రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు స్థానాలకు ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తిరుపతిలో జనసేనతో కలిసి బరిలో ఉన్న బీజేపీ.. చాలా ఎక్కువ కష్టమే పడుతోంది. అక్కడ ఏకంగా తిరుపతి ఎన్నికకోసం మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. తెలంగాణలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల నేపథ్యంలో ఇక్కడ కూడా గెలుస్తామని బీజేపీ అంటోంది.
అయితే.. స్థానికంగా అందుతున్న సమాచారాన్ని- సాగర్‌లో భారతీయ జనతా పార్టీకి పదివేల ఓట్లకు మించి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వారు ఏకంగా విజయం సాధిస్తాం అన్నంత ధీమా ప్రకటిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయి పరిస్థితులు వారికి పెద్దగా అనుకూలంగా లేవు.
దుబ్బాకలో బీజేపీ గెలిచిన నేపథ్యం వేరు. జీహెచ్ఎంసీ ఫలితాలు వారికి అనుకూలంగానే వచ్చాయి గానీ.. అది బలుపు అనుకుని వారు మురిసిపోయేలోగానే.. వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సిటింగ్ స్థానాన్ని కోల్పోవడం పెద్ద దెబ్బ. అలాంటిది సాగర్లో నెగ్గుతాం అని బీరాలు పలుకుతున్నారు.
కానీ.. క్షేత్రస్థాయి వాస్తవాల్ని చూస్తే.. నాగార్జున సాగర్ లో బీజేపీకి 10వేల ఓట్లు మించి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక్కడ అధికార తెరాసకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి బలమైన నాయకుడే అయినప్పటికీ.. నోముల నర్సింహయ్య మరణం వలన సానుభూతి.. ఆయన కుమారుడికి బాగా ప్లస్ అవుతుందనే అంచనా ఉంది. ఆ నేపథ్యంలో.. బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత… మరో హ్యాట్రిక్ పరాభవం తప్పదు.
దుబ్బాక ను ఎంతకాలమూ చూపించుకుంటూ.. రాష్ట్రమంతా రంకెలు వేయాలని అనుకుంటున్న బీజేపీ వ్యూహాలు సాగర్లో ఫలించకపోవచ్చునని పలువురు అంటున్నారు.
.

Discussion about this post