తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలిలో చోటు అనేది.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరువేంకటేశ్వరుని సేవ చేసుకోవడానికి- ఎవరికైనా లభించగల అత్యున్నత అవకాశం. ప్రతి ఒక్కరూ దానిని తమ జీవితంలో ఒక అపూర్వమైన అవకాశంగానే భావిస్తారు. అయితే.. అలాంటి టీటీడీ బోర్డు పదవి.. ఇప్పుడు అనేక రకాలుగా విమర్శలకు గురవుతోంది ఎందుకు?
టీటీడీ పాలకమండలి సభ్యత్వం అనేది చాలా సంవత్సరాల కిందటి నుంచి రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. రాజకీయ పునరావాసం నుంచి నవతరంలో కొంత అప్ గ్రేడ్ అయి.. వ్యాపార, కార్పొరేట్ దళారీలకు అడ్డాగా కూడా మారుతోంది. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? భగవత్సేవకు అపురూపమైన ఈ అవకాశం రాజకీయ భ్రష్టాచారాల ఊబిలోకి కూరుకుపోవడం ఎప్పటినుంచి మొదలైంది?
టీటీడీ పాలకమండలి అనేది ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం గల తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిర్వహణ, భక్తుల సేవ తదితర వ్యవహారాల పర్యవేక్షణకు, తదనుగుణమైన నిర్ణయాధికారాలతో కలిపి ఏర్పడిన వ్యవస్థ. ఈ వ్యవస్థ ఇప్పటి రూపురేఖలు.. దాని మూలాల్లోని లక్ష్యాలకు, అప్పటి స్వరూప స్వభావాలకు పూర్తిగా భిన్నమైనవి. అయితే ఇలా టీటీడీ బోర్డు దారితప్పిపోవడం అనేది ఒక్కరోజులో జరిగిన మార్పు కాదు. కొన్నేళ్లుగా, ఇంకా చెప్పాలంటే దశాబ్దాలుగా జరిగిన మార్పు.
చాలాకాలం కిందటి వరకు కూడా కేవలం భగవంతుని సేవ పట్ల భక్తి, అనురక్తి, నిష్కామ సేవాభిలాష ఉన్నవారిని మాత్రమే బోర్డు సభ్యులుగా నియమిస్తూ వచ్చారు. కాలక్రమంలో అది రూపుమారింది.
ఇవాళ ఎమ్మెల్యే పదవికంటె కూడా చాలామంది టీటీడీ బోర్డు సభ్యత్వాన్ని విలువైనదిగా పరిగణిస్తున్నారంటే, టీటీడీ ఛైర్మన్ పదవిని మంత్రి, ఎంపీ పదవికంటె విలువైనదిగా చూస్తున్నారంటే.. అందుకు దారితీసిన కారణాలు అనేకం.
ఎలా మొదలైంది..?
టీటీడీ నిర్వహణ కోసం ప్రత్యేకంగా పాలకమండలి ఏర్పాటు బ్రిటిష్ కాలంలోనే జరిగింది. 1933లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో ఈ బోర్డును ఏర్పాటుచేసింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కొంత కాలానికి బోర్డు సభ్యుల సంఖ్య 11కు పెరిగింది. ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ లలో సుదీర్ఘంగా సాగిన కాంగ్రెస్ పరిపాలనలో ఎన్నడూ బోర్డులో సభ్యుల నియామకాలు వివాదాస్పదం కాలేదు. ఈ పదవులు ఇతర ప్రయోజనాలకు కూడా ఉపయోగపడేవిగా అప్పట్లో అంతగా గుర్తింపు లేదు. మిగిలిన పదవులతో పోలిస్తే వీటికి క్రేజ్ మాత్రం పుష్కలంగా ఉండేది.
అయితే.. కేవలం ఆధ్యాత్మిక చింతన ఉన్న వారికి మాత్రమే పదవులను కట్టబెట్టే పద్ధతి ఉండేది. కాంగ్రెస్ పాలన సాగినంత కాలమూ 1982 వరకు కూడా అదే పద్ధతి ఉండేది.
ఇంకో రకంగా చెప్పాలంటే పాలకమండలి నిర్ణయాల విషయంలో ప్రభుత్వ జోక్యం చాలాచాలా తక్కువగా ఉండేది. టీటీడీ ఛైర్మన్ పదవిలో ఉన్న వారు కూడా.. తిరుమల/తిరుపతిలో తిష్ట వేసుకుని ఉండేవారు కాదు. బోర్డు సమావేశాలు ఉన్న సమయంలో, బ్రహ్మోత్సవాల వేళలో వచ్చి, నిర్ణయాలు తీసుకుని తర్వాత మళ్లీ వెళ్లిపోయేవారు. ప్రభుత్వం రాజకీయనాయకుల జోక్యం తక్కువగా ఉండడంతో.. ఈవో స్థాయిలోని అధికారికే ఎక్కువ పవర్ ఉండేది.
టీటీడీ బోర్డు భగవత్సేవకే అన్నట్టుండేది తప్ప.. పెత్తనం చేయడానికి అన్నట్టుండేది కాదు. బోర్డు నిర్ణయాలు, వ్యవహారాలు సరైనవి అనిపించకపోతే.. అధికారులు వాటిని తిప్పికొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అప్పట్లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన చెప్పినా కూడా.. ఈవో పివిఆర్‌కె ప్రసాద్ ఖాతరు చేయకుండా.. వ్యవహరించిన సందర్భాలూ ఉన్నాయి.
ఎన్ టి రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత- బోర్డు రూపు మారడం మొదలైంది. రామారావు జమానా వచ్చేసరికి, అప్పటికి ఛైర్మన్ గా ఉన్న నాగిరెడ్డి రాజీనామా చేశారు. వికెడివి సత్యనారాయణ రాజును ఛైర్మనుగా రామారావు నియమించారు. వీరెవ్వరూ కూడా.. వాస్తవమైన టీటీడీ పరిపాలన వ్యవహారాలలో పెద్దగా జోక్యం చేసుకునే వారు కాదు.
సత్యనారాయణరాజు ఛైర్మన్ గా ఉన్న రోజుల్లో టీటీడీ ఏటా కొంత నిధులు సమకూర్చే శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వ్యవహారాల్లో వేలు పెట్టారు. అప్పటికి కాంగ్రెస్ ద్వారా నియమితులైన వీసీ జిఎన్ రెడ్డిని మార్చగల అధికారంలేని ప్రభుత్వం.. టీటీడీ జోక్యం ద్వారా రిజిస్ట్రార్‌ను మార్చడానికి వ్యూహరచన చేసింది. చాలా హైడ్రామా నడిచింది. ప్రత్యేక ఉత్తర్వుల తర్వాత టీటీడీ ఛైర్మన్ యూనివర్సిటీ సిండికేట్ మీటింగ్ లో ఓటు హక్కు ఉండే ఎక్స్ అఫీషియో మెంబర్ అయ్యారు. వారు సంకల్పించిన నియామకం చాలా పెద్ద రాజకీయ వివాదం అయింది.
ఎన్టీఆర్- తెలుగుదేశం ప్రభుత్వానికి కొరుకుడు పడని యూనివర్సిటీ వీసీ జిఎన్ రెడ్డి పదవీకాలం ముగుస్తున్న సమయంలో ముఖ్యమంత్రి పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి తిరుపతి వచ్చారు. వీసీని మార్చడానికి అప్పటికే బహువిధాల ప్రయత్నించి, అందుకు అవకాశం లేక, కాంగ్రెస్ నియమిత గవర్నరును ఒప్పించలేక ఆయన అహం బాగా దెబ్బతిని ఉంది. ఆ పరిణామాల పర్యవసానంగానే.. ఈ దేశంలో గవర్నరు వ్యవస్థను రద్దు చేయాలనే డిమాండ్, ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు నుంచి తొలిసారిగా తిరుపతి బహిరంగ సభలోనే వినిపించింది. ఆ రకంగా టీటీడీ వ్యవహారాలు రాజకీయ రంగు పులుముకుని, చర్చనీయాంశం కావడం మొదలైంది.
ఇవి కూడా చదవండి :
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
రోజా సీటు కింద పెద్దిరెడ్డి కుంపటి రాజేస్తున్నారా
మన విలువను వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవడం అవసరం
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
అప్పట్లో అధికార పార్టీకే చెందిన చంద్రబాబునాయుడు, ముద్దుకృష్ణమ నాయుడు తిరుపతి వచ్చి వీసీ జిఎన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలుచేశారు. చంద్రబాబుకు ఒక రకంగా రాజకీయ ఆజన్మ ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోటీ ధర్నాలు జరిగాయి. చంద్రబాబు, ముద్దుకృష్ణమ అండ్ కో అధికార పార్టీకి చెందిన వారే అయినప్పటికీ.. వారి ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గకుండా పోలీసులు చాలా సమర్థంగా వ్యవహరించారు. తెలుగుదేశం ఆందోళన కారులు.. ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ దాటి యూనివర్సిటీలోకి కనీసం అడుగుపెట్టలేకపోయారు.
ఇలాంటి అనేక పరిణామాల పర్యవసానంగానే.. ఈగో దెబ్బతిన్న ఎన్ టి రామారావు, 1984లో అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీల చట్టాన్నే మార్చారు. నిర్ణయాధికారం విషయంలో సిండికేట్ ను తొలగించి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చేశారు. గవర్నరు ద్వారా విసిని తొలగించగల వెసులుబాటు కూడా పెట్టుకున్నారు. అప్పటిదాకా ప్రభుత్వాలు మారినంత మాత్రాన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను తొలగించడం సాధ్యం కాని పని. టీటీడీ ఛైర్మన్ పదవి కూడా అలాంటిదే. ఇప్పటికి కూడా వారితో రాజీనామా చేయించాల్సిందే తప్ప.. పదవినుంచి తొలగించడం జరగని పని. (ఇంకా ఉంది)
.. బీరక రవి
సీనియర్ పాత్రికేయులు
Discussion about this post