శ్రీ వేంకటేశ్వర పూజా విధానాన్ని ప్రతి ఇంట్లో ఆచరించేలా భక్తులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని టిటిడి ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తన కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన ఆగమ సలహాదారులు, పండితులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఆగమ ప్రమాణం, సశాస్త్రీయంగా శ్రీ వేంకటేశ్వర పూజా విధానం పుస్తకం తయారు చేసి రాబోయే హిందూ ధర్మ ప్రచార పరిషత్ బోర్డు సమావేశంలో ఈ అంశం పై చర్చించి ముద్రణకు శ్రీకారం చుట్టాలన్నారు. శనివారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, శ్రవణానక్షత్రం, ఉత్తర ఫల్గుణ నక్షత్రం, ఇతర పర్వదినాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి పూజ చేసుకునేందుకు వీలుగా ఈ పూజా విధానం పుస్తకం తయారు చేయాలన్నారు.
పూజకు అవసరమైన ద్రవ్యాలు ఇతర అంశాలు కూడా పుస్తకంలో పొందుపరచాలన్నారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కూడా భక్తులకు పూజా విధానం తెలియజేసేలా ఈ కార్యక్రమం రూపొందించి ప్రసారం చేయాలని ఆదేశించారు.
తద్వారా భక్తులు తమ ఇళ్లలొనే భక్తిశ్రద్ధలతో శ్రీ వేంకటేశ్వర స్వామి పూజా విధానాన్ని ఆచరించేందుకు వీలు కలుగుతుందని ఈవో చెప్పారు.
జెఈవో వీరబ్రహ్మం, ఆగమ సలహాదారులు ఆచార్య వేదాంతం విష్ణు భట్టాచార్య, ఆచార్య మోహన రంగాచార్యులు, డిప్యూటీ ఈవో లు విజయ సారథి, రామారావు, గోవింద రాజన్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు విభీషణ శర్మ సమావేశంలో పాల్గొన్నారు.
.

Discussion about this post