జగద్రక్షకుడి కొలువులో రక్షణ బాధ్యతలు చూడడం వారి విధి. బూడిద పూసుకు తిరిగేవాడి ఆలయంలో భక్తులకు భద్రత బాధలు తలెత్తకుండా జాగ్రత్తలు వారి పరిధి. కొలువు గట్టిగానే ఉంది. కానీ.. కడుపే నిండడం లేదు! శ్రీకాళహస్తీశ్వరాలయంలో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న వారికి మూడు నెలలుగా జీతాలే అందక అలమటిస్తున్నారు.
వారందరూ శ్రీకాళహస్తీశ్వరస్వామిని నమ్ముకుని బతుకులు వెళ్లదీస్తున్నారు. ఆలయం వారు జీతాలు ఇస్తేనే వారి కడుపులోకి మెతుకులు దిగుతాయి. అలాంటి నిరుపేద, చిరు ఉద్యోగులకు వేతనాలు సకాలంలో చెల్లించక పోవడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సెక్యూరిటీ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. జీతం అడిగే వారికి విధులు అప్పగించకుండా వేధిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శ ఉంది.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రస్తుతం సుమారు 150 మంది సెక్యూరిటీ సిబ్బంది పని చేస్తున్నారు. వీరి నిర్వహణ బాధ్యతను ముక్కంటి ఆలయం వారు ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవాలన్నా.. విధుల నుంచి తొలగించాలన్నా ఈ ఏజెన్సీకే అధికారం ఉంటుంది.
ఆలయం వారు టెండరు ప్రక్రియ ద్వారా ఏజెన్సీని ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా సెక్యూరిటీ నిర్వహణ బాధ్యత ఒక్కరికే ఇస్తారు. అయితే ప్రస్తుతం ముక్కంటి ఆలయంలో రెండు ఏజెన్సీలు సెక్యూరిటీ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు.
ఈ ఏజెన్సీల మధ్య సెక్యూరిటీ సిబ్బంది నలిగి పోతున్నారు. ఆలయం వారు బిల్లులు ఇచ్చేసినా.. ఏజెన్సీ వారు మాత్రం సకాలంలో సెక్యూరిటీ సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదు. ఈ ఏడాది అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాలకు సంబంధించి సెక్యూరిటీ సిబ్బందికి ఇంతవరకు జీతాలు చెల్లించలేదు.
మూడు నెలలుగా జీతాలు చెల్లించక పోవడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు ఇవ్వాలని అడిగిన వారికి డ్యూటీలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఇక ఏజెన్సీల వారు సిబ్బంది జీతాల్లో పెద్ద మొత్తంలో కోత విధిస్తున్నారనే ఆరోపణ కూడా బలంగా ఉంది. ఒక్కొక్క ఉద్యోగి జీతంలో సగటున నెలకు రూ.2 వేల వరకు కోత ఉంటోందని సెక్యూరిటీ సిబ్బంది వాపోతున్నారు.
చాలా కాలంగా ఈ రకం దోపిడీ జరుగుతున్నప్పటికీ సదరు ఏజెన్సీల పైన ముక్కంటి ఆలయ అధికారులు టెండరు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది. వేతనాలు చెల్లింపుల్లో కూడా తరచూ జాప్యం జరుగుతోంది. ముక్కంటి ఆలయ అధికారులు ఇకనైనా స్పందించి సెక్యూరిటీ సిబ్బందికి సకాలంలో జీతం అందే విధంగా.. జీతాల్లో కోత లేకుండా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
.
Discussion about this post