మహిళా వ్యవస్థాపకులు ప్రభావిత నేతలుగా ఎదగాలని, సమాజ పరివర్తనే లక్ష్యంగా పనిచేయాలని ప్రముఖ మానసిక నిపుణుడు డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పిలుపు నిచ్చారు.
బుధవారం రాస్ ప్రధాన కార్యాలయంలో ఆక్సెస్ లైవ్లీ హుడ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మహిళా వ్యవస్థాపకులు, వ్యాపార వేత్తల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకులు అంటే రాజకీయాలలో ఉన్న వారు మాత్రమే కాదని చెప్పారు.
ప్రజలను సమీకరించి, దిశానిర్దేశం చేసి, ప్రేరణ కలిగించి, సమిష్టి లక్ష్యాన్ని సాధించే ప్రతి వ్యక్తి నాయకుడు లేదా నాయకురాలు అన్నారు. సమాజంలో కొందరికి ఉపాధి కల్పించి, నిరుద్యోగ సమస్యను తగ్గించి, వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజ ప్రగతికి తోడ్పడే వారు సామాజిక నేతలుగా కీర్తింప బడతారని చెప్పారు.
కాబట్టి వ్యాపార సంస్థలు, పరిశ్రమలు స్థాపించి ప్రగతి సాధించాలనుకునే వారు నాయకత్వ లక్షణాలను సంతరించు కోవాలని సూచించారు.
ఉత్తమ లక్షణాలు ఉన్న వారు మాత్రమే తాము ఎంచుకున్న రంగాలలో రాణిస్తారని తెలిపారు. నాయకులకు ఆత్మవిశ్వాసం, బాధ్యత, అంకిత భావం, పరిస్థితులపై అవగాహన, లక్ష్య నిర్దేశం, ప్రేరణ కలిగించడం, నిర్ణయాత్మక శక్తి, సమస్యల పరిష్కార యుక్తి, ఉండాలన్నారు.
అలాగే విశ్వసనీయత, ఉద్వేగ ప్రజ్ఞ, సామర్ధ్యాలు, నైపుణ్యాలు, సామాజిక సంబంధాలు, ఒత్తిళ్ళ నియంత్రణ, సానుకూల దృక్పథం పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో క్లస్టర్ హెడ్ సవేరా మార్గ దర్శనం చేశారు. 35 మంది మహిళా పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.
.

Discussion about this post