కొన్ని సందర్భాల్లో ‘ఎవరు గెలిచారు అనేది కాదన్ననయ్యా.. ఎలా పోరాడారు?’ అనే అంశం ముఖ్యంగా కనిపిస్తుంది. ప్రత్యర్థిలో కలిగించిన భయం కూడా ఒక్కోసారి విజయంతో సమానంగా అనిపిస్తుంది. ఆ దృష్టితో చూసినప్పుడు.. బద్వేలు ఉపఎన్నికలో బీజేపీ తరఫున తలపడుతున్న సురేష్ చాలా వరకు విజయం సాధించినట్టే. ఈ అభ్యర్థి గెలవకపోవచ్చు.. కానీ.. తన పార్టీకి చాలా పరిమితమైన ప్రజాదరణ ఉన్న నియోజకవర్గంలో తొడకొట్టి.. ప్రజలు తనవైపు తిరిగిచూసేలా చేయగలిగారు.
ఆస్తి, హంగు, ఆర్భాటం లేకుండా రాజకీయాల్లోకి రావడం ఈరోజుల్లో సాధ్యమా? సాధారణంగా సాధ్యం కాదనే సమాధానమే ప్రజల నుంచి వస్తుంది. కానీ బద్వేల్ ఉప ఎన్నికలో పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి పనతల సురేష్ నేపథ్యం చూస్తే.. పేదలకూ రాజకీయాల్లో స్థానం ఉంటుందని అర్థమవుతుంది. ప్రజల కోసం పనిచేసే నాయకుడిని బీజేపీ టికెట్ ఇవ్వడం, ఎన్నికల ఖర్చునూ పార్టీనే భరించడం చూస్తే.. రాజకీయాల్లో ధనబలం, కండబలానికే కాకుండా అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలనే గట్టి సంకల్పం ఉన్నా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అర్థమవుతుంది.
రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఆర్థికంగా మరీ బలంగా ఉన్న అభ్యర్థులు సాధారణంగా ఉండరు. బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం అందుకు మినహాయింపేమీ కాదు. ఆర్థికంగా మరీ బలంగా లేని అభ్యర్థులుంటారు కానీ.. కానీ ఆర్థికంగా మరీ బలహీనంగా ఉన్న అభ్యర్థులు ప్రధాన పార్టీల తరఫున ఉండరు. కానీ బీజేపీ అభ్యర్థి పనతల సురేష్ ఆర్థికంగా మరీ బలహీనంగా ఉన్న అభ్యర్థి. 32 సంవత్సరాల సురేష్‌కు పాన్‌కార్డు ఉంది కానీ… ఇప్పటి వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయలేదు. ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయదగినంత ఆదాయం అతనికి లేదు. బతుకుదెరువు కోసం చేసుకుంటున్న చిన్నాచితకా వ్యాపారం అంత ఆదాయం ఇవ్వడం లేదు. సెంటు భూమి కాని, పూరి గుడిసె కానీ లేవు. కారు సంగతి వేరే చెప్పక్కర్లేదు.
విద్యార్థి ఉద్యమాల్లో ఎగిసిపడిన నాయకుడిగా కడప జిల్లాలో విద్యార్థిలోకానికి సురేష్ సుపరిచితుడు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) నాయకుడిగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేసి పలు సందర్భాల్లో విజయవంతం అయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇటు విద్యార్థిలోకాన్ని, అటు యువత మమేకం కావడానికి సురేష్ నాయకత్వం కారణమని కడప జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు. ధర్నాలు, దీక్షలు, ఆందోళనలు చేసిన సురేష్ మీద పోలీసులు పలు కేసులు పెట్టారు. పైసా ఆస్తి లేని సురేష్‌కు ఈ కేసులే ఆస్తి.
ఇటు కడప జిల్లాలోనే కాకుండా ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) ఏబీవీపీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన సురేష్ నాయకత్వానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి. విద్యార్థి ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి అడుగుపడింది. సురేష్‌కు బీజేపీ సాదర స్వాగతం పలికింది. బీజేపీలోకి వచ్చిన కొద్ది రోజులకే పార్టీ యువజన విభాగం ‘భారతీయ జనతా యువమోర్చ’ (బీజేవైఎం) జాతీయ కార్యదర్శిగా బాధ్యత అప్పగించారు.
2019 సాధారణ ఎన్నికల్లో కడప జిల్లా రైల్వే కోడూరు శాసనసభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అభ్యర్థిగా సురేష్‌ను బీజేపీ ఎంపిక చేయడం వెనక సమరశీల పోరాట చరిత్ర ఉంది. పార్టీలో చాలామంది సీనియర్లు, ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు ఉన్నా.. అవకాశం మాత్రం సురేష్‌కు దక్కింది. బద్వేల్ మాజీ ఎమ్మెల్యే జయరాములు కూడా పార్టీలో ఉన్నా.. పార్టీ కోసం, ప్రజల కోసం నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడిని అభ్యర్థిగా నిలబెట్టాలని కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం సురేష్‌కు కలిసొచ్చింది.
చేతిలో చిల్లిగవ్వ లేకుండానే గట్టిపోటీ
బద్వేల్ ఉప ఎన్నికలో అధికార వైఎస్సార్‌సీపీ విజయం కోసం పెద్ద సంఖ్యలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు రంగంలోకి దిగారు. డబ్బు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఎన్నాళ్లగానో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని, వాటిని పూర్తి చేసే బాధ్యత తమది అని హామీలు గుప్పించారు. పలు పనులకు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రచారానికి, హంగుఆర్భాటాలకు, విందులు వినోదాలకు భారీగా ఖర్చు చేస్తున్నారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
వందల సంఖ్యలో లగ్జరీ కార్లు బద్వేల్ నియోజకవర్గంలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వాహనాలకు అయిన డీజిల్ ఖర్చుతో సమానమైన మొత్తం కూడా బీజేపీ ఖర్చు చేయలేకపోతోంది. కానీ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి ప్రచారం చేపట్టారు. బీజేపీ అభ్యర్థి- సొంతంగా ఒక్క రూపాయి పెట్టకపోయినా, పార్టీ నాయకత్వం ఎన్నికల ప్రచారం వ్యయాన్ని భరిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు ప్రచారాన్ని తమ భుజాల మీద వేసుకొని అంకితభావంతో పనిచేయడం గమనార్హం. ప్రజల నుంచి పార్టీకి ఆదరణ లభించింది.
అధికార వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ ప్రచారపర్వంలో ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు వైఎస్సార్‌సీపీ ప్రచారాన్ని ముందుండి నడిపించారు. ఆర్థిక పరమైన అంశాలు కూడా వారే చూసుకున్నారు. మరి ఆమెకు డబ్బు లేదనుకుంటే పొరపాటే. ఆమె స్థిరచరాస్తుల విలువ రూ. 3 కోట్ల పైమాటే. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలమ్మకు కూడా దాదాపు ఇదే స్థాయి ఆస్తిపాస్తులున్నాయి.
బద్వేలుకు చేసిందేమీ లేదు
సుదర్ఘీకాలంగా వైఎస్సార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బద్వేల్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, పులివెందుల మీద ఉన్న శ్రద్ధ బద్వేల్ మీద లేదని బీజేపీ అభ్యర్థి సురేష్ చేసిన విమర్శలకు అధికార పార్టీ నుంచి సమాధానం రాలేదు. బద్వేల్ అభివృద్ధికి కనీస శ్రద్ధ కూడా ముఖ్యమంత్రి జగన్ తీసుకోకపోవడాన్ని ప్రచారంలో బీజేపీ గట్టిగా ప్రశ్నించినా.. దానికి జవాబుచెప్పి చిక్కుల్లో పడకూడదనే వ్యూహాన్ని వైఎస్సార్‌సీపీ అనుసరించింది. రాష్ట్రమంతా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మళ్లీమళ్లీ చెప్పడానికే ఆ పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది. బీజేపీ ఎత్తుకున్న నినాదానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినట్లు కనిపించింది.
పోటీ వైసీపీ, బీజేపీ మధ్యనే
పోటీలో ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థి లేకపోవడంతో.. అధికార పార్టీ విజయం నల్లేరుమీద నడక అని ఆ పార్టీ నేతలు భావించారు. సునాయాసంగా లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమని గట్టిగా అనుకున్నారు. కానీ బీజేపీ గట్టిగా ప్రచారం చేయడం, పార్టీ నాయకత్వం కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం, పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి లాంటి నాయకులు కొద్ది రోజులు బద్వేల్‌లో మకాం వేసి ప్రచారాన్ని పర్యవేక్షించడం.. బీజేపీకి కలిసొచ్చాయి. కేంద్ర మంత్రి మురుగన్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు తదితరులు ఢిల్లీ నుంచి వచ్చి ప్రచారం చేశారు.
ఇవి కూడా చదవండి :
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
స్వామి పరిపూర్ణానంద, తెలంగాణ ఎమ్మెల్యే రఘునందనరావు తదితరులు పార్టీ ప్రచారంలో పొల్గొన్నారు. సునాయాస విజయం అనుకున్న వైసీపీ నేతలు.. జోరు పెంచి గట్టిగా ప్రచారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పోటీ వైసీపీ, బీజేపీ మధ్యనే జరుగుతోంది. కాంగ్రెస్ పోటీలో ఉన్నా… ప్రచారంలో ఎక్కడా కాంగ్రెస్ జెండా కనిపించకపోవడం గమనార్హం. స్టార్ క్యాపెయినర్లుగా 20 మంది ప్రచారం చేస్తారని కేంద్ర ఎన్నికల సంఘానికి జాబితా సమర్పించిన కాంగ్రెస్.. అందులో ఒక్కరిని కూడా ప్రచారానికి పంపించకపోవడం గమనార్హం.
ఎన్నికల సమరంలో విజయం ఎవరో ఒక్కరినే వరిస్తుంది. ఓటమికి సిద్ధమై బరిలోకి దిగిన యోధుడు సురేష్. అధికార పార్టీని పరుగులు పెట్టించడమే అతని విజయంగా స్థానికులు భావిస్తున్నారు.
.

Discussion about this post