చిత్తూరు జిల్లా తొట్టంబేడు తహసీల్దారు కార్యాలయం వివాదాలకు కేంద్రంగా మారింది. ఇక్కడ పని చేసే అధికారులు, ఉద్యోగులు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం దినచర్యగా మారిపోయింది. ఉద్యోగులు వర్గపోరుతో ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. ఫలితంగా కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లుగా ఇక్కడ ఇదే దుస్థితి ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు కానీ… అధికారులు కానీ చర్యలు తీసుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తొట్టంబేడు మండలం గుండె లాంటిది. ఈ మండలంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. పదుల సంఖ్యలో క్వారీలతో పాటు… ఖజారియా, గ్రీన్ ప్లై వంటి ప్రముఖ పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. రౌతుసూరమాల ప్రాంతంలో కొత్తగా పరిశమ్రలు ఏర్పాటు చేయడానికి ఏపీఐఐసీ వారు రెండువేల ఎకరాకలకు పైగా భూసేకరణ కూడా చేశారు. కాసరం ప్రాంతంలో కూడా పరిశ్రమల ఏర్పాటుకు పరిశీలన జరుగుతోంది.
తెలుగుగంగ కాలువ కూడా ఈ మండలం నుంచే పోతుంది. ఈ నేపథ్యంలో తొట్టంబేడు మండలంలో ఉన్న భూములకు ఎంతో డిమాండు పెరిగింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత రెవిన్యూ యంత్రాంగంపై ఉంది. అయితే ఇక్కడ పనిచేసే అధికారులు, ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఇప్పటికే పరాధీనమైంది.
శ్రీకాళహస్తి పట్టణం కొంతభాగం తొట్టంబేడు మండల పరిధిలోకి వస్తుంది. పట్టణ సరిహద్దుల్లో ఉన్న భూమి ధర ఆకాశానికి పెరిగి పోయింది. ఇదే తొట్టంబేడు రెవిన్యూశాఖ వారికి కాసులు కురిపిస్తోంది. రికార్డులు తారుమారు చేసి పట్టాలు ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వ భూమి పరాధీనం చేయడానికి రెవిన్యూలో కొందరు ఉద్యోగులు పోటీ పడుతున్నారు. ఎల్ ఐసీ కాలనీ, బంగారమ్మకాలనీ, చిలకావారికండ్రిగ, ఆర్ సీపీ పాఠశాల, రామచంద్రాపురం, రాజీవ్ నగర్ ప్రాంతాల్లో రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి ఇప్పటికే పరాధీనమైంది.
ఈ కబ్జాల వెనుక కొంతమంది రెవిన్యూ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణ బలంగా ఉంది. కాసరం, చిట్టత్తూరు, పెద్దకన్నలి, చిన్నకన్నలి, తంగేళ్లపాళెం తదితర గ్రామాల్లో రికార్డులు తారుమారు చేసి ఒకరి భూమిని మరొకరి పేరున మార్చేశారు. ఇలా రికార్డులు తారుమారు చేసిన వ్యవహారంలో కొందరు ఉద్యోగులు ఇబ్బందులు కూడా పడ్డారు.
రాజకీయ పార్టీల నేతల అండ చూసుకుని తొట్టంబేడు రెవిన్యూశాఖ వారు మరింత రెచ్చిపోతున్నారు. శ్రీకాళహస్తి పట్టణ శివారులో ఉన్న ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టేశారు. రూ.10కోట్లకు పైగా విలువ చేసే శ్రీకాళహస్తి డంపింగ్ యార్డు భూమిని కూడా ఇతరులకు స్వాధీనం చేశారు. అయితే ఈ ఆక్రమణపై పత్రికల్లో వరుస కథనాలు రావడంతో కలెక్టరు హరినారాయణన్ స్పందించారు.
ఆక్రమణలు తొలగించక పోతే చర్యలు అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టరు ఆగ్రహంతో డంపింగ్ యార్డుకు కబ్జాదారుల చెర నుంచి విముక్తి లభించింది. అది అలా ఉంచితే శ్రీకాళహస్తి ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న ఎంతో విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. ఇందులో కూడా రెవిన్యూ అధికారులు హస్తం ఉందనే ఆరోపణ బలంగా ఉంది. ఇక ఎంజీఎం ఆస్పత్రి సమీపంలో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంతో ఉన్న కల్లాం భూమి కూడా కజ్జా చేశారు. తొట్టంబేడు రెవిన్యూ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగి ఈ భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణ ఉంది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
తొట్టంబేడు తహసీల్దారు కార్యాలయంలో ఉద్యోగులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. ఈ వర్గాల కారణంగా ప్రజల ఇబ్బందులు పడుతున్నారు. ఒకరు అ వునంటే… మరొకరు కాదంటారు. ఒకరు కాదంటే మరొకరు అవునంటారు. ఈ కారణంగా సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు తమ గోడును ఎవరికి చెప్పకోవాలో తెలియక అల్లాడి పోతున్నారు. . ఈ కార్యాలయ ఉద్యోగులు కొందరు ప్రజల ముందే వాగ్వాదం పడటం మామూలై పోయింది. రెండేళ్లుగా ఇదే దుస్థితి. అయినా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు
తొట్టంబేడు తహసీల్దారు కార్యాలయంలో గత కొన్ని రోజులుగా వీఆర్వోల సంఘం గురించి రగడ జరుగుతోంది. మండల వీఆర్వోల సంఘం అధ్యక్షులుగా ఇటీవల వెంకటయ్యను ఎన్నుకున్నట్లు ఓ వర్గం ప్రకటించింది. ఈ ఎన్నిక జరిగిన వారం రోజుల తరువాత జిల్లా వీఆర్వోల సంఘం వారు చిట్టత్తూరు వీఆర్వో విద్యావతిని మండల వీఆర్వోల సంఘం అధ్యక్షురాలుగా ప్రకటించారు. ఈమె నియామకాన్ని ఓ వర్గం వ్యతిరేకిస్తున్నారు. కొందరు వెంకటయ్యకు మద్దతు ఇస్తుండగా.. మరికొందరు విద్యావతికి మద్దతు ఇస్తున్నారు.
వీఆర్వోల రగడ మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ రెవిన్యూ ఉద్యోగుల మధ్య ఉన్న వర్గాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారులు ఇకనైనా స్పందించి తొట్టంబేడు తహసీల్దారు కార్యాలయంలో వివాదాలకు కేంద్రబిందువులుగా ఉన్న అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకుని.. ఇక్కడ నుంచి స్థాన చలనం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Discussion about this post