చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని తొట్టంబేడు మండలంలో అధికార పార్టీ వైసీపీలో ఎర్రచందనం చిచ్చు రేపింది. ఈ ఘటనలో వైసీపీకి చెందిన బాబు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఘటన నియోజకవర్గం వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తొట్టంబేడు మండలం వైసీపీలో చాలా కాలంగా వర్గ పోరు నడుస్తోంది. పెత్తనం కోసం రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగా ఓ వర్గం వారు మరో వర్గంపై బురద చల్లడానికి ప్రయత్నించి.. ఆ ఉచ్చులోనే ఇరుక్కుని ఓ వ్యక్తి కటకటాల పాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే..
తొట్టంబేడు మండలం ఇలగనూరులో సర్పంచ్ సుబ్రహ్మణ్యం నాయుడు ఇంటి వద్ద ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు అటవీశాఖ అధికారులకు, పోలీసులకు శనివారం అర్ధరాత్రి సమయంలో సమాచారం అందజేశారు. ఈ సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆదివారం వేకువ జామున ఇలగనూరు లోని సర్పంచ్ సుబ్రహ్మణ్యం నాయుడు ఇంటి వద్దకు వెళ్లారు.
అక్కడ ఎద్దుల కొట్టంలో రెండు సంచుల్లోల ఎర్ర చందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని.. సర్పంచ్ సుబ్రహ్మణ్యం నాయుడును తమ వెంట రావాలని కోరారు. అయితే ఆయన అందుకు నిరాకరించారు. ఈ ఎర్రచందనం దుంగలతో తనకు ఎలాంటి సంబధం లేదని.. ఎవరో ఉద్దేశ్య పూర్వకంగా తనపై బురద చల్లడానికి ఇలా చేశారని అధికారులతో వాదనకు దిగాడు.
రాత్రి 10గంటల సమయంలో ఎద్దులకు తాను మేత వేశానని.. అపుడు లేని సంచులు ఇపుడు ఎలా వచ్చాయో తనకు తెలియదని అటవీశాఖ అధికారులకు మొర పెట్టుకున్నారు. అయినా వారరు వినలేదు. ఆయన్ను శ్రీకాళహస్తికి తీసుకొచ్చారు. అధికారుల తీరుపై స్థానికులు కూడా మండి పడ్డారు. దీంతో ఈ పంచాయతీ అదే మండలానికి చెందిన ఓ వైసీపీ నేత వద్దకు వెళ్లింది. ఆయన అటవీశాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాస్తవాలు తెలుసుకోకుండా సర్పంచ్ సుబ్రహ్మణ్మం నాయుడును ఎలా తీసుకు వస్తారని అధికారులను నిలదీశారు. ఇది ఇలా ఉండగానే ఓ ప్రజా ప్రతినిధి కుటుంబ సభ్యుల వద్దకు ఈ పంచాయతీ వెళ్లింది. వారి ఇంటి వద్దకు వెళ్లి స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. వివాదం ముదరడంతో అధికారులు లోతుగా విచారించారు.
రాజకీయ కక్షలతో ఈ సంఘటన జరిగినట్లు నిర్థారించుకున్నారు. సర్పంచ్ సుబ్రహ్మణ్యం నాయుడును విడిచి పెట్టారు. అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు పాచి బాబు అనే వ్యక్తి కుట్ర చేసి.. చాలా పాత ఎర్ర చందనం దుంగలను రెండు గోనె సంచుల్లో పెట్టి.. సుబ్రహ్మణ్యం నాయుడు ఇంటి వద్ద ఎద్దుల కొట్టంలో ఉంచి.. పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తేలింది.
బాబును అదుపులోకి తీసుకుని విచారించడంతో వాస్తవం వెలుగు చూసింది. తానే ఈ పని చేయించినట్లు అంగీకరించాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేశారు. సర్పంచ్ సుబ్రహ్మణ్యం నాయుడును ఇరికించ పోయి.. ఇరుక్కు పోయి వైసీపీ నేత బాబు కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలను, సానుభూతి పరులను ఇరికించడానికి అధికార పార్టీ వారు ఇక్కడ ఇలా చేసేవారు. అయితే ప్రస్తుతం అందుకు విరద్దంగా తమ పార్టీకే చెందిన వారిని తప్పుడు కేసులో ఇరికించడానికి ప్రయత్నించడం చూస్తే… ఆ పార్టీలో ఎలా వర్గ విభేధాలు ఉన్నాయో అర్థమవుతోంది. కక్ష తీర్చుకోవాలంటే.. తరతమ బేధం లేకుండా వైసీపీ నేతలు ఏమైనా చేస్తారని ఇలగనూరు సంఘటన నిరూపించింది.
.