‘‘తెలుగువాడు చాలా ఏళ్ళ కిందటే వివిధ దేశాల్లో రాజ్యాలు స్థాపించినవాడు’’.
ఈ మాట వింటే నేటి ఆంధ్రులకి పట్టలేనంత ఉత్సాహం వస్తుంది. నాటి తెలుగు జెండా రెపరెపలు ఏమిటో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలుగుతుంది. అదే జరిగితే డి.పి. అనురాధ కృషి ఫలించినట్లే!
ఎవరీ అనురాధ?
శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియా, కంబోడియా వంటి దేశాల్లో పర్యటిస్తూ అక్కడి తెలుగుజాతి ఆనవాళ్ళపై పరిశోధన చేస్తున్నారు. అలాగని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గానీ, మన ఘనమైన విశ్వవిద్యాలయాలు గానీ ఆమె శ్రమ వెనక లేరు. అనురాధ ఒక్కరే ఒంటరిగా ఆయా దేశాల్లో అలనాటి ఆంధ్రజాతి అస్తిత్వపు పునాదుల్ని పట్టుకుంటున్నారు. ఆంధ్రుడి అడుగుజాడల్ని తెలుసుకుంటున్నారు. ఆ వివరాలతో ‘జగమునేలిన తెలుగు- గోదావరి నుంచి జావా దాకా’ అనే పుస్తకాన్ని రచించారు.
ఈ పుస్తకం చదివితే తెలుగోడి పూర్వవైభవం తెలుస్తుంది. ఏళ్లతరబడి ప్రవాస ఆంధ్రులు నాయకత్వ లక్షణాలతో సామ్రాజ్య స్థాపకులు అయ్యారని అర్థమవుతుంది.
చరిత్రను కేవలం చరిత్రగా చెబితే మనసుకి ఎక్కదు. ఊహలతో రాస్తే భలే బాగుంటుంది కానీ వాస్తవ దూరం అవుతుంది. కాబట్టి చారిత్రక శకలాలకు కాల్పనిక శైలినిజోడిస్తే- చేదు మాత్రకు తీపి పొర అవుతుంది. అప్పుడు చదువరి గుండె పొరలో తరం తరం నిరంతరం మిగిలిపోతుంది. అందుకే ఈ పుస్తకాన్ని నవలగా రాశారు. పాత్రలు కల్పితం కానీ కథనం, వివరం అన్నీ అచ్చమైన వాస్తవాలు.
ఇలా చరిత్రను కల్పనను కలగలిపి రాయడమే చారిత్రక కావ్యం. సంస్కృతంలోని కల్హణుడి ‘రాజతరంగిణి ఇలాంటి రచనే. తెలుగులో శ్రీనాథుడు, ఏకామ్రనాథుడు, కాసెసర్వప్ప, విశ్వనాథ నాయకుని స్థానాపతి లాంటి వారు చారిత్రక కావ్యాలు రచించారు. అయితే అవన్నీ తెలుగు వారి గత చరిత్రను తవ్వి తీసినవి మాత్రమే. ఆధునిక యుగంలో భావరాజు వేంకట కృష్ణారావు ‘ప్రాచీనాంధ్ర నౌకాజీవనము’ (ఇంగ్లీషులో Maritime History of Ancient Andhra అనే అనువాద రచన) లాంటి రచనలు తెలుగువారు సముద్రయానం చేసి ఏయే దేశాలు వెళ్లి ఏయే రాజ్యాలు స్థాపించారో చెబుతున్నాయి.
ఆ పరంపరలో మరింతగా చెప్పుకోదగ్గ పుస్తకం డి.పి. అనురాధ ‘జగమునేలిన తెలుగు’ పుస్తకం.
తానే స్వయంగా దేశాలు తిరిగి శిల్పాల్ని, చిత్రలేఖనాల్ని, శాసనాల్ని, వాస్తుని, నామవాచకాల్ని, లిపుల్ని- ఆధారంగా చేసుకుని ఒళ్లంతా కళ్లు చేసుకుని సాక్ష్యాలు పట్టుకొని ఆనందపారవశ్యంతో తెలుగు వాడి గొప్పను తెలియచెప్పటం గర్వించదగ్గది.
పెళ్లయి పిల్లలతో జర్నలిస్టుగా వృత్తి బాధ్యతలతో అనురాధ ఇంత భారాన్ని మోయడం అభినందించదగ్గది. బాధ్యతలు కాళ్లకు అడ్డుపడుతుంటే పక్క ఊర్లోని పుట్టింటికి వెళ్ళడానికి కుదరకపోవచ్చు ఆడవారికి. అలాంటిది దేశం కాని దేశాలకు అప్పుడప్పుడు ఒంటరిగా, ఇంకొకప్పుడు కుటుంబంతో పైగా సొంత డబ్బులతో పర్యటించి ఈ పుస్తకం రచించడం గ్రేట్.
గ్రంథం వివరాలు :
జగమునేలిన తెలుగు
(అమ్మనుడి మాసపత్రికలో సీరియల్‌గా వచ్చిన నవల)
రచయిత్రి : డిపి అనురాధ
ప్రచురణ : తెలుగుజాతి ట్రస్టు
8-386, జీవకభవనం, అంగలకుదురు (పోస్టు), తెనాలి – 522 211,
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
మొబైల్ : 94404 48244
ఈమెయిల్ : ammanudi@gmail.com, editorammanudi@gmail.com
ప్రతులకు : పైచిరునామాతో పాటు.. అన్ని నవోదయ పుస్తక విక్రయ కేంద్రాలు
అలనాటి ఆంధ్రుల ప్రతిభ అసామాన్యం. కొలనుపాక, వరంగల్, పాలంపేట, ఘంటసాల, అమరావతి, నాగార్జునకొండ, మాచర్ల, చేజర్ల, జగ్గయ్యపేట లాంటి తెలుగు ప్రాంతాలే కాదు కంచి, మహాబలిపురం, తంజావూరు, మదురై, రామేశ్వరం అజంతా, ఎల్లోరా, సాంచీ స్తూపం, స్తూపం చుట్టూ ద్వారాలు ఇలా ఎన్నెన్నో ఆంధ్రశిల్పులు నిర్మించినవే. బర్మా, బాలి ద్వీపం, జావా ద్వీపం, కాంభోజ దేశం (కాంబోడియా) లలో ఆంద్రుల రాజ్యాలు ఏర్పరిచినట్లు చరిత్రలో స్పష్టంగా ఉంది.
ఇండోనేషియాలోని బొరొబుదూర్లో 9వ శతాబ్దంలో శైలేంద్ర వంశపు రాజులు గుళ్లు కట్టారు. ఇక్కడి జ్ఞాన బుద్ధుడు, ప్రజ్ఞాపరిమితాదేవి, అలంకార శిల్పం, సాంఘిక శిల్పం అన్నీ నాగార్జునకొండ శిల్పాలను పోలి ఉన్నాయి. అమరావతిలోని ఆంధ్ర శాతవాహన శిల్పానికి దగ్గరగా ఉన్నాయి. జకార్తాలోని తరుమ నగర రాజ్య స్థాపకులు అచ్చంగా తెలుగువారే. అప్పటి విజయేంద్రవర్మ పాలించిన చంపా రాజ్యమే నేటి వియత్నాం.
తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుడు (క్రీస్తుశకం 1019 నుంచి 1061) కాలంలో మోటుపల్లి, కృష్ణపట్నం ఓడరేవుల నుంచి ఆగ్నేయాసియా దేశాలకు వలసలు, ఎగుమతులు సాగాయి. ఆంధ్రుల నావలు రోమన్, పర్షియన్, ఈజిప్టులకు, సువర్ణ (థాయిలాండ్), జావా (ఇండోనేషియా) లాంటి ద్వీపాలకు వర్తకులను చేరవేసేవి. కాంబోడియా దేశంలో ఆంధ్రుడు ఆ దేశపు రాజుకుమార్తెను వివాహమాడి అక్కడి రాజ్యవంశానికి ప్రధాన పురుషుడు అయ్యాడు.
ఇలా నెమరేసుకుంటూ వెళితే ఎన్నెన్ని ప్రతిభాపాటవాలో!
ఇవన్నీ ఇన్నాళ్లు చరిత్రలో చదువుకున్నాం. మనమీద మనకే సందేహంతో ‘ఇవన్నీ నిజాలు కాదేమో- అతిశయోక్తులేమో’ అని ముడుచుకు కూచుంటాం.
సరిగ్గా అదే సమయంలో వీటికి ఋజువుల్ని చూపిస్తుంది ‘జగమునేలిన తెలుగు’ పుస్తకం.
‘‘ఎన్నడో వెనకటి జన్మల రుణం
తీర్చుకోవాలి అనిపించే తనం
ఎవ్వరికి చుట్టాలై పుట్టామో అన్వేషిస్తుంటే
కొత్తగా మనకే మన పరిచయం’’
అది ఈ పుస్తకం చదివితే కలిగే అనుభూతి. అందుకే అనురాధ ఈ పుస్తకానికి ‘చరిత్రలోకి అన్వేషణ- నవల’ అన్న శీర్షిక అందించారు.
‘గతమెంతో ఘనం నీది- వర్తమానమేమది’ అన్న ప్రశ్న గుండెల్ని కదిపేస్తుంది ఈ పుస్తకం చదివాక!
ఇకపై ఆయా దేశాలకు వెళ్లాలని, మన తాతముత్తాతల చెరగని పాద ముద్రలని స్పృశించాలని ఉత్తేజం కలుగుతుంది ఈ పుస్తకం చదివి మూశాక.
..ఆకెళ్ల రాఘవేంద్ర
Discussion about this post