చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం ఏంటని.. సామెత? కానీ.. ఏపీ మంత్రిగారి విషయంలో మాత్రం ఆయన రూటే సెపరేటు. చేతులు కాలితే తప్ప ఆకులు పట్టుకోనని అనే రకం ఆయన. ముందుజాగ్రత్త వద్దే వద్దని.. ముప్పు వచ్చిన తర్వాత.. జాగ్రత్త పడితే సరిపోతుందనేది తన థియరీ అని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ నిరూపించుకుంటున్నారు.
విద్యాసంస్థల్లో కొవిడ్ ప్రబలుతోందని, పిల్లల్లో కొవిడ్ బయటపడకపోయినప్పటికీ.. వారిద్వారా కుటుంబసభ్యులకు వ్యాపిస్తోందని.. అందువలన పాఠశాలలు మూసివేయాలని దేశంలో చాలా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే ఏపీలో మాత్రం.. స్కూళ్లు ఎట్టి పరిస్థితుల్లో మూసేసేది లేదని మంత్రి సురేష్ ప్రకటించారు. కొవిడ్ ను ఎదుర్కొంటూ స్కూళ్లు నడపడానికి ప్రత్యేక కార్యచరణ చేస్తామని అంటూ వచ్చారు. తీరా ఆంధ్రా యూనివర్సిటీలో బోలెడుకేసులు బయటపడ్డాయి.
ఈ నేపథ్యంలో విద్యాసంస్థల్లో కేసులు వస్తే వాటిని మూసేయాలని తాజాగా ప్రకటిస్తున్నారు. అంటే కేసులు బయటపడి.. ప్రాణాలు ప్రమాదంలో పడితే తప్ప.. విద్యాసంస్థలు మూసివేయడం ఆయనకు ఇష్టం లేదా అనే విమర్శలు వస్తున్నాయి. రకరకాల కారణాల వల్ల కొవిడ్ సెకండ్ వేవ్ ప్రబాలంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తాత్కాలికంగా కొన్ని రోజులు స్కూళ్లు మూసేయాల్సింది బదులు.. కొవిడ్ కేసులు వచ్చేదాకా ఆగాలి అన్నట్లుగా మంత్రి మాట్లాడడం విమర్శలకు దారితీస్తోంది.
ఏపీ ప్రభుత్వం ఎటూ లాక్డౌన్ పెట్టడం లేదు. ఈ విషయాన్ని హోంమంత్రి సుచరిత ఇప్పటికే ప్రకటించారు. అలాంటి ఆలోచనే లేదన్నారు. కనీసం కొవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ముందుజాగ్రత్తలు తీసుకోవడం కూడా ఇష్టం లేదన్నట్లుగా మంత్రి సురేష్ మాట్లాడడమే చిత్రంగా ఉంది.
.

Discussion about this post