‘పవన్ కల్యాణ్ vs పోసాని కృష్ణమురళి’ అనే వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ హాట్ గా నడుస్తోంది. తాజా ఎపిసోడ్‌లో.. పోసాని హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన పట్ల ప్రవర్తిస్తున్న బెదిరింపు వైఖరిని గురించి చెప్పారు. ఆ సందర్భంగా.. పవన్ మీద కూడా బీభత్సమైన తిట్ల వర్షం కురిపించారు. అయితే.. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ఆయన మాటలు కొంత గీతదాటినట్టుగానే ఉన్నాయి గానీ.. అది కూడా ధర్మాగ్రహమే అని ఒప్పుకోవాలి. పవన్ ఫ్యాన్స్ కు చేదుగా అనిపించినా అది నిజం.
జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద జనసేనాని.. తీవ్రస్థాయిలో విరుచుకుపడితే.. జగన్ మీద ఈగవాలినా సహించని నాయకులందరూ ఒక్కపెట్టున దాడిచేశారు. మాటలతో విరుచుకుపడ్డారు. ఎవరిశైలిలో వారు సర్కాస్టిగ్గానూ, సీరియస్ గానూ పవన్ కల్యాణ్ ను దుమ్మెత్తి పోశారు. మంత్రులందరూ పవన్ ను తిట్టడానికి ఎంతో స్పెషల్ ఇంటరెస్ట్ చూపించారంటే అతిశయోక్తి కాదు. ఆ క్రమంలోనే సినీ పరిశ్రమకే చెందిన వ్యక్తి, జగన్ పార్టీలో ఒక కీలక కార్యకర్త అయిన పోసాని కృష్ణమురళి కూడా పవన్ ను నిశితంగా విమర్శించారు. దాని పర్యవసానాలు మాత్రం.. చాలా జుగుప్సాకరంగా మారాయి.
పవన్ ను పోసాని తిట్టిన తర్వాత.. సహజంగానే పవన్ కల్యాణ్ అభిమానులంతా ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయనకు ఫోను కాల్స్ రూపేణా, మెసేజీల రూపేణా తిట్ల వర్షం కురవడం సహజం. అయితే అందులో.. ఆయన భార్యకు పనిమనిషితో అక్రమ సంబంధం ఉన్నట్టుగా కొందరు మెసేజీలు పెట్టడం పోసానిని బాధించింది. ఆ ఆగ్రహంలో ఆయన విలేకర్ల సమావేశం పెట్టి.. ఆగ్రహంతో, ఆవేదనతో రెచ్చిపోయారు.
‘నీ భార్యకు నీ పనివాడితో అక్రమ సంబంధం ఉంది. అవునా కాదా?’ అంటూ తనకు మెసేజీలు పెట్టారని పోసాని అన్నారు. ఇది ఖచ్చితంగా విలువల అతిక్రమణమే. పవన్ ఫ్యాన్స్ చాలా నీచంగా, దుర్మార్గంగా ప్రవర్తించారని చెప్పాల్సిందే. అందులో ఏమాత్రం సందేహం లేదు. రాజకీయంగా ఎంత తీవ్రంగా తూలనాడుకున్నా.. ఆ వివాదాల్లో కుటుంబ సభ్యులను, మహిళలను వారి వ్యక్తిగత జీవితాలను లాగకుండా ఉండడమే కరెక్టు. అయితే ఫ్యాన్స్ గీత దాటారు.
కంటికి కన్ను అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నట్టుగా.. పోసాని కూడా అదే బాటలోకి వచ్చారు. ‘నువ్వు షూటింగులకు వెళ్లిన వెంటనే నీ భార్య నీ పనివాడితో అక్రమ సంబంధం పెట్టుకుంటుందట. విన్నాను. నిజమా కాదా? నీ పిల్లలు కూడా పనివాడికి పుట్టిన వారేనట నిజమా? కాదా?’ అంటూ రెచ్చిపోయారు. ‘నీకు ఒక కూతురుంది.. రేపు నీకు రక్తకన్నీరే’ అంటూ విమర్శించారు. ఇక తిట్ల విషయానికి వస్తే.. రాయడానికి వీల్లేని అసభ్యకరమైన తిట్లతో విరుచుకుపడ్డారు. కొంత కాదు.. చాలాచాలా గీత దాటారు.
పవన్ ఫ్యాన్స్ నుంచి తన మొబైల్ కు వచ్చిన మెసేజీ పట్ల పోసాని కృష్ణమురళి ఆవేదన చెందడం సహజం. కానీ.. ఫ్యాన్స్ పెట్టిన మెసేజీకి పవన్ కల్యాణ్ నే సాక్షాత్తూ బాధ్యుడిగా పరిగణించడం.. ఆయన మీద సూటిగా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మాత్రం సవ్యంగా లేదు. ఉభయ పక్షాలూ కొంత దిగజారి వ్యవహరించిన మాట నిజమే. కానీ, గీత దాటిన ఆ ఆగ్రహంలోనూ న్యాయం ఉందనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి :
Good Morning : జ్ఞానార్జనకు అయిదు మెట్లు
టీటీడీ ట్రస్టు బోర్డు ఏరకంగా భ్రష్టు పట్టిపోయిందంటే..
‘సేన చెడుగైన దండనాధుని తప్పు’ అని శతకకారుడు విలువలను ప్రవచించిన నేల మనది. జనసైనికులు దారి తప్పి ప్రవర్తిస్తే.. దానికి జనసేనాని బాధ్యత తీసుకోకపోతే ఎలా? మొదటి రోజున పోసాని చేసిన విమర్శలు పవన్ సైనికులకు కోపం తెప్పించి ఉంటే గనుక.. ఊరూరా ప్రెస్ మీట్ పెట్టి తూర్పారపట్టవచ్చు. ఎటూ సోషల్ మీడియా లో జనసైనికులందరూ యాక్టివ్ గానే ఉంటారు గనుక.. పద్ధతిగా పోసాని కృష్ణ మురళి విమర్శలను ఒక్కటొక్కటిగా తిప్పికొట్టవచ్చు. ఆ రకంగా తమ జనసేనాని పట్ల సంఘీభావం ప్రకటించి ఉండొచ్చు. కానీ వారు కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తూ నీచమైన విమర్శలు చేయడం చాలా పెద్ద తప్పు.
అలా జరిగిన తర్వాతనైనా పవన్ కల్యాణ్ జరుగుతున్న పరిణామాల పట్ల నొచ్చుకోలేదు. అభిమానుల్ని దారిలో పెట్టే ప్రయత్నం చేయలేదు. మామూలుగానే అలాంటి ఆలోచన ఆయనకు ఉన్నట్టు ఎన్నడూ కనిపించదు. ‘నేను కనుసైగ చేస్తే ఏమౌతుందో తెలుసా?’ అని పదేపదే అంటూ.. ఆయన తరచూ రెచ్చగొట్టే ధోరణిలోనే మాట్లాడుతుంటారు. అలాంటి నాయకుడు.. పోసాని కుటుంబసభ్యుల గురించి.. తన సైనికులు నీచమైన కామెంట్లు చేస్తే వాటిని ఖండిస్తారని అనుకోవడం భ్రమ.
‘నా భార్య గురించి అలా మాట్లాడితే.. నేను బాధపడకూడదా సార్.. నాకు దుఃఖం ఉండదా సార్.. దెబ్బ నాకు తగిలింది.. నొప్పి నాకే తెలుస్తుంది కదా సార్’ అంటూ ప్రెస్ మీట్ లో పోసాని అన్న మాటలు ఎవరినైనా ఆలోచింపజేస్తాయి. ఆ ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత కూడా.. ప్రెస్ క్లబ్ వద్దకే కొందరు పవన్ ఫ్యాన్స్ దూసుకువచ్చి పెద్దసంఖ్యలో ఉన్న పోలీసు బలగాలతో కూడా తలపడుతూ.. పోసానిని అసభ్యంగా దూషిస్తూ అతడిమీద దాడిచేయడానికి ప్రయత్నించడం కూడా జరిగింది.
పవన్ ఆగ్రహావేశాల ప్రసంగంలో ప్రభుత్వాన్ని తూర్పారపడుతూ రెచ్చిపోయినప్పుడు జనం రకరకాలుగా అనుకున్నారు. కొందరు ఆయనను సమర్థించడమూ, కొందరు ఆ ఆవేశాన్ని తిట్టిపోయడమూ జరిగింది. అదంతా గతించిపోయిన ఎపిసోడ్. కానీ తాజాగా పోసాని కృష్ణమురళి ఎపిసోడ్ విషయంలో.. పోసాని తిట్లను సహించలేని వారు కూడా, తప్పుపడుతున్న వారు కూడా.. పవన్ కల్యాణ్ తరఫున ఆయన జనసైనికుల దూకుడును, నీచత్వాన్ని అసహ్యించుకుంటున్నారు. పోసాని తిట్లలో ఆగ్రహం మాత్రమే కాదు దుఃఖం, న్యాయం కూడా ఉన్నదని గుర్తిస్తున్నారు. తన ఆవేశపూరిత ప్రసంగం నాటికంటె.. ఇవాళ్టి పరిణామాల తర్వాత.. పవన్ కల్యాణ్ మరింతగా పరువు కోల్పోయినట్లుగా తయారైంది.
.