ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో జ్యోతిరావుపూలే విగ్రహం ఏర్పాటు చేసి తీరుతామని ఆప్కో మాజీ డైరెక్టరు, వైసీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనరు మిద్దెల హరి ప్రతిన చేశారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని స్వర్ణముఖి నది సమీపంలో సోమవారం జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకలు నిర్వహించారు. పూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మిద్దెల హరి మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పూలే చేసిన కృషి, త్యాగం మరువలేనిదన్నారు.
అలాంటి సంఘ సంస్కర్త విగ్రహం శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేయక పోవడం బాధాకరమన్నారు. ఆ మహనీయుని విగ్రహం ఏర్పాటుకు బీసీలు అందరూ ఏకం కావాలన్నారు. ఎవరు అడ్డు వచ్చినా పూలే విగ్రహం ఏర్పాటు చేయాల్సిందేనని చెప్పారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని స్వర్ణముఖీనది కూడలిని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహప్రతిష్ట సాధన స్థాపన కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావుపూలే కూడలిగా నామకరణం చేస్తున్నామని తెలియజేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహని విరాళంగాఅందజేస్తామని మిద్దెలహరి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్ల తాంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు దశరథాచారి, రెడ్డివారి గురవారెడ్డి, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
.