అకాల మరణం పొందిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు వెంటనే ఉద్యోగ అవకాశం కల్పించేలా కారుణ్య నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్ టి యు) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్ విజ్ఞప్తి చేశారు.
ఎస్ టి యు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జగన్మోహన్ రెడ్డి , మధుసూదన నేతృత్వంలో ప్రతినిధి బృందం బుధవారం జిల్లా కేంద్రంలో వివిధ శాఖల అధికారులను కలిసింది. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ సీఈఓ ప్రభాకర్ రెడ్డి తో సమావేశమై పలు అంశాలను చర్చించింది.
ఈ సందర్భంగా గంటా మోహన్ మాట్లాడుతూ కారుణ్య నియామక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతూ ఉండటం వల్ల సంబంధిత కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్య నిధి ఖాతాలను అప్డేట్ చేసి ఆన్లైన్లో ఉంచాలని కోరారు. ఉన్నత పాఠశాలల్లో బోధనేతర సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్య నిధి రుణాలు, పదవి విరమణ చెందిన వారి తుది మొత్తాల చెల్లింపులు జాప్యం లేకుండా జరిగేలా చూడాలని కోరారు.
అంతకుముందు ఎస్టియు ప్రతినిధి బృందం జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ ను కలిసి వివిధ సమస్యలపై చర్చించింది. ఎస్టియు రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి గాజుల నాగేశ్వరరావు మాట్లాడుతూ టీచర్ల సర్వీస్ రెగ్యులరైజేషన్ మరియు సీనియార్టీ జాబితాలను పూర్తిస్థాయిలో విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర కార్యదర్శి హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ, పాఠశాలల్లో పిడి అకౌంట్ ల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఒంటిపూట బడుల నిర్వహణ విషయంలో స్పష్టత వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జగన్మోహన్ రెడ్డి ,మధుసూదన మాట్లాడుతూ టీచర్లకు సంబంధించిన సమస్యలు పెండింగ్ లో లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు .మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు మంజూరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు పాఠశాలలకు సంబంధించిన వివిధ సమస్యలను ప్రస్తావించారు.
అనంతరం ఎస్టియు నాయకులు జిల్లా ఖజానా శాఖ కార్యాలయం,.ఏ పి జి ఎల్ ఐ కార్యాలయాలను సందర్శించి సమస్యలపై చర్చించారు
కార్యక్రమాల్లో ఎస్టియు జిల్లా ఆర్థిక కార్యదర్శి మదన్ మోహన్ రెడ్డి, నాయకులు పురుషోత్తం , నరసింహులు, రాజారెడ్డి, మురళి అమర్నాథ్ రెడ్డి , ఎల్లప్ప ,కఠారి మోహన్ ,జార్జ్ ,నాగేంద్ర రాజు,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
.