్వి ఆ పసిదాని నోట్లో రెండు చుక్కలు పోశాక నన్ను ఏమన్నా చేసుకో రా…” అంది.

ఆ మాట వింటుంటే బిక్కు గుండెల్లో ఏదో బండరాయి పగిలిపోయినట్టు అయింది.

చిన్నప్పుడు ఇదే చేతులు ఇదే అడవిలో దుంపలు తవ్వి తన ఆకలి తీర్చాయి. ఇదే చేతులు తనను చదివించడానికి రాళ్లు కొట్టాయి. ఈరోజు తన ఒంటి మీద ఉన్న ఈ ఖాకీ గుడ్డ, ఒక పసిబిడ్డ ప్రాణం కాపాడటానికి వచ్చిన తన కన్నతల్లిని దొంగలాగా, నేరస్తురాలిగా మార్చేసింది.

బిక్కు కళ్లలోంచి కన్నీళ్లు కారి వర్షపు నీటిలో కలిసిపోయాయి. వాడు టార్చిలైట్ పక్కన ఉన్న రాతి మీద పెట్టాడు.

“జరుగు యాడీ…” అన్నాడు బిక్కు, తల్లి రక్తం కారుతున్న చేతులను మెల్లగా పక్కకు జరుపుతూ.

వాడు తన కుడి చేతిలో ఉన్న ప్రభుత్వ లాఠీని తీసుకున్నాడు. అంతవరకూ మనుషులను బెదిరించడానికి, అడవికి కాపలా కాయడానికి వాడిన ఆ గట్టి వెదురు లాఠీ మొనను..బండరాయి కింద ఉన్న బురద మట్టిలోకి బలంగా దించాడు.

తన శక్తినంతా కూడదీసుకుని ఆ లాఠీని గడ్డపారలాగా వాడి అడ్డుగా ఉన్న రాయిని పైకి పెళ్లగించాడు. బండరాయి కదిలి పక్కకు దొర్లిపోయింది..కానీ ఆ రాయి బరువుకు బిక్కు చేతిలోని ప్రభుత్వ లాఠీ మధ్యలోకి ‘ఫెళు’మని చీలి విరిగిపోయింది!

బిక్కు ఆ విరిగిన లాఠీ ముక్కను అక్కడే బురదలో పడేశాడు. లోపల తెల్లటి వేర్లతో ఉన్న పాతాళగరిడి గడ్డ బయటపడింది. బిక్కు తన రెండు చేతులతో ఆ బురద మట్టిని తవ్వి, వేర్లు తెగిపోకుండా ఆ మందు గడ్డలను బయటకు తీసి తల్లి వెదురు గంపలో వేశాడు.

సక్రిబాయి అచేతనంగా కొడుకునే చూస్తోంది.

“లే యాడీ… వాన ఎక్కువైతంది, పోదాం” అంటూ బిక్కు తల్లిని లేపాడు.

ఇద్దరూ కలిసి కంచె దగ్గరకు వచ్చేసరికి కందకంలో నీటి ప్రవాహం మరింత పెరిగింది. ఆరడుగుల వెడల్పున్న ఆ కందకంలో బురద నీరు సుడులు తిరుగుతూ పారుతోంది. ముసలి తల్లి ఆ ప్రవాహాన్ని దాటలేదు. పైగా గంపలో ఉన్న మందు వేర్ల మీద వర్షం పడితే వాటికి ఉన్న పచ్చి మట్టి కరిగిపోయి మందు పసరు తగ్గిపోతుంది.

బిక్కు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.

వాడు తన ఒంటి మీద తడిసిపోయి ఉన్న ఖాకీ చొక్కా గుండీలను ఒక్కొక్కటిగా విప్పాడు. భుజాల మీద ఇత్తడి అక్షరాలున్న ఆ చొక్కాను ఒంటి నుంచి లాగి తీశాడు.

ఇప్పుడు బిక్కు అర్ధనగ్నంగా ఉన్నాడు. వర్షపు చినుకులు వాడి నల్లటి శరీరం మీద నేరుగా పడుతున్నాయి.

బిక్కు ఆ ఖాకీ చొక్కాను మడిచి, వెదురు గంపలో ఉన్న పాతాళగరిడి వేర్లు తడిసిపోకుండా ఆ గంప మీద మూతలాగా గట్టిగా కట్టాడు. తర్వాత తన కాలి బూట్లను కూడా విప్పి కందకం గట్టు మీదే వదిలేశాడు. ఒట్టి కాళ్లను చల్లటి అడవి బురదలో మోపాడు. ఎన్నో నెలల తర్వాత అడవి మట్టి వాడి పాదాలకు నేరుగా తగలగానే, తల్లి ఒడిలోకి చేరిన పసివాడిలా వాడి ఒళ్లంతా పులకరించింది.

“ఎక్కు యాడీ…” అంటూ బిక్కు తల్లి ముందు వంగాడు.

సక్రిబాయి ఒక చేత్తో వేర్ల గంపను పట్టుకుని, కొడుకు వీపు మీద ఎక్కి అతని మెడ చుట్టూ చేతులు వేసింది. చిన్నప్పుడు తన వీపు మీద కట్టుకుని పెంచిన కొడుకు, ఈరోజు తనను వీపు మీద మోస్తుంటే ఆ తల్లి గుండె నిండిపోయింది. ఆమె కళ్లలో ఊరిన వేడి నీరు, నింగి నుంచి పడుతున్న చల్లటి వాన చినుకుల్లో కలిసిపోయి బిక్కు నగ్నమైన భుజాల మీద పడింది.

బిక్కు తల్లిని వీపు మీద మోసుకుంటూ బురద నీటితో నిండిన కందకంలోకి దిగాడు. నీళ్లు వాడి గుండెల దాకా వచ్చాయి. అడుగున ఉన్న చెట్ల వేర్లను కాలి వేళ్లతో తడుముకుంటూ, ప్రవాహానికి ఎదురు నిలిచి కందకం దాటి అవతలి గట్టు మీదకు తల్లిని చేర్చాడు. కంచె కింద నుంచి ఆమెను బయటకు దాటించాడు.

దూరంగా తండాలో ధర్మా ఇంటి దగ్గర గుడ్డి దీపం వెలుగు కనిపిస్తోంది.

“నువ్వు పోయి పసిదానికి మందు పోయి యాడీ… ధర్మాతో చెప్పు, బిడ్డ బతుకుతదని” అన్నాడు బిక్కు.

“మరి నువ్వు రావా చోరా? తెల్లారితే ఆ సార్లు నిన్ను ఏం చేస్తరో…” అంది సక్రిబాయి ఆందోళనగా.

బిక్కు చిన్నగా నవ్వి, తల్లి తల మీద ఉన్న తడిసిన ‘ఛాంటియా’ కొంగుతో తన ముఖం తుడుచుకున్నాడు. తన నడుముకు ఉన్న తోలు బెల్టును, దానికి మెరుస్తున్న ఎర్రటి జీపీఎస్ మిషన్‌ను విప్పి చేతిలోకి తీసుకున్నాడు.

“నాకేం కాదు యాడీ. ఆ చెక్‌పోస్ట్ తాళం చెవి, ఈ సర్కారు మిషన్ సారు బల్ల మీద పెట్టి, నా పాత గొంగడి భుజాన వేసుకుని తెల్లారేసరికి తండాకు వస్తా. పొయ్యి రాజేసి ఉంచు యాడీ… ఇద్దరం కలిసి వేడిగా గట్కా తాగుదాం. నువ్వు నడువ్” అన్నాడు బిక్కు.

సక్రిబాయి గంపను చంకన పెట్టుకుని తండా వైపు వేగంగా నడిచింది. ఆ గంప మీద కప్పిన ఖాకీ చొక్కా చీకట్లో కలిసిపోయింది.

బిక్కు వెనుదిరిగి కంచె వైపు చూశాడు. ఒంటి మీద ఖాకీ బట్ట లేదు, కాళ్లకు బూట్లు లేవు. కానీ వాడి గుండె మీద ఉన్న బరువు పూర్తిగా దిగిపోయింది. తూర్పున ఆకాశం మెల్లగా తెల్లబడుతోంది. ఒట్టి కాళ్లతో బురద మట్టిలో చెక్‌పోస్ట్ వైపు నడుస్తున్న బిక్కు అడుగులు మాత్రం, అప్పుడే రెక్కలు విప్పుకున్న అడవి పక్షిలా తేలికగా ఉన్నాయి.

Tags: adivasi short storybhukya gopi nayakkhaki akuఆదివాసీ కథఖాకీ ఆకుభూక్యా గోపి నాయక్
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

20.9.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు సజీవ దర్పణాలు

27.9.26 కథానిధి సమీక్ష: కలల శిథిలాల మీద చిగురించిన ఆశల వృక్షం

4.10.26 కథానిధి సమీక్ష: కాలపు కదలికలకు అక్షర దర్పణాలు

11.10.26 కథానిధి సమీక్ష: మానవీయ విలువలకు నిలువెత్తు నిదర్శనాలు

13.9.26 కథానిధి సమీక్ష: మానవ సంబంధాలు అక్షరబద్ధం

భూక్యా గోపి నాయక్ కథ : ఖాకీ ఆకు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply