సచివాలయ ఉద్యోగులను ఆశనిరాశల మధ్య ఉంచడం ప్రభుత్వానికి మళ్లీ తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఒకసారి నిరసన బాట పట్టిన ఈ చిరుద్యోగులు మళ్లీ ఉద్యమ కార్యచరణకు సిద్ధమైతే పరిస్థితి ఏమిటి? అసలే పీఆర్సీ రభసల నేపథ్యంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రభుత్వం ఇదే సమయంలో సచివాలయ ఉద్యోగులు కూడా నిరసన బాట పడితే తట్టుకుంటుందా? ఇవన్నీ ప్రశ్నలే.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మళ్లీ నిరాశే. ప్రొబేషన్ డిక్లరేషన్ విషయమై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టత ఇ చ్చారు. ముఖ్యమంత్రి జగన్ గురువారం నిర్వహించిన సమీక్ష, సమన్వయ కమిటీ సమావేశంలో శుభవార్త వస్తుందని సచివాలయ ఉద్యోగులు ఆశించారు. అయితే అందుకు విరుద్ధంగా ప్రకటన రావడంతో వారు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై సదరు సంఘం నేతలు ఆలోచిస్తున్నారు.
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు 2019 అక్టోబరు 2న శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సచివాలయాల్లో ప్రస్తుతం 1,34,694 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. రెండేళ్లు సర్వీసు పూర్తయిన వెంటనే ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని జగన్ ప్రభుత్వం అప్పట్లో చెప్పింది.
ఈ నిబంధన ప్రకారం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గత ఏడాది అక్టోబరు 2వ తేదీ నాటికి ప్రొబేషన్ ఖరారు చేయాల్సి ఉంది. ఉద్యోగులు సంబంధిత శాఖ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే ప్రొబేషన్ ఖరారు చేస్తామని మళ్లీ కొత్త నిబంధన విధించింది. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో చాలా కొందరు ఉత్తీర్ణత సాధించగా.. మరి కొందరు ఉత్తీర్ణత సాధించలేక పోయారు. ఇలాంటి వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది.
అయితే వీరిని సాకుగా చూపుతూ.. ఉత్తీర్ణత అయిన వారికి కూడా ప్రొబేషన్ ఖరారు చేయక పోవడం విమర్శలకు దారితీస్తోంది. అందరికీ ఒకేసారి అనగా ఈ ఏడాది జూన్ తరువాత ప్రొబేషన్ ఖరారు చేస్తామని ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి మాటలతో నిరాశకు గురైన సచివాలయ ఉద్యోగులు ఆ మరుదినం నుంచే నిరసన కార్యక్రమాలకు దిగారు.
ఇది గమనించి ఆ ఉద్యోగ సంఘ నేతలతో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చర్చలు జరిపారు. జూన్ కంటే మునుపే ప్రొబేషన్ ఖరారు చేసే విధంగా ప్రభుత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీతో సంతృప్తి చెందిన సచివాలయ ఉద్యోగులు విధులకు హాజరవుతూ వస్తున్నారు. జూన్ లోపే తమ ప్రొబేషన్ ఖరారు చేస్తారని ఆశించారు. అయితే గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఏపీ సేవా పోర్టల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖ వారితో సమీక్షించడంతో పాటు.. సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో శుభవార్త వినవచ్చని సచివాలయ ఉద్యోగులు ఆశించారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటన వీరి ఆశలపై నీళ్లు చల్లింది. ఈ ఏడాది జూన్ తరువాతనే సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేస్తామని ఆయన స్పష్టత ఇచ్చారు. శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి మొదట ప్రొబేషన్ ఖరారు చేయాలనే ఉద్యోగుల విజ్ఞప్తి దీంతో వెనక్కు పోయినట్లైంది. అంటే సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు కావాలంటే ఇంకా దాదాపు ఆరు నెలలు ఆగాలి. ఇప్పటికే మూడు నెలలు గడచి పోయాయి.
ప్రభుత్వ విధానం వలన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు 9నెలల సర్వీసును.. బెనిఫిట్స్ ను కోల్పోవలసి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్ లోపే ప్రొబేషన్ ఖరారు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఆ ఉద్యోగ సంఘాల నేతలు కార్యాచరణకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే అన్ని ఉద్యోగ సంఘాలు పీఆర్సీ కోసం ఉద్యమ బాట పట్టిన సంగతి తెలిసిందే. సచివాలయ ఉద్యోగులు కూడా ఉద్యమబాట పడితే క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పాలన స్తంభించి పోతుందనడనంలో ఎలాంటి సందేహం లేదు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.
.

Discussion about this post