ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు వెంటనే వేతన సవరణ జరిగేలా, ముఖ్యమంత్రి గారు తక్షణ చొరవ చూపాలని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి డిమాండ్ చేశారు
సోమవారం ఉదయం చిత్తూరులోని ఎస్టియు కార్యాలయంలో.. ఎస్ టి యు ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి మాట్లాడుతూ, పి ఆర్ సి కి సంబంధించిన అన్ని నివేదికలు, అన్ని స్థాయిలలో చర్చలు సంప్రదింపులు ముగిసినందున ఇక మిగిలింది ముఖ్యమంత్రి గారి నిర్ణయం అని అభిప్రాయపడ్డారు. పెరిగిన ధరలు జీవన ప్రమాణాలకు అనుగుణంగా 55% ఫిట్ మెంట్ తో పీఆర్సీ అమలు చేయాలని కోరారు.
పెండింగ్లో ఉన్న డి. ఎ లను విడుదల చేయాలని కోరారు. నూతన జాతీయ విద్యా విధానంలో ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీ ల అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు, తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
సిపిఎస్ విధానం రద్దు విషయంలో ముఖ్యమంత్రి గారు తన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఉద్యమాల మాతృ సంస్థ గా ఎస్టియు విద్యారంగ సంక్షేమం కోసం రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
సమావేశం అనంతరం ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో ఎస్టియు ప్రతినిధి బృందం జిల్లా కేంద్రంలో వివిధ శాఖల అధికారులను కలిసి పలు సమస్యలపై చర్చించింది.
కార్యక్రమంలో ఎస్టియు నాయకులు గాజుల నాగేశ్వర రావు, గంటా మోహన్, ధనంజయ నాయుడు,హేమచంద్ర రెడ్డి, శ్రీదేవి లోకనాధ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కడియాల మురళి, ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి ,ఆర్థిక కార్యదర్శి చంద్రన్, బాలచంద్రా రెడ్డి, చిట్టిబాబు,మధు,సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post