అసలే ఖాకీ.. ఆపై చేతివాటం ఉన్న ఘనాపాటి.. అంతకంటె ఆపై.. తిరుమలలో డ్యూటీ! ఇక చెప్పేదేముంది.. దళారులను కూడా పోగేసుకున్నాడు. దందాలను షురూ చేశాడు. అక్రమాలకు పాల్పడుతూ.. బ్లాక్ మార్కెట్లో దర్శనం టికెట్ ధరలను పది, ఇరవై రెట్లు పెంచి అమ్మేస్తున్నాడు. ఈ దందాకే పరిమితం అయినా సరిపోయేది. నకిలీ టికెట్లను సృష్టించి వాటిని కూడా బ్లాక్ మార్కెట్ లో అంటగట్టే నయా అరాచకత్వానికి తెరతీశాడు. ఆ రకంగా విజిలెన్సు వారికి దొరికిపోయాడు.
వివరాల్లోకి వెళితే.. తిరుమల శ్రీవారి దర్శనం కు సంబంధించి గతంలో జారీ చేసిన ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈడి) టికెట్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొత్తగా జారీ చేసిన టికెట్లుగా తయారుచేసి.. వాటిని అధిక ధరలకు భక్తులకు విక్రయించేసి మోసగించిన ముఠాపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆదివారం తిరుమల ఒకటవ, రెండవ పట్టణ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
రూ 300 టికెట్ ను రూ 3300, రూ 7000 వంతున భక్తులకు ఈ నకిలీ ముఠా వారు అంటగట్టారు. ఈ. ముఠాలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ తో పాటు దళారీలు, గతంలో త్రిలోక్ ఏజెన్సీ టికెట్ల కౌంటర్లలో పని చేసిన బాయ్స్ ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
చదవండి : తెలంగాణలో అక్క పార్టీ దిక్కు లేనిదేనా?
నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ కు చెందిన నలుగురు భక్తులు శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. తిరుపతిలో కొందరు దళారులు తాము దర్శనం టికెట్లు ఇప్పిస్తామని చెప్పి రూ 300 ప్రత్యేక ప్రవేశ టికెట్ కు రూ 3300 చొప్పున వసూలు చేసి నకిలీ టికెట్లు భక్తులకు ఇచ్చి తిరుమల శ్రీవారి దర్శనానికి పంపారు.
అదే విధంగా మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు భక్తులు నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. తిరుపతిలో దళారి వీరిని నమ్మించి రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్ కు రూ7000 చొప్పున ముగ్గురికి రూ 21,000 వసూలు చేసి వారికి నకిలీ టికెట్లు అంటగట్టి తిరుమలకు పంపారు.
read also : పరువు పాయె.. వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి సెల్ఫ్ గోల్
దర్శనం టికెట్ల స్కానింగ్ కేంద్రం వద్ద నకిలీ టికెట్లు పసిగట్టిన విజలెన్స్ సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు సివిఎస్వో గోపీనాథ్ జెట్టి ఆదేశం మేరకు భక్తుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. వారు అందించిన సమాచారం మేరకు విచారణ జరిపి ఆదివారం ఈ ముఠాకు చెందిన ఏడుగురు వ్యక్తుల పై తిరుమల ఒకటవ, రెండవ పట్టణ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
తెలంగాణకు చెందిన భక్తులను మోసగించిన బాలాజి అలియాస్ బాలు (దళారి), అరుణ్ (లడ్డూ కౌంటర్ సిబ్బంది), ఎం. కృష్ణారావు (ఎస్పీఎఫ్ కానిస్టేబుల్), నాగేంద్ర ( గతంలో త్రిలోక్ ఏజెన్సీ టికెట్ కౌంటర్ బాయ్) మీద ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
మధ్యప్రదేశ్ భక్తులను మోసగించిన చెంగారెడ్డి (దళారి), జె.దేవేంద్ర ప్రసాద్, ఈ వెంకట్ (గతంలో త్రిలోక్ ఏజెన్సీ కౌంటర్ బాయ్స్) మీద రెండవ పట్టణ పోలీసు స్టేషన్లో విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై నమోదు చేశారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు tirupati balaji.ap.gov.in వెబ్సైట్ లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సివిఎస్వో గోపీనాథ్ జెట్టి విజ్ఞప్తి చేశారు. భక్తులను మోసగించి అధిక ధరలకు టికెట్లు విక్రయించే వారిమీద, నకిలీ టికెట్లు అంటగట్టే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దళారులకు సంబంధించిన సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు.
.

Discussion about this post