చిత్తూరు జిల్లా తొట్టంబేడు తహసీల్దారు కార్యాలయంపై తిరుపతి అవినీతి నిరోధకశాక అధికారులు దాడులు చేశారు. భూ అక్రమామాలకు సంబధించి పలు కీలక రికార్డులను స్వాధీనం చేసుకుని తహసీల్దారు పరమేశ్వరస్వామిని ప్రశ్నిస్తున్నారు.
సాక్ష్యాలు దొరికితే పరమేశ్వరస్వామిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
తొట్టంబేడు తహసీల్దారు కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ఎంతో విలువైన ప్రభుత్వ భూములను రెవిన్యూ శాఖ వారు అడ్డుగోలుగా పరాధీనం చేశారు. ముఖ్యంగా తొట్టంబేడు, కాసరం, చిట్టత్తూరు, తంగేళ్లపాళెం, రామచంద్రాపురం, ఎల్ ఐసీ కాలనీ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూమిని అడ్డుగోలుగా పంచి పెట్టారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో సొమ్ము చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.
చాలా గ్రామాల్లో రికార్డులు తారుమారు చేశారు. ఈ భూ వివాదాల నేపథ్యంలో గత ఏడాది దుర్గాప్రసాద్ అనే ఒప్పంద కంప్యూటరుల ఆపరేటరు ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు తహసీల్దారు పరమేశ్వరస్వామి కారణమంటూ అతడు లేఖ కూడా రాశాడు. ఈ ఘటనపై శ్రీకాళహస్తి 2వ పట్టణ పోలీసులు పరమేశ్వరస్వామిపై కేసు కూడా నమోదు చేశారు.
అయితే రాజకీయ ఒత్తిళ్లతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక ఇటీవల కాలంలో తొట్టంబేడు మండలంలో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరుగుతున్నాయి. ఈ అక్రమాలపై పత్రికల్లో వరుస కథనాలు ప్రచురితం అవుతున్నప్పటికీ రెవిన్యూశాఖ ఉన్నతాధికారులు ఏ కారణంగానో చర్యలు తీసుకోవడం లేదు.
ఈ పరిణామాలు నిశితంగా పరిశీలించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు చేశారు. భూ అక్రమాలకు సంబంధించి వీరికి కీలక సమాచారం లభించినట్లు తెలిసింది.
ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మొత్తం మీద తొట్టంబేడు రెవిన్యూ శాఖ అవినీతి డొంక కదులుతుందని పలువురు అంటున్నారు.
.