జాతి సంపదను పరిరక్షించడానికే మాన్ స్క్రిప్ట్ ప్రాజెక్టు
జాతీయ సెమినార్ లో టీటీడీ జేఈవో సదా భార్గవి
సనాతన భారతీయ విజ్ఞానం దాగి ఉన్న తాళపత్రాల్లోని విషయాలను నేటి తరానికి అందించడానికి ఆకాశమే హద్దుగా టీటీడీ పరిశోధనలు చేస్తోందని జేఈవో సదా భార్గవి చెప్పారు.
శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో “మాన్ స్క్రిప్ట్ డిజిటైజేషన్ టెక్నాలజీస్” పై రెండు రోజుల జాతీయ స్థాయి సెమినార్ శనివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సదా భార్గవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వర మాన్ స్క్రిప్ట్ ప్రాజెక్టు ద్వారా దేశం నలుమూలల నుండి తాళ పత్రాలు సేకరించి వాటిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో డిజిటైజ్ చేస్తున్నామని చెప్పారు. డిజిటైజ్ చేసిన తాళ పత్రాలను 500 సంవత్సరాలు గడిచినా చెక్కు చెదరని విధంగా భద్రపరచే ఏర్పాట్లు చేస్తున్నట్లు జేఈవో వివరించారు. వ్యక్తులు, సంస్థలు తమ వద్ద తాళ పత్రాలు ఉంటే మాన్ స్క్రిప్ట్ ప్రాజెక్టు కు తెచ్చి వాటిని డిజిటైజ్ చేసుకుని వెళ్లొచ్చన్నారు. భావి తరాలకు ఉపయోగపడే తాళ పత్రాలను పుస్తక రూపంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈవో ఎవి ధర్మారెడ్డి మార్గదర్శనంలో ఈ ప్రాజెక్టు ఏడాది కాలంగా బ్రహ్మాండంగా పని చేస్తోందన్నారు. సనాతన జీవన్ ట్రస్ట్ సహకారంతో తాళ పత్రాల డిజిటైజేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతోందని ఆమె వివరించారు. తాళ పత్రాలు ఎందుకు డిజిటైజ్ చేయాలి, ఎలా భద్ర పరచాలి, ఇందుకోసం ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలనే విషయాలు తెలుసుకోవడానికి సెమినార్ ఎంతో ఉపయోగపడుతుందని సదా భార్గవి తెలిపారు.
జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కృష్ణమూర్తి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానాలకు సంబంధించిన అనేక విషయాలు పూర్వీకులు తాళ పత్రాల్లో పొందుపరచారని చెప్పారు. వీటిని డిజిటైజ్ చేయడం, భద్రపరచడం సామాన్య విషయం కాదన్నారు. ఈ పని టీటీడీ మాత్రమే చేయగలుగుతుందని అన్నారు.
వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదా శివమూర్తి సభకు అధ్యక్షత వహించారు . ఎస్వీబీసీ సిఈవో షణ్ముఖ్ కుమార్, సనాతన జీవన్ ట్రస్ట్ ప్రతినిధి, హైదరాబాద్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి లో ఎలక్ట్రానిక్ విభాగం ప్రొఫెసర్, తాళపత్ర పరిశోధకులు నరహరి శాస్త్రి, మాన్ స్క్రిప్ట్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రాధే శ్యామ్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తాళ పత్రాల పరిశోధకులు హాజరయ్యారు.
Discussion about this post