ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు గ్రహీతలైన పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PHFI) అధ్యక్షుడు డాక్టర్ కె.శ్రీనాథ్ రెడ్డి, శాంతా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డ్ వ్యవస్థాపకుడు, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కె ఐ వరప్రసాద్ రెడ్డి శనివారం శ్రీసిటీని సందర్శించారు.
శ్రీసిటీ చైర్మన్ శ్రీనిరాజు అతిధులకు సాదర స్వాగతం పలకగా, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వారికి శ్రీసిటీ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రగతి, ప్రత్యేకతలను వివరించారు. ఈ సందర్భంగా వారు శ్రీసిటీ గురించి పలు అంశాలను ఎంతో ఆసక్తితో అడిగి తెలుసుకున్నారు.
శ్రీసిటీ ప్రాజెక్ట్ అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన అతిథులు, శ్రీసిటీ బృందం పనితీరును అభినందించారు. వెనుకబడిన ప్రాంతాన్ని మోడల్ ఇండస్ట్రియల్ పార్కుగా తీర్చిదిద్దడంలో శ్రీసిటీ యాజమాన్య కృషిని ప్రశంసిస్తూ, స్థానికులకు ముఖ్యంగా మహిళలకు పుష్కలంగా ఉద్యోగాలు కల్పించేందుకు చూపుతున్న చొరవను డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి కొనియాడారు.
ప్రపంచ స్థాయి పారిశ్రామిక నగరాన్ని నిర్వహించడం అంత తేలికైన పని కాదని పేర్కొన్న డాక్టర్ వరప్రసాద్ రెడ్డి, శ్రీసిటీని దేశంలోనే అత్యంత అనువైన పెట్టుబడి గమ్యస్థానంగా మార్చినందుకు శ్రీనిరాజు, రవీంద్ర సన్నారెడ్డిని అభినందించారు.
శ్రీసిటీని సందర్శించినందుకు అతిథులకు కృతజ్ఞతలు తెలిపిన రవీంద్ర సన్నారెడ్డి, ఒకే జిల్లాకు (నెల్లూరు) చెందిన, ఒకే ఏడాదిలో పద్మభూషణ్ అవార్డులు స్వీకరించిన, వారివారి రంగాల్లో ప్రముఖులైన డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, డాక్టర్ వరప్రసాద్ రెడ్డిలు ఇక్కడకి రావడం తాము గౌరవప్రదంగా భావిస్తున్నామన్నారు. వారి పరిశీలనలు, అభిప్రాయాలు తమకు చాలా విలువైనవి అన్నారు.
డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గతంలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో కార్డియాలజీ విభాగానికి నేతృత్వం వహించారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో కార్డియోవాస్కులర్ హెల్త్ మొదటి బెర్నార్డ్ లోన్ విజిటింగ్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం హార్వర్డ్‌లో ఎపిడెమియాలజీకి అనుబంధ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. 2005 లో ఆయన పద్మభూషణ్ అవార్డు పొందారు.
సామాన్యులకు అందుబాటులో ఉండే సమర్థవంతమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేసే ఏకైక ఉద్దేశ్యంతో డాక్టర్ వరప్రసాద్ రెడ్డి 1993లో శాంతా బయోటెక్ ను స్థాపించారు. హెపటైటిస్-బికి వ్యతిరేకంగా పనిచేసే తక్కువ ధర వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో ఆయన చేసిన కృషికి, ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు పద్మభూషణ్ ఆయనకు లభించింది.
పర్యటనలో భాగంగా శ్రీనిరాజు, రవీంద్ర సన్నారెడ్డితో కలసి వీరు శ్రీసిటీ పరిసరాలను, పారిశ్రామిక కార్యకలాపాలను వీక్షించడంతో పాటు ఫాక్స్‌కాన్, హంటర్ డగ్లస్, రాక్‌వర్త్ పరిశ్రమలను సందర్శించారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.