వరద బాధితులకు తక్షణమే పునరావాస సహాయక చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అధికారులను కోరారు .
శుక్రవారం ఆయన విఆర్ కండ్రిగ వద్ద దెబ్బతిన్న వంతెనను పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడారు . గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు కాలనీలు వరద ముప్పునకు గురయ్యాయని అన్నారు .ఈ నేపథ్యంలో పలు ఇళ్లలోకి వరద నీరు వెళ్లడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీలలో పూరిపాక, గుడిసెల్లో నివసిస్తున్న ఇండ్లలోకి వర్షపు నీరు చేరడంతో అడుగుపెట్టలేని స్థితి వచ్చిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద బాధితులకు తక్షణ సహాయంగా వెయ్యి రూపాయలు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.
సత్యవేడు నియోజకవర్గంలో కూడా సంబంధిత తహసీల్దార్లు,ఎంపీడీవోలు వెంటనే తగు చర్యలు తీసుకుని వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవడానికి సహాయక చర్యలను చేపట్టాలన్నారు . ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనావేసి వీలైతే వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అవసరమైన ఆహారం, మంచి నీటిని అందించాలన్నారు.
దీంతోపాటు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ఎస్సీ ఎస్టీ వరద బాధితులకు ఉచితంగా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి పూర్తిచేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్థానిక ఎంపిపి ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి, జడ్పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి లను కోరారు.
విఆర్వో, పంచాయతీ సెక్రటరీల ద్వారా భారీ వర్షాలకు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లను, బాధితులను సర్వే చేసి గుర్తిస్తే వారందరికీ తక్షణ సహాయంగా 1000 రూపాయలను పంపిణీ చేస్తామన్నారు. బాధితులకు సహాయక పునరావాస చర్యలు చేపట్టడంలో ఎలాంటి అలసత్వం వద్దని ఆయన అధికారులను కోరారు.
తక్షణమే కార్యాచరణలోకి దిగాలని ఆయన నియోజకవర్గంలోని మండలాల స్థానిక ప్రజా ప్రతినిధులు అందరికీ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వ్యవసాయ మండల సలహా సలహా సంగం చైర్మన్ శ్యాం ప్రసాద్ రెడ్డి, వైయస్సార్ సిపి నేతలు వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
	    	
.
    	
		    
Discussion about this post