బ్రిటిషుకాలంలో మొదలైన టీటీడీ బోర్డు పతనం ఎలా జరిగిందంటే
మొదటి భాగం చదవండి
ఒకసారి టీటీడీ బోర్డు సభ్యత్వాలకు ఆధ్యాత్మికతకు మించిన ప్రాధాన్యం, ప్రయోజనం ఉంటుందని అందరికీ అర్థమైన తర్వాత.. పరిణామాలు చాలా వేగంగా మారుతూ వచ్చాయి. అప్పటిదాకా ఒక ఎత్తు. ఆ తర్వాత ఒక ఎత్తు. బోర్డు ఇప్పుడున్న స్థితికి దిగజారడం అనేది చాలా వేగంగా జరిగిపోయింది.
నిర్దిష్టంగా ఫలానా పార్టీ అని చెప్పడానికి వీల్లేదు. టీటీడీ బోర్డు ప్రతిష్ట దిగజారడంలో అన్ని పార్టీలూ తమ వంతు పాత్ర పోషించాయి. తెలుగుదేశం, కాంగ్రెస్, ఇవాళ్టి వైఎస్సార్ కాంగ్రెస్ లకు సమభాగస్వామ్యం ఉంది.
ఎన్టీఆర్ కాలంలోనే బోర్డు రూపు మారింది
ఆధ్యాత్మికత భగవత్సేవ లాంటివి బోర్డు సభ్యులు కాగోరే వారికి అర్హతలుగా నిలిచే రోజులు మారాయి. ఆశ్రితులకు, వ్యాపార లావాదేవీల్లో తమకు తోడ్పడే వారికి ఈ పదవులను కానుకలుగా సమర్పించే ధోరణులు ఎన్టీఆర్ కాలంలోనే మొదలయ్యాయి. రామారావుకు అప్పటికే చాలాకాలంగా వ్యక్తిగత ఆడిటర్లుగా ఉన్నటువంటి బ్రహ్మయ్య అండ్ బ్రహ్మయ్య కంపెనీకి చెందిన సీతారామయ్య టీటీడీ ఛైర్మన్ కావడం ఈ కొలబద్ధల మీదనే జరిగింది. తర్వాతి కాలంలో ఎన్టీఆర్ జమానాలోనే.. రాజకీయ పునరావాసంగా కూడా టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవి మారింది. కళా వెంకట్రావు, కాగిత వెంకట్రావు లాంటివాళ్లు ఛైర్మన్లు అయ్యారు. ఏడాది మాత్రమే ఉండే పదవీకాలాన్ని రెండేళ్లకు పెంచారు.
రానురాను ఈ పదవులకు రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయి. వేంకటేశ్వరుని దర్శనానికి భక్తుల రద్దీ పెరుగుతూఉండగా.. దర్శనాలు అపురూపం అయ్యాయి. తదనుగుణంగానే వ్యవహారం మారుతూ వచ్చింది.
బోర్డు దారి మళ్లడంలో తిక్కవరపు శకం..
టీటీడీ బోర్డు దారి మళ్లడం.. రాజకీయ పదవులు కావడానికి తోడుగా.. వ్యాపార ప్రయోజనాలకు ఈ పదవులను అడ్డుపెట్టుకోవడం వంటి అనేకానేక భ్రష్టాచారాలకు ఆద్యుడు కేంద్ర మాజీమంత్రి తిక్కవరపు సుబ్బరామిరెడ్డి. 1990 లో ఆయన టీటీడీ ఛైర్మన్ అయ్యారు. తన వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగపడే బ్యాంకర్లను, ఇతర ప్రముఖులను తిరుమలకు ఆహ్వానించి.. ప్రోటోకాల్ దర్శన నియమాలకు విరుద్ధంగా గౌరవసత్కారాలు కల్పించే పద్ధతికి ఆయన శ్రీకారం చుట్టారు. మహేంద్ర అండ్ మహేంద్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి సంస్థలకు చెందిన వారికి తిరుమలలో రాజపూజ్యం లభించింది. స్వామి దగ్గర శేషవస్త్రం కప్పించడం వంటి నియమవిరుద్ధమైన పనులు చేయడంతో.. అప్పటి ఈవో వెంకటపతిరాజు.. అర్చకులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
తాను ఛైర్మన్ గాఉన్నప్పటికీ తిక్కవరపు సుబ్బరామిరెడ్డి మాట సాగలేదు. ఆయన ఓ ప్రత్యామ్నాయం వెతుక్కున్నారు. తాను బయట దుకాణాల్లో కొన్న కండువాలను, అర్చకుల ద్వారా.. తిరుమల ఆలయంలోని రంగనాయకమండపంలో.. తన వ్యక్తిగత అతిథులకు కప్పించడంలో ఆ రకంగా ఆలయ మర్యాదలతో దర్శనం జరిగినట్లుగా వారిని మభ్యపుచ్చడం దారిగా ఎంచుకున్నారు. టీటీడీ ఛైర్మన్ గా ఉంటూ సంస్థ ఖర్చుతో ఛైర్మన్ గా తనకోసం అప్పటివరకూ లేని ఖరీదైన ఏసీ కారు కొనిపించడం కూడా అప్పట్లో వివాదంగా మారింది.
సుబ్బరామిరెడ్డి కాలంలోనే సిఫారసు ఉత్తరాల జోరు పెరిగింది. అదే సమయంలోనే సిఫారసు ఉత్తరాలను సిబ్బంది ఖాతరు చేయకపోవడం కూడా ప్రారంభమైంది. సభ్యులందరూ రికమెండేషన్ లెటర్లిచ్చే జోరు పెరిగింది, అదివరలో బోర్డు సిఫారసులు కూడా గదులు పొందడానికే తప్ప, దర్శనాలకు పెద్దగా ఉపయోగపడేవి కాదు. తిక్కవరపు లెటర్ల ఉధృతికి సిబ్బంది బెంబేలెత్తిపోయేవారు. ఛైర్మన్ లెటర్ అంటేనే పక్కన పెట్టేసేవారు. ప్రత్యేకంగా ఫోను వస్తే తప్ప పట్టించుకోని రోజులు కూడా ఆయన హయాంలోనే వచ్చాయి.
వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత.. సిఫారసుల జోరు మరీ పెరిగింది. ఆశ్రితులు, భక్తితత్పరత, ఆధ్యాత్మికతలతో ఏమాత్రం సంబంధం లేని వారు కూడా బోర్డు సభ్యులు కాగల పోకడలు ప్రారంభం అయ్యాయి. కులాల తూకం చూసుకుంటూ ఎవరిని పడితే వారిని సభ్యులు చేయడం మొదలైంది. ఆ జమానాలోనే.. బోర్డు సభ్యులు తమ సిఫారసు ఉత్తరాలను నల్లబజారులో అమ్ముకోవడం కూడా ప్రారంభం అయింది. ఈ పెడపోకడలు పెచ్చరిల్లడంతో.. బోర్డు సభ్యుల సిఫారసు ఉత్తరాల అమ్మకాల గురించి విచారించడానికి విజిలెన్స్ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. దాని నివేదిక ఇప్పటిదాకా బయటకు రాలేదు.
ఇవి కూడా చదవండి :
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
రోజా సీటు కింద పెద్దిరెడ్డి కుంపటి రాజేస్తున్నారా
మన విలువను వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవడం అవసరం
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
పవన్ కల్యాణ్ పై పోసాని ఆగ్రహం న్యాయమే
సభ్యులకు రోజుకు 20 లెటర్లు ఇవ్వగలిగే వెసులుబాటు కట్టబెట్టడంతో.. వారిలో చాలా మంది యథేచ్ఛగా అమ్మకాలతో చెలరేగిపోవడం ప్రారంభించారు.
కొండమీద తాము ఇచ్చే సిఫారసు లెటర్లను సిబ్బంది పట్టించుకోవడం లేదు గనుక.. మంత్రులు తమ తరఫున ప్రత్యేకంగా సిబ్బందిని తిరుమలలోనే ప్రత్యేకంగా నియమించుకోవడం కూడా మొదలైంది. కేవలం పైరవీలు, సిఫారసు ఉత్తరాల వ్యవహారాలు చూడడానికి మాత్రమే వారు ఉండేవారు.
ఇప్పుడు పైరవీల విశ్వరూపమే..
కాలంతో పాటూ పైరవీలు కూడా పెరిగాయి. చంద్రబాబునాయుడు కాలం వరకు 17గా ఉన్న బోర్డు సభ్యుల సంఖ్య జగన్మోహన్ రెడ్డి రాగానే 27కు పెరిగింది. ప్రత్యేక ఆహ్వానితుల్ని రెండో దఫాలో ఆయన 51కి పెంచేశారు. (ఆ ఉత్తర్వులను కోర్టు సస్పెండ్ చేసింది). తదనుగుణంగా రేగుతున్న వివాదాలూ అన్నీ అందరికీ తెలుసు.
మంత్రులు రోజుకు అయిదు లెటర్లకు మించి ఇవ్వకుండా చంద్రబాబు అప్పట్లోనే కట్టడి చేశారు. సభ్యులు ఒక్కొక్కరు రోజుకు 20 లెటర్లకు పైగా ఇచ్చే అవకాశం ఉంది. స్థానికంగా ఉండే జిల్లాలోని ఎమ్మెల్యేలు ఇచ్చే లెటర్లు అదనం. ఇతర రాష్ట్రాల మంత్రుల లెటర్లను కూడా పరిగణిస్తున్నారు.
ప్రతి లెటరులోనూ ఆరుగురి దర్శనానికి సిఫారసు చేసే అవకాశం ఉంటుంది. ఇలా చిన్నా చితకా అన్నీ కలిపి లెక్కలు తీస్తే.. రోజుకు వేలాదిమంది భక్తులు సిఫారసు ఉత్తరాలపై ప్రత్యేక దర్శనాలు చేసుకునే వారే కనిపిస్తున్నారు.
బోర్డు నిర్ణయాలలో పాల్గొనే అవకాశం లేకపోయినా.. ప్రత్యేక ఆహ్వానితులుగా దర్శనానికి సంబంధించిన ప్రోటోకాల్ మొత్తం ఉంటుందని ప్రభుత్వం జీవోలో చాలా స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో.. 51 మంది కూడా రోజూ లెటర్లు ఇవ్వడం ప్రారంభిస్తే.. ప్రత్యేక దర్శనాలకు వారి సిఫారసుల తాకిడి ప్రతిరోజూ మరో ఆరువేలకు పైగానే పెరుగుతుంది. బహిరంగ మార్కెట్లో లెటర్ల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయంటే అలా జరగకుండా ఎలా ఉంటుంది? గతంలో అయితే ఎమ్మెల్యేలు, మంత్రులు సంతకాలు కూడా చేసిన లెటర్లు తిరుపతి హోటళ్లలో, ఇతర పైరవీకారుల వద్ద విచ్చలవిడిగా దొరుకుతూ ఉండేవి కూడా.
పైరవీలకు దేవుడే దారి..
ఒకప్పట్లో తిరుమలేశుని లడ్డూ ప్రసాదానికి చాలా విలువ ఉండేది. లడ్డూ తీసుకువెళ్తే చాలు.. రాజధానుల్లో పనులు చక్కబెట్టుకోవడానికి అది సులువైన కానుకగా ఉండేది. కాలక్రమంలో లడ్డూ ప్రసాదాన్ని స్వీట్ స్టాల్ సరుకు లాగా మార్చేశారు. ఇందుకు నిర్దిష్టంగా కారణం ఒకరూ అని చెప్పలేం. ఢిల్లీ, హైదరాబాదు, చెన్నై ఇలా రకరకాల ప్రదేశాల్లో లడ్డూలు విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. ధర పెరిగింది.. లభ్యత పెరిగింది.. వాటి ప్రాధాన్యం తగ్గింది.
ఇప్పుడు దేవుడి దర్శనాలే పైరవీలకు దారి అయ్యాయి. టీటీడీ బోర్డులో ఏదో ఒక పదవి దక్కించుకుంటే.. తమకు ఉపయోగపడగల వారందరికీ దర్శనాలు చేయించి.. ఆ మెహర్బానీ ద్వారా స్వకార్యాలు చక్కబెట్టుకోవడం అనేది అందరికీ ఎజెండా అయింది. కరోనా ప్రభావిత, నియంత్రిత దర్శనాలు మాత్రమే కొనసాగుతున్న సమయంలో కూడా.. రోజుకు నాలుగువేలకు పైగా సిఫారసు దర్శనాలు సాగేవంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ పోకడలకు దేవదేవుడు ఎప్పుడు తెరవేస్తాడో.. లేదా ఇవి మరింతగా పెచ్చరిల్లి భగవద్దర్శనం అనేదే ఒక పైరవీ వ్యవహారంగా మారి విలువ పలచబడిపోతుందో.. తెలియని సంగతి. సిఫారసు ఉత్తరాలకే అవకాశం లేని బోర్డు సభ్యత్వ పదవి ఇచ్చే ధైర్యం- సాహసవంతుడు అయిన ఏ ముఖ్యమంత్రి అయినా చేస్తే.. అప్పుడు కేవలం భగవంతుడి దృష్టితో మాత్రమే టీటీడీ పదవిని కోరే వ్యక్తులు వస్తారని ఒక ఆశ.
కానీ అలాంటి ఆశ, కుందేటి కొమ్ము సాధించడం వంటిది. ఇసుకను పిండి నూనె తీయడం వంటిది. అంతలేసి ఆశలు పెట్టుకుంటే దక్కేది భంగపాటే..
.. బీరక రవి
సీనియర్ పాత్రికేయులు
Discussion about this post