అధికారుల నిర్లక్ష్యంతో శ్రీకాళహస్తీశ్వర ఆలయ పరువు పోతోంది. ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు రోజులుగా వెండి నాగపడగలు నిండుకున్నా సమస్య పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారు. ధర్మకర్తల మండలీ చేతులెత్తేసింది.
ఫలితంగా రాహు-కేతు సర్పదోష నివారణ పూజల కోసం వచ్చిన భక్తులు నాగపడగల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. నాగపడగల కొరతతో దోష పూజలు కూడా ఆలస్యంగా జరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం ముక్కంటి ఆలయ పరిపాలన భవనం వద్ద ఆందోళన చేశారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయం రాహు-కేతు సర్పదోష నివారణ పూజలకు ఖ్యాతి గాంచింది. దోష నివారణ పూజల కోసం దేశ, విదేశాలకు చెందిన వేలాది మంది భక్తుల నిత్యం ఇక్కడకు వస్తుంటారు.
ఈ ఆలయంలో రాహు-కేతు సర్పదోష నివారణ పూజల కోసం రూ.500, రూ.750, రూ.1,500, రూ.2,500, రూ.5,000 టికెట్లు.. ఇలా ఐదు రకాలుగా టికెట్లు నిర్ణయించారు. భక్తులు తమకు నచ్చిన టికెట్టు తీసుకుని దోష నివారణ పూజలు చేసుకోవచ్చు. రాహు-కేతు పూజలు చేసుకునే భక్తులకు అందుకు అవసరమైన పూజా సామాగ్రిని ఆలయం వారే అందజేస్తారు.
ఈ పూజా సామాగ్రితో పాటు ఒక్కో టికెట్టుకు రెండు వెండి నాగపడగలు (రాహువు, కేతువు) భక్తులకు ఇవ్వాలి. ఆలయం వారే రీసైక్లింగ్ పద్ధతిలో వీటిని తయారు చేసి భక్తులకు అందిస్తుంటారు. టికెట్టు ధరను బట్టి నాగపడగల పరిమాణం మారుతుంటుంది. రూ.500, రూ.750 టికెట్లకు ఒక రకం.. మిగిలిన మూడు రకాల టికెట్లకు కలిపి మరో రకం వెండి నాగపడగలు తయారు చేసి భక్తులకు అందచేయాల్సి ఉంటుంది.
ఒకసారి వాడిన నాగపడగలను హైదరాబాదులోని ప్రభుత్వ మింట్ కు తీసుకెళ్లి కరిగిస్తారు. ఆ వెండిని తీసుకువచ్చి ఆలయ ప్రాంగణంలోని మింట్ లో రెండు రకాల నాగపడగలు తయారు చేస్తారు. దశాబ్ద కాలంగా ఇదే తరహాలో వెండి నాగపడగలు ఈ తరహాలో తయారు చేసి భక్తులకు అందిస్తున్నారు. అయితే రెండు రోజుల పాటు ఎపుడూ ఇలాంటి సమస్య ఉత్పన్నం కాలేదు.

ఇపుడు ఏమైందంటే..
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రోజుకు సగటున 3వేలకు పైగా రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు జరుగుతుంటాయి. ఇందుకు అవసరమైన వెండి నాగపడగలు తయారు చేయడానికి ఆలయ మింట్ లో 14మంది సిబ్బంది ఉండే వారు. రెండు యంత్రాల ద్వారా వీటిని వీరు తయారు చేసే వారు. అయితే ఏ కారణాల వలనో ప్రస్తుతం మింట్ లో పని చేసే వారిలో పది మంది వరకు విధులకు రావడం లేదు. ప్రస్తుతం తక్కువ మంది సిబ్బంది పని చేస్తున్నారు. రెండు యంత్రాలలో ఒకటి కొన్ని రోజుల కిందట మరమ్మతుకు గురైంది. దీనిని తమిళనాడు లోని కోయంబత్తూరుకు తీసుకెళ్లి మరమ్మతులు చేయించాలి. అయితే ఏ కారణాల వలనో అధికారులు ఈ యంత్రానికి మరమ్మతులు చేయించ లేదు.
ఒక్క యంత్రంతోనే నాగపడగలు తయారు చేయాలని మింట్ సిబ్బందిని ఆదేశించారు. మింట్ లో పని చేసే సిబ్బంది తగ్గి పోవడం.. రెండు యంత్రాల్లో ఒకటి మరమ్మతుకు గురి కావడంతో వెండి నాగపడగలు తయారీలో జాప్యం చోటు చేసుకుంటోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవడంలో అధికారులు తగు చర్యలు తీసుకోవడం లేదు.
ఫలితంగా భక్తులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. అధికారుల తీరుతో ఆలయ పరువు పోతోందని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాల్సి ఉంది.
.
Discussion about this post