అత్యంత అట్టహాసంగా జరిగిన బిగ్ బాస్ సీజన్ 4 లో హీరో అభిజీత్ విజేతగా నిలిచాడు. హౌస్ లో ఆట ప్రారంభం అయిన తొలినాటినుంచి.. తన విలక్షణమైన ప్రతిభ, గుణాలతో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చిన అభిజీత్- చాలా మంది ఊహించినట్లుగా అంతిమ విజేత కావడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే బిగ్ బాస్ విజేతగా దక్కించుకున్న కీర్తి అతనికి పుష్కలంగా మిగిలింది గానీ.. ఆర్థికంగా లబ్ధి పొందడంలో మాత్రం మిగిలిన కంటెస్టెంట్లకంటె ముందంజలోనే ఉన్నాడా? నష్టపోయాడా? అంటే మాత్రం అనుమానమే.
అభిజీత్ అభిమానులు మాత్రం అతనిపై చాలా జాలి పడుతున్నారు. అందరికంటె బెటర్ గా ఆడి, మంచిగా ఉండి విజేతగా నిలిచాడు గానీ.. అతనికంటె ఇతర కంటెస్టెంట్లే ఎక్కువ లాభం పొందారని అనుకుంటున్నారు. కొన్ని
అంశాలను విడివిడిగా గమనిస్తే
సొహైల్ ఫైనల్ నుంచి వెళ్లిపోయాడు. పాతిక లక్షలు తీసుకుని వెళ్లిపోయాడు. పైగా అతనికి మెగాస్టార్ చిరంజీవి మరో పదిలక్షలు ప్రకటించాడు. నాగార్జున ఇంకో పదిలక్షలు ప్రకటించాడు. అందరూ అతని మీద వెల్లువలా సానుభూతిని, మద్దతును కురిపించారు. బ్రహ్మానందం వంటి నటుడు.. సొహైల్ సినిమా చేస్తే తాను అందులో ఫ్రీగా నటిస్తానని కూడా ఆఫర్ ఇచ్చాడు. ఇవన్నీ కలిపి చూసినప్పుడు.. బిగ్ బాస్ తెలుగు 4 విజేతగా అభిజీత్ కు దక్కిన దానికంటె ఎక్కువే సొహైల్ కు లభించినట్లు అర్థమవుతుంది.
మోనాల్ విషయానికి వస్తే.. ఆమె ఫైనల్ రౌండ్ కంటె ముందుగానే ఎగ్జిట్ అయింది. అయితే.. బిగ్ బాస్ హౌస్ కు కాస్త రొమాంటిక్ టచ్ ఇచ్చిన అందాల తార మోనాల్ కు ఒక వారానికి 3.5 లక్షల రెమ్యునరేషన్ తో మాట్లాడారని, ఆలెక్కన ఆమెకు కనీసంగా 35 లక్షల రూపాయలు గిట్టుబాటు అవుతాయని కొన్ని వార్తలు వచ్చాయి.
ఇలాంటి వాటితో కంపేర్ చేసి చూసినప్పుడు.. అచ్చంగా.. విజేత కంటె ఎక్కువగా ఇతరులే లబ్ధి పొందినట్టు మనకు అర్థమవుతుంది. ఆ రకంగా బిగ్ బాస్ 4 విజేతగా గెలిచినా.. అభిజీత్ పెద్దగా బావుకున్నది ఏమీ లేదని, అన్యాయం జరిగిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
.