ఒకవైపు కరోనా మహమ్మారి చిన్న, పెద్ద, పేద, ధనిక భేదాల్లేకుండా అందరినీ ఒకే రీతిగా కబళించి వేస్తున్న తరుణంలో అందరూ ఎంతో జాగ్రత్త పడుతున్నారు. కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాగోలా జీవితాలను నెట్టుకొస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలను వెలగబెడుతున్న పాపానికి కోరి కరోనా కోరలకు ఎర కావడం తప్పేలా లేదు. అందునా ముఖ్యంగా టీచర్లకు…
సర్కారుకు ఎలాంటి పని నిర్వహించాలన్నా ముందుగా గుర్తుకు వచ్చేది టీచర్లే. ఎలాంటి సర్వేలు నిర్వహించాలన్నా… జనాభా లెక్కలు సేకరించాలన్నా… ఎన్నికలు నిర్వహించాలన్నా… ఎలాంటి పని చేయాలన్నా… ఏ డేటా సేకరించాలన్నా సర్కారు వారికి ముందుగా గుర్తుకు వచ్చేది టీచర్ కమ్యూనిటీయే… తాజాగా ఆంధ్రప్రదేశ్ సర్కారు తీసుకున్న నిర్ణయం వల్ల టీచర్ల ప్రాణాలు గాలిలో దీపాలు కాబోతున్నాయా అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది.
ఆంధ్రప్రదేశ్ సర్కారు నవంబరు 2 నుండి ఉపాధ్యాయులు అందరూ పాఠశాలలకు తప్పక హాజరు కావాలని ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. పిల్లలు లేని పాఠశాలలకు ఉపాధ్యాయులు మాత్రం క్రమం తప్పకుండా రోజూ హాజరు కావాల్సి రావడం అనేది చిన్న విషయం కాదు. అందునా ప్రస్తుత పరిస్థితుల్లో అది ఇంకా చాలా కష్టమనే చెప్పాలి. ఏ ఉపాధ్యాయుడు కూడా పాఠశాలకు దగ్గరగా లేరన్న విషయం సర్కారు వారికి కూడా తెలిసిందే. పాఠశాలకు రావడం అంటే ఎంతో కొంత ప్రయాణం చేసి రాక తప్పదు. సొంత వాహనాలున్న ఉపాధ్యాయులు ఎలాగోలా తమ వాహనాల్లో పాఠశాలకు హాజరవుతున్నారు. అలాకాకుండా బస్సులు, ఇతర రవాణా సాధనాల ద్వారా ప్రయాణించి పాఠశాలకు చేరుకునే టీచర్లకు మాత్రం దినగండం నూరేళ్లాయుష్షుగా ఉందంటే అతిశయోక్తి కాదేమో.
ఎందుకంటే పాఠశాలకు వెళ్లే కార్యక్రమంలో భాగంగా చేసే ప్రయాణంలో మన పక్కనున్న వారికి ఎవరికి కరోనా ఉందో లేదో మనకు తెలియదు. దీంతో మనం సహజంగానే ప్రయాణం చేస్తుంటాం. కానీ మనకు తెలియకుండానే కరోనా భూతం మనల్ని అంటుకుని మనల్ని కబళించేస్తుంది. తాజాగా విద్యార్థులు లేని పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో గత రెండు రోజులుగా జరిపిన కరోనా పరీక్షల్లో ఇప్పటి వరకు దాదాపుగా 120 టీచర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. అలాగే ముగ్గురు విద్యార్థులకు కూడా కరోనా పాజిటివ్ తేలింది.
ఇదీ చదవండి పర్యాటకులకు స్వర్గధామం లాంటి చిన్నదీవి ఏంటో తెలుసా? నిర్లక్ష్యం పనికి రాదు ఏటీఎంలోకి పోకుండా నోట్ల కట్టలు హాంఫట్ అన్ని పనులూ వారికి చెప్తారు.. వారి గోడు మాత్రం వినరు!
చిత్తూరు జిల్లాలో మొదటి రోజు జరిపిన కోవిడ్ టెస్టుల్లో 57 మందికి, రెండవ రోజు జరిపిన పరీక్షల్లో 63 మంది టీచర్లకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ జరిగింది. ఈరోజు మూడవ రోజు కావడంతో ఈరోజు మరిన్ని పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి… పాఠశాలలకు హాజరైన ఉపాధ్యాయులకు విధిగా కరోనా పరీక్షలు జరపాలను ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఒకరకంగా మంచిదే… అయితే కొవిడ్ బారిన పడిన ఉపాధ్యాయులకు ఎవరు భరోసా ఇస్తారు…? అనేది ప్రశ్న.
ఒకవైపు ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతుండడంతో విద్యార్ధులను పాఠశాలలకు పంపడానికి తల్లిదండ్రులకు భయం వేస్తోంది. 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్ధులు తమ తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలకు రావచ్చునంటూ ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో పరిస్థితులు ఇలాంటి పరిణామాలకు దారితీస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో చేరడం అంటే ప్రభుత్వానికి వెట్టి చాకిరీ చేయడానికి మనల్ని మనమే వారి అధీనంలోకి వచ్చేశామా… అందుకే కనీస మానవత్వం అనేది కూడా లేకుండా… కేవలం నెల జీతం ఊరికే ఇస్తున్నామనే భావంతో సర్కారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది నిజంగా సర్కారుకు చెలగాటం… టీచర్లకు ప్రాణసంకటంగా మారుతోంది. ఒకవేళ కరోనా సోకి ఉపాధ్యాయులకు ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే సర్కారు దానికి జవాబుదారీగా ఉంటుందా…? ఇకనైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో సర్కారు మరోసారి పునరాలోచించుకుంటే మంచిదేమో…
.

Discussion about this post