సాహిత్య కారులుగా, కవులుగా, రచయితలుగా చెలామణీ అవుతున్నారు.. కొత్తగా ఏ పాతాళాలకు దిగజారిపోతున్నారో.. కవి నిఖిలేశ్వర్ ఆవేదనను గమనిస్తే మనకు కొంచెమైనా అర్థమవుతుంది.
సాహిత్యం సంఘహితం కోరుతుంది. రచన సామాజిక ప్రయోజనాన్ని ఉద్దేశించి సాగుతుంది. ఇలాంటి నిర్వచనాలన్నీ గతవైభవంగానే మిగిలిపోవాల్సిందేనా. ఆధునిక కాలంలో సాహిత్యకారులుగా చెప్పుకుంటున్న వారు, సాహిత్య సృజన చేస్తున్నవారు.. విలువలను మరచిపోయి.. స్వార్థంతోనే చెలరేగుతున్నారా? అంటే.. అవుననే అభిప్రాయమే ప్రముఖుల గళాల్లో కూడా వినిపిస్తోంది.
సాహిత్యం ఏరోజైతే సంఘహితానికి, సమష్టి ప్రయోజనానికి దూరంగా సృజింపబడిందో.. ఆలోగే ఆ రచయిత కవి కూడా దిగజారిపోయినట్టు అర్థం చేసుకోవాలేమో. ప్రఖ్యాత తెలుగు కవి నిఖిలేశ్వర్ ఎంతో ఆవేదనా భరితంగా చెప్పిన మాటలను గమనిస్తే.. రచయితలుగా చెలామణీ అవుతున్న వారి దిగజారుడుతనం అంతా నిజమే అనిపిస్తుంది.
కవి నిఖిలేశ్వర్ రాసిన ‘అగ్నిశ్వాస’ కవితా సంపుటికి ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆ అవార్డు ప్రదానోత్సవం తాజాగా ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా నిఖిలేశ్వర్ మాట్లాడుతూ.. ఇవాళ్టి రచయితలు కవులు ఎంతగా దిగజారిపోతున్నారో తన ఆవేదనను పంచుకున్నారు. రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారిపోతుండడం, పదవులకోసం అర్రులు చాస్తూ రాజకీయ పార్టీల అడుగులకు మడుగులొత్తడం గురించి నిప్పులు చెరిగారు.
‘మతాలు, కులాల వైరుధ్యాలు పెచ్చరిల్లుతున్న ఈ వ్యవస్థలో రచయిత ఎంతో బాధ్యతతో సమాజానికి దిశానిర్దేశం చేయాలని, అయితే ఇవాళ్టి రోజుల్లో రచయిత అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్నాడని’ నిఖిలేశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రచయితల స్వేచ్ఛను అరికట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. రచయితల భావప్రకటన స్వేచ్ఛకు అడ్డుకట్టవేస్తున్నాయనే అభిప్రాయం వెిలిబుచ్చారు. రచయితలను నేడు జైలుకు పంపుతున్నారంటూ… రచయితలు కూడా పార్టీలకు అనుగుణంగా చీలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిఖిలేశ్వర్ చెప్పినట్లుగా రచయితలు రాజకీయ పార్టీలకు కొమ్ముకాయడం, వారి మోచేతి నీళ్లు తాగడానికి అర్రులు చాచడం సాధారణంగా మారిపోయింది. పదవులు కోరుకుంటున్నవారు, అవార్డులు కోరుకుంటున్న వారు.. రాజకీయ పైరవీలనే ఆశ్రయిస్తున్నారు. అలాంటివారు స్వచ్ఛంగా ప్రజాగళాన్ని ప్రతిబింబించేలా ఏం రచనలు చేయగలరు? రచయితల్లో దుర్మార్గంగా తయారవుతున్న సంస్కృతికి నిఖిలేశ్వర్ మాటలు అద్దం పట్టినట్టుగా కనిపించాయి.
.