రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను దగా చేయడం మానుకోవాలని లేకుంటే వారి ఆగ్రహానికి పతనం కాక తప్పదు అని ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి హరికృష్ణ అన్నారు. తిరుపతిలోని ఆటో వర్కర్స్ ఫెడరేషన్ ముఖ్యనేతల సమావేశం నారాయణపురంలోని ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో మంగళవారం జరిగింది.
తిరుపతి ఆటో వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు పి.రాజగోపాల్ అధ్యక్షత వహించారు. సమావేశంలో ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి హరికృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.
ఒక్క తిరుపతి నగరంలోని 16 వేల మంది ఆటో కార్మికులుంటే కేవలం 6 వేల మందికి వాహన మిత్ర పథకం అందిందని అన్నారు. అలా కాకుండా నగరంలోని అలాగే జిల్లా లోని ఆటో కార్మికులందరికీ వాహన మిత్ర పథకం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి కార్మికుడికి ఇంటి స్థలాలు ఇవ్వాలని, పావలా వడ్డీ రుణాలు తక్షణం అందించాలని అలాగే బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే వారికి సంక్షేమ నిధి నుంచి అందిస్తున్న ఆర్థిక సహాయం తరహాలో ప్రమాదానికి గురైన ఆటో కార్మికులకు సైతం రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షలు నష్ట పరిహారం అందించాలని హరికృష్ణ డిమాండ్ చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజు పెరుగుతుండడంతో ఆటో డ్రైవర్లు దిక్కుతోచని పరిస్థితిలో పడుతున్నారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ధరల పెరుగుదలకు నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ తిరుపతి కార్యదర్శి పి.వెంకటరత్నం మాట్లాడుతూ కరోనతో ఆటో కార్మికుల జీవితాలు చిధ్రం అయ్యాయన్నారు. పనిలేక, తమ కుటుంబాలను పోషించు కోలేక… ఇంటి బాడుగ కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆటో కార్మికులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వారి పిల్లల చదువులు, ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో తిరుపతి ఆటో వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కుడుం విజయ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు.
.

Discussion about this post