శబరి అనే ఆ పిల్లాడి భయం కళ్ళల్లో కనిపిస్తే, మనం కూడా భయపడతాం, వాడు ఏడిస్తే, మనకి కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి. డబ్భై, ఎనభై దశకం పాత రోజుల్లో పిల్లలు పిల్లల్లా ఉండేవాళ్ళు. పసితనం, అమాయకత్వం, చిన్న చిన్న సంతోషాలు కలగలిపిన పసితనపు ఛాయలు వాళ్ళల్లో కనిపించేవు. అదే ఆలోచనతో దర్శకుడు బాలాజీ తరణి ధరన్ కథానేపథ్యంగా ఎనభైవ దశకం తీసుకున్నాడు. కథ జీవితాలకు దగ్గరగా ఉంటుంది. నేల విడిచి సాము చేయని కథ. మానవ సంబంధాలు, పల్లెటూరి జీవితాల మధ్య నడిచిన కథ.

హీరో అంటే జీవితాలకు దూరంగా ఉండే వాడు కాదు. వాడు జీవితంలో ఒకడే . అదే మనం రాసే కథల్లో చూపించాలి. ఎక్కడి నుండో ఊడి పడడు. వాడికి రాగద్వేషాలు ఉంటాయి. కోపం, పగ, అన్నీ ఉంటాయి. మంచితనం గుండెలోతుల్లోకి ఇంకి పోయి ఉంటుంది, బత్తా అని పిలవబడే భక్తవత్సలం (విజయ సేతుపతి) కి. అతను తనకి ఎదురొచ్చే మనుషుల మీద దాడి చేస్తూ ఉంటాడు. అది చూసిన పిల్లాడి (శబరి) మనసులో భయం, మంచి వాడు కాదు అనే ముద్ర మనసులో పడిపోయింది. ఇంతలో వేరే సంఘటలో బత్తాని చిన్నగా శిక్షించే అవకాశం వస్తుంది శబరికి. అది కూడా భయం వలెనే. ఆ తర్వాత నడిపించిన కథ, సీన్స్, పిల్లల మనస్త్వత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే.
సినిమా మొదట్లో టైటిల్స్ వేసే సమయంలో కూడా బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు స్కూల్ బాత్రూం కట్టడం చూపిస్తాడు. అంటే దర్శకుడు ఎంతో సునిశితంగా ఆలోచించి ఈ కథ రాసుకున్నాడు అనిపిస్తుంది. పిల్లాడు అనాలోచితంగా వేసిన శిక్షను ఎనిమిది రోజులు బత్తా అనుభవించి బయటకు వస్తాడు. అది కూడా శబరి వలనే. ఆ తర్వాత `బత్తా` లో కరడు కట్టిన కోపం, గర్వం, వదరుబోతు తనం అన్నీ కరగడం మొదలు పెడతాయి. మనిషి మీద దాడి చేస్తే దాని వలన ఫ్యామిలీ కి కలిగే దుఃఖo గురించి ఆలోచిస్తే, ఆ తప్పు మనం చెయ్యకూడదు అని కరుణ శబరి తండ్రిలో చూసిన కన్సర్న్ బత్తాలో కూడా ఆలోచనలు లేపుతుంది. తన శత్రువులను సైతం ప్రేమిస్తాడు. అది అతనిలో ఒక పిల్లవాడు తీసుకువచ్చిన మార్పు. తర్వాత బత్తాకి శబరి తాను చేసిన పని చెప్పే సన్నివేశంలో శబరి నటనకి మన గుండె కరిగిపోతుంది.
ఎంత బాగా తీసాడురా దర్శకుడు. ఎంత బాగా నటించాడురా ఈ పిల్లాడు అనిపిస్తుంది మనకి. వాడి నటనను కళ్ళల్లో కనబడే అమాయకత్వంతో కూడిన భావాలతో రాబట్టాడు దర్శకుడు. అలాగే ఎంతో అద్భుతంగా హావభావాలతో, సున్నితంగా నటించిన విజయ సేతుపతి ని చూసి మన సో కాల్డ్ హీరోలు ఎంతైనా నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. ఇంక మిగిలిన పాత్రలు ఒక చక్కని పందిరికి అమరిన స్తంభాలు. విజయ్ సేతు పతి మహారాజు అనే సినిమాలో నటనతో ఒక స్థాయి నటుడిని అని చెప్పకనే చెప్పాడు.
అలాగే ఈ సినిమాలో అయితే మరింత గొప్పగా నటించాడు. అసలు అతను ఎంపిక చేసుకుంటున్న పాత్రలు చూస్తే అతని `నటనాకలి` ఇప్పుడప్పుడే తీరేది కాదనిపిస్తోంది. అది కావాలి కూడా ఒక నటుడికి. అంత ఫైర్ నేను కమల్ హసన్ లో చూసేవాడిని పాతరోజుల్లో. మమ్ముట్టి కూడా అంత గొప్ప నటుడు కూడా. మనకి ఇప్పుడు తెలుగులో ఎవరైనా ఉన్నారా?
అలాగే ఈ సినిమాలో బత్తా కి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక గురించి చెప్తున్నప్పుడు అతని మొహంలో కనిపించే హావభావాలు, ముఖ కవళికలు, అమాయకత్వం, మనల్ని నవ్వుల్లో ముంచెత్తుంది. . విజయ సేతుపతి is a versatile artist undoubtedly.
బత్తా స్కూల్ బాత్రూం కి ఎందుకు వెళ్ళాడా అనే అనుమానాన్ని ప్రేక్షకులకు కలగజేసి అది చివరివరకూ గుప్పెట దాచి చివరికి వదులుతాడు దర్శకుడు,.
ఒక చిన్న పాయింట్ తీసుకుని అల్లుకున్న ఈ బత్తా సినిమా జాతియ స్థాయి లో ఎన్నైనా అవార్డులు సాధించవచ్చు. మన గుండె తడిని మళ్ళీ పరిచయం చేసిన ఈ సినిమా చూసిన తర్వాత అసంకల్పితంగా.. మన చొక్కా అంచులతో కళ్ళు తుడుచుకుంటాం చిన్న పిల్లాడిలా( జేబులో కర్చీఫ్ ఉన్నాకూడా).
ఒక మంచి సినిమా చూసాను… ఆనంద భాష్పాలతో
.