‘వైద్యో నారాయణ హరిః’ అంటూ డాక్టరును దేవుడితో పోలుస్తారు! ఇది నూటికి నూరు పాళ్లు నిజం. డాక్టరు ఒక రకంగా దేవుడే! నమ్మకాల ప్రకారం దేవుడు మనకి ప్రాణం పోసేవాడు కావచ్చు గానీ.. మన ప్రాణం మీదికి వస్తే.. ఆ ప్రాణాల్ని నిలబెట్టే దేవుడు మాత్రం డాక్టరే. కానీ.. ఆ దేవుళ్లజాతిలో కొందరు పశువులు కూడా ఉంటారు. ప్రభుత్వ సర్వీసులో ఉంటూ.. డబ్బుకోసం రోగుల్ని పీక్కుతినేవాళ్లు. నెల్లూరు జిల్లా కావలి ఆస్పత్రిలో అలాంటి దారుణమే చోటుచేసుకుంది. చాలా హేయమైన ఘటన అది.
కావలి ఏరియా ఆస్పత్రికి ఓ గిరిజన మహిళ కాన్పుకోసం వచ్చింది. ఆ మహిళను ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు గెంటేశారు. కారణమేంటో తెలుసా.. సుబ్బారెడ్డి అనే డాక్టరు డిమాండ్ చేసినట్లుగా ఇవ్వడానికి ఆ పేద గర్భిణి వద్ద వెయ్యి రూపాయల డబ్బుల్లేవు. అందువల్ల ఆమెను బయటకు గెంటేశారు.
ఆపరేషన్ కు డబ్బులు అడిగారని, ఇవ్వలేకపోవడంతో గెంటేశారని బాధితురాలు వాపోతోంది. అనస్థీషియా డాక్టర్ సుబ్బారెడ్డి ఆపరేషన్ కి రూ 1000 లు డిమాండ్ చేసారని ఆమె చెబుతోంది. అయితే డాక్టరు సుబ్బారెడ్డి మాత్రం ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత కూడా.. తన చర్యల్ని సమర్థించుకుంటున్నారు. ఆక్సిజన్ సిలిండర్ కోసం డబ్బులు అడిగామని డాక్టర్ సుబ్బారెడ్డి చెబుతున్నాడు.
ప్రభుత్వానికి సిగ్గుచేటు
డాక్టరు మాత్రం ఏం చేస్తాడు.. హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్ లేకపోతే.. ఆయన జేబునుంచి పెట్టుకోలేడు కదా.. అని ఎవరైనా వాదించవచ్చు. ఒకవేళ డాక్టర్ చెబుతున్న మాట నిజమైతే.. అది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. అంబులెన్సులు కొంటున్నామని, మొబైల్ ఆస్పత్రులని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రజారోగ్యం మీద తమకు ఉన్న శ్రద్ధ అంతా ఇంతా కాదని అంటున్నారు. అయితే కావలి స్థాయిలోని ఏరియా ఆస్పత్రిలో కూడా ఆపరేషన్ సమయానికి అవసరమైన ఆక్సిజన్ సిలిండర్ కూడా లేదంటే.. అది ప్రభుత్వానికి సిగ్గు చేటు కాదా?
పేద గిరిజన మహిళ ప్రసవానికి వస్తే.. బయటకు గెంటేసిన ఆస్పత్రి తీరుకు సంబంధించి.. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి పరువునష్టం దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వం ఎందుకు సిగ్గుపడాలంటే..
వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే.. కావలి ఏరియా ఆస్పత్రి గేటుకు కూడా.. వైసీపీ పార్టీ రంగులు వేశారు. ఆస్పత్రికి వచ్చేవాళ్లంతా పార్టీకి రుణపడి ఉండాలని, అలా ఉండేలా గుర్తు చేయాలని అనుకున్నారేమో తెలియదు. రంగులైతే పార్టీవి వేసుకున్నారు గానీ.. ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ వంటి కనీస సదుపాయాలు కల్పించడం మాత్రం మర్చిపోయారు. డాక్టర్లు లంచగొండిలుగా మారకుండా చూడలేకపోతున్నారు. అందుకే ప్రభుత్వం సిగ్గుపడాలి.
.

Discussion about this post