తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే శ్రీకాళహస్తి నియోజకవర్గంను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర శుక్రవారం తొట్టంబేడు మండలంలోకి ప్రవేశించింది. తొట్టంబేడు మండలం చిట్టత్తూరు పంచాయతీ లక్ష్మీపురం వద్ద నారా లోకేష్ కు తెలుగుదేశం పార్టీ శ్రేణులు గజమాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. లక్ష్మీపురం, కొత్తకండ్రిగ, శివనాథపురం, రాజీవ్ నగర్ మీదుగా పాదయాత్ర రామచంద్రాపురం వద్దకు చేరుకుంది.
ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో చైతన్యరథం పై ఎక్కి నారా లోకేష్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హయాంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ వంటి జాతీయ విద్యా సంస్థలతో పాటు… పదుల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు చేశామన్నారు. సుమారు 5వేల టిడ్కో గృహాలు కూడా బొజ్జల హయాంలో నిర్మించినవేనని ఆయన చెప్పారు.
ప్రస్తుతం శ్రీకాళహస్తిలో కనిపిస్తున్న అభివృద్ధి మొత్తం బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హయాంలో జరిగిందేనని ఆయన చెప్పారు. అలాంటి అభివృద్ధి ప్రదాత శ్రీకాళహస్తి ప్రజలకు దూరం కావడం బాధాకరమన్నారు. వచ్చే ఎన్నికల్లో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని శాసనసభ్యులుగా గెలిపిస్తే శ్రీకాళహస్తిని ఆయన తండ్రిలాగే మరింత అభివృద్ధి చేస్తారన్నారు.
పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో స్వర్ణముఖనది సుందరీకరణ బాధ్యతను తెలుగుదేశం తీసుకుంటుందన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరిగే అక్రమాలను అరికడతామన్నారు. శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాలను సస్యశ్యామలం చేసే సోమశిల-స్వర్ణముఖి అనుసంధాన కాలువ పనులు పూర్తి చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇక వైసీపీ విధానాలను ఆయన ఎండగట్టారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక సైకోలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. రాయలసీమలో ఎక్కడ చూసినా కాంట్రాక్టులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానివేనని ఆయన చెప్పారు.
ఇక శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి బడా చోర్ అని అన్నారు. బియ్యపు మధు శ్రీకాళహస్తి ఆలయాన్ని దోచుకు తింటున్నారని నారా లోకేష్ ఆరోపించారు. గుడిని, లింగాన్ని కూడా మింగేస్తున్నారన్నారు. స్వర్ణముఖినది నుంచి నిత్యం ఇసుక అక్రమంగా తరలిస్తూ రూ.కోట్లు దోచుకుంటున్నారన్నారు. రేణిగుంట మండలం వెంకటాపురం వద్ద సుమారు రూ.100కోట్ల విలువ చేసే 30 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేశారన్నారు.
తెలుగుదేశం హయాంలో వికృతమాల సమీపంలో నిర్మించిన చైనా పరిశ్రమ నిర్వాహకులను బెదిరించడంతో ఈ పంచాయితీ ప్రధాని నరేంద్రమోదీ వద్దకు చేరిందన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంను మండలాల వారీగా బియ్యపు మధుసూదనరెడ్డి కుటుంబ సభ్యులు పంచుకుని దోచుకు తింటున్నారని ఆయన ఆరోపించారు. ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.
శ్రీకాళహస్తిలో ఇప్పటికే చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ ప్రోద్బలంతో పోలీసులు తప్పుడు కేసులు బనాయించారన్నారు. తనపై కూడా పోలీసులు ఇప్పటి వరకు 20కి పైగా తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఈ కేసులకు కార్యకర్తలు భయపడ కూడదన్నారు. వీరోచితంగా పోరాడి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి నారా చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రి చేయాలని కోరారు. శ్రీకాళహస్తిలో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని గెలిపించాలని నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.
ఈ సభలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి అమరనాథరెడ్డి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య, బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, బొజ్జల బృందమ్మ, గాలి చలపతినాయుడు, గాలి మురళీనాయుడు, సత్రవాడ ప్రవీణ్, చక్రాల ఉష, విజయకుమార్, చెంచయ్యనాయుడు, రావిళ్ల మునిరాజా నాయుడు, తాటిపర్తి రవీంద్రనాథరెడ్డి, రాంబాబునాయుడు, రెడ్డివారి గురవారెడ్డి, గుమ్మడిపూడి దశరథాచారి, షాకీరాలీ, కాసరం రమేష్, వజ్రం కిషోర్, ఢిల్లీ బాబు, కన్నావరం హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
.