తంబళ్లపల్లి మండల కేంద్రానికి సమీపంలోని మల్లయ్య కొండపై వెలసిన భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలం తరువాత జిల్లాలోనే అత్యంత ప్రసిద్దిగాంచిన పురాతన శైవక్షేత్రాల్లో ఒకటిగా పేరొందింది. సముద్రమట్టానికి 1500 అడుగుల ఎత్తులో మల్లయ్య కొండ, ఇనుముకొండ, సాధుకొండ ల సముదాయాల్లో వెలసిన మల్లికార్జున స్వామి కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా, మహిమాన్విత క్షేత్రంగా, మూడుకొండల మల్లన్నగా ప్రసిద్ధిగాంచింది.
మల్లయ్య కొండ ఆలయ స్థల పురాణం
పూర్వం శివ భక్తులైన మల్లన్న, శివన్న లకు ప్రతిరోజూ రాత్రివేళలో ఒక కొండపై మెరుపు మెరుస్తూ పిడుగు పడటం కనిపించేది. వెళ్లి చూసేందుకు ప్రయత్నిస్తే కళ్ళు తెరవలేని కాంతి తో మాయం అవడం జరుగుతుండేది. ఒక రోజు పశువుల కాపరులు ఇద్దరూ మేతకోసం పశువులను తోలుకుని కొండకు వెళ్లారు. మధ్యాహ్నం భోజనం అనంతరం చెట్టుకింద సేదతీరుతుండగా పెద్ద శబ్దంతో కొండపై మెరుపులాగా ఏదోపడినట్లు తెలిసింది.
రోజూ కలలో కనపడిన సంఘటన నిజంగానే జరగడంతో భయపడుతూ వెళ్లి గ్రామస్థులకు చెప్తారు. గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న ప్రాంత సామంత రాజు మల్లన్న, శివన్నలను వెంటబెట్టుకుని సైనికులు, గ్రామస్థుల సాయంతో కొండపై పిడుగు (మెరుపు) (ప్రస్తుతం ఆలయం వున్న ప్రదేశంలో) పడిన ప్రదేశంలో చూడగా మెరుస్తూ చుట్టూ కాంతులు వెదజల్లుతున్న దివ్య తేజస్సు తో స్వయంభు శివలింగం సాక్షాత్కరించిందట.
ఈ విషయాన్ని చోళ రాజులకు తెలియజేసి ఆ మహిమాన్విత ప్రదేశంలో సామంత రాజు మల్లన్న ఆలయం నిర్మించాడని పురాణ గాథ. శివుడు స్వయంగా తపస్సుకై మల్లయ్య కొండపై నుంచి వీరన్న ఘెవి ద్వారా సాధుకొండకు వెళ్లి ఋషు లతో కలసి తపస్సు చేసాడని ప్రతీతి.
శివయ్య కు గౌరమ్మతో పెళ్లి సంబంధం కోసం చెల్లెలు వెలుగు మల్లమ్మ తో కలసి కొండపైకి వెళ్తుండగా అందవికారంగా వున్న తన వల్ల పెళ్ళిసంబంధం రద్దు కాకూడదని మార్గమధ్యంలో (వెలుగు మల్లమ్మ ఆలయం నిర్మించిన ప్రదేశం) ఆగిపోయిందని అంటారు. పెళ్లి చూపులకని వెళ్లిన శివుడు గౌరమ్మను పెళ్లి చేసుకుని కొండపైనే ఉండిపోవడంతో చెల్లి వెలుగుమల్లమ్మ ఆగ్రహించింది. ఆమెను శాంతిపచేస్తూ ముందు ముందు ఈ కొండ భక్తుల కోర్కెలు తీర్చే మహిమాన్విత మల్లయ్యకొండ గా ప్రసిద్ధి చెందుతుందని,కొండకు వచ్చే భక్తులు మొదటగా మార్గమధ్యంలో వెలుగుమల్లమ్మకు మొదటి పూజ చేసుకున్నాకే నా దర్శనం చేసుకుంటారని అభయమిచ్చి శాంతింపచేసాడని పురాణ కథ ప్రచారంలో ఉంది.
మల్లయ్య కొండపై దర్శించవలసిన ప్రదేశాలు
మల్లయ్య కొండపై ఆలయానికి దగ్గరలో గౌరమ్మ కుప్ప ఆలయం ఉంది. కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన నిచ్చెన గుండం, ఎలుకతీర్థం, భగీరథీ లోని నీటిని స్వామివారికి అర్చనలు,అభిషేకాలకై వినియోగిస్తారు. అభిషేకించిన నీటిని తీర్థంగా సేవిస్తే దీర్ఘ కాలిక వ్యాధులనుంచి ఉపశమనం ఉంటుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. సహజసిద్దంగా ఏర్పడిన కోనేరులో స్నానమాచరించి స్వామివారికి మొక్కుకుంటే పిల్లలు లేని వారికీ సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. చాకలివాని బావి, ఎర్రబావి( వూట చలమ), భగీరథీ, అంతర్ గంగా తదితర దర్శించవలసిన ప్రదేశాలు కొండపై వున్నాయి. కార్తీక మాసంలో ఉషోదయాన సూర్యకిరణాలు నేరుగా శివలింగాన్ని తాకే దృశ్యం ప్రసిద్ధి. కొండపై నుంచి చూస్తే తిరుమల శ్రీవారి ఆలయం కనపడుతుందని పురాణ పెద్దలు ఇతిహాస గాథ.
శ్రీశైలం తర్వాత అత్యంత ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు
శ్రీశైలం తర్వాత చిత్తూరు జిల్లాలో అత్యంత ఘనంగా మల్లయ్య కొండపై మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు జిల్లా నుంచే కాకుండా ప్రక్క జిల్లాలు, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో మల్లయ్యకొండకు తరలి వచ్చి స్వామి వారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
ప్రతి ఏటా వేల సంఖ్యలో తరలివచ్చే శివ మాల స్వాములు,లక్షల సంఖ్యలో తరలి వచ్చే భక్తులతో మల్లయ్య కొండ కిటకిటలాడుతూ శివనామ స్మరణలతో మార్మోగిపోతోంది. దాతల సాయంతో మల్లయ్య కొండ అన్నదాన ట్రస్ట్ వారిచే మహా శివరాత్రి రెండు రోజులపాటు కొండ కింద మద్దాతుని భక్తుని బావి వద్ద భక్తులకు అన్ని సౌకర్యాలతో పెద్ద ఎత్తున ఉచిత అన్నదాన కార్యక్రమం గత 11 ఏళ్లుగా నిర్విరామంగా కొనసాగుతోంది. హిందూ ముస్లిం లు మత సామరస్యం తో కొండకు వచ్చే భక్తులకు నిమ్మ రసం,మజ్జిగ,శీతల పానీయాలను ఉచితంగా పంపిణీ చేస్తారు.
నాడు చోళుల కాలంలో ఆలయం నిర్మాణం..
నేడు పెద్దిరెడ్డి హయాంలో పునర్నిర్మాణం
పూర్వం చోళ రాజుల కాలంలో మల్లయ్య కొండపై శివాలయాన్ని నిర్మించారు. గతంలో తంబళ్లపల్లి ఎమ్మెల్యే లుగా సేవలందించిన వారందరూ మల్లయ్య కొండ పై మౌలిక వసతులు కల్పిస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేసారు. అయితే మళ్ళీ నేడు పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ల హయాంలో ఆలయాన్ని పునర్నిర్మిస్తూ అభివృద్ధి చేస్తున్నారు.
రూ.3.7కోట్ల అభివృద్ధి నిధులు మంజూరై ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహా శివరాత్రి కల్లా ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయాలనే దృఢ సంకల్పం తో స్వయంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి దగ్గరుండి మరీ నిర్మాణ పనుల నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నారు.
కొండ కింద నుంచి ఆలయం వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 6.75 కోట్ల నిధులతో పనులు చేపట్టారు. కొండకు వచ్చే భక్తులకు ఎప్పటికి నీటి సమస్య తలెత్తకూడదనే ఉద్దేశ్యం తో గతంలో వున్న సింగిల్ ఫేస్ విద్యుత్ సరఫరా ను త్రీ ఫేస్ కు మార్పు చేసి అదునూతన త్రీ ఫేస్ మోటార్లను ఏర్పాటు చేసేలా ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి నిధులు మంజూరు చేసి పనులు పూర్తయ్యేలా కృషి చేసారు. మల్లయ్య కొండను శ్రీశైలం తరహాలో అభివృద్ధి చేస్తామని అంటున్నారు. ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవం గా నిర్వహించారు.
Discussion about this post